జానపద గాథల్లో, కలల ప్రపంచంలో మాత్రమే సాధ్యమయ్యే అద్భుత విజయాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సొంతం చేసుకుంది. మంగళవారం వెలువడిన ఫలితాలు కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు నేతృత్వం వహిస్తున్న బీజేపీని దిగ్భ్రమపరచడమే కాదు...విజేత ఆప్‌ను కూడా సంభ్రమాశ్చ ర్యాల్లో ముంచెత్తాయి. ఆప్ విజయాన్ని ఊహించిన సర్వేలు సైతం జనం ఇచ్చిన తీర్పు ముందు వెలవెలబోయాయి. అవన్నీ ఆప్‌కు పాలించడానికి చాలినన్ని స్థానాలను మాత్రమే ఇస్తే...ఢిల్లీ ప్రజానీకం ఆ పార్టీని అత్యున్నత శిఖరాగ్రాన కూర్చోబెట్టారు.
70 స్థానాలుండే అసెంబ్లీలో ఆప్‌కు 67 స్థానాలు లభించడ మంటే... మొత్తం స్థానాల్లో 95.7 శాతం ఆ పార్టీవే కావడమంటే... పోలైన ఓట్లలో 54.30 శాతం సొంతం కావడమంటే మాటలు కాదు. బహుశా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయం బీజేపీ తలకెక్కి ఉండకపోతే...దాని ప్రభావంతో అది వరస తప్పుటడుగులు వేయకపోతే ఆప్‌కు ఈ స్థాయి గెలుపు సాధ్యమయ్యేది కాదేమో! పుట్టి రెండేళ్లయినా కాని ఆప్ ఏడాదిన్నర వ్యవధిలో దిగ్గజాలనదగ్గ రెండు ప్రధాన పార్టీలను మట్టి కరిపించడం అసాధారణం. అపూర్వం!
సరిగ్గా నెలక్రితం- ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడానికి మూడు రోజుల ముందు జరిగిన తొలి ఎన్నికల ప్రచార సభలోనే ప్రధాని నరేంద్ర మోదీ కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగారు. ఆయన్ను నక్సలైటన్నారు...అరాచకవాదన్నారు. ఇలాంటి వ్యక్తి ఉండాల్సింది అడవుల్లోనేనన్నారు. పాలనకు కాదు...ధర్నాలకు మాత్రమే పనికొస్తాడన్నారు. ఆ రోజునుంచీ బీజేపీ నేతలందరికీ కేజ్రీవాల్ లక్ష్యమ య్యారు. తమకు సీఎం అభ్యర్థంటూ ఎవరూ లేరని చెప్పుకొచ్చిన పార్టీ హఠాత్తుగా కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవడంతో ఆగక ఆమెకు సీఎం అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది.
ఇది చాలదన్నట్టు పెద్దయెత్తున పార్టీ ఎంపీలనూ, ఎమ్మెల్యేలనూ అక్కడ దించారు. కేంద్ర మంత్రులు ప్రతి రోజూ ఆప్‌కు అయిదేసి ప్రశ్నలు చొప్పున సంధిం చారు. బీజేపీ నేతల ప్రసంగాల తీరు ఆ పార్టీ వ్యతిరేకులందరినీ ఒక్కచోటుకు చేర్చింది. ఆప్ నెగ్గడంకంటే కూడా బీజేపీ ఓడిపోవడమే ఏకైక ధ్యేయమన్నట్టు అన్ని వర్గాలూ పనిచేశాయి. అభివృద్ధి ఎజెండాగా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన సంగతిని విస్మరించి అందుకు విరుద్ధమైన ఘర్‌వాపసీ, హిందూ జనాభా పెంపు వంటి అంశా లను కొందరు బీజేపీ నేతలు చర్చకు తీసుకురావడం చాలామందికి రుచించలేదు.
దేశానికి ఢిల్లీ రాజధాని నగరమే కావొచ్చుగానీ అది ఒక చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అదే సమయంలో 70 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్న రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో ఎన్నికలను వాటి మానాన వాటిని జరగనిచ్చి ఉన్నా ఇప్పటిలా అధికారం సాధ్యమయ్యేది కాదేమోగానీ...మూడు స్థానాలు మాత్రమే లభించే దుర్గతి మాత్రం ఖచ్చితంగా తప్పేది. చేజేతులా ఈ ఎన్నికలను మహా సంగ్రామంగా...అరవింద్ కేజ్రీవాల్‌ను మహా ప్రత్యర్థిగా మార్చుకున్న ఘనత బీజేపీదే!
ఒక్కసారి వెనక్కివెళ్లి చూస్తే... 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 31 స్థానాలు గెల్చుకున్న బీజేపీకి మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి ఏడు పార్లమెంటు స్థానాలూ సొంతమయ్యాయి. వీటిని అసెంబ్లీ స్థానాలకు వర్తింపజేసి లెక్కేస్తే ఆ పార్టీకి 60 లభించినట్టయింది. ఇలా ఏడాది వ్యవధిలోనే అక్కడ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోగలిగిన పార్టీ అంతకన్నా వేగంతో పతనమైం దంటే సాధారణమైన విషయం కాదు. యుద్ధంలో దిగే పక్షానికి తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో తెలియాలి. వారి వ్యూహం ఎలాంటిదో అంచనాలుండాలి. అందుకను గుణంగా తన వ్యూహాన్ని రూపొందించుకోవాలి.
ఢిల్లీలో ప్రధాన ప్రత్యర్థిని సరిగానే పోల్చుకున్నా వారి వ్యూహాన్ని, పోకడలను ఆకళింపు చేసుకునే క్రమంలో బీజేపీ ఘోర తప్పిదాలకు పాల్పడింది. ఇది కేజ్రీవాల్‌కూ, మోదీకీ మధ్య జరిగే సంగ్రామమని ఆప్ చెప్పగానే...దాన్నుంచి తప్పించుకోవడానికి అచ్చం కేజ్రీవాల్ తరహాలోనే అవినీతి వ్యతిరేకోద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకుని ఆమెకు సీఎం అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అవలీలగా ఎదుర్కోగలిగిన సమర్ధ నేతలు పార్టీలో ఉండగా బయ టినుంచి బేడీని తీసుకురావడం శ్రేణులకు మింగుడుపడలేదు. ఈ అసంతృప్తి వారిలో నానాటికీ పెరిగిపోగా...ఆమెను తీసుకురావడానికి గల మూల కారణాన్నే బీజేపీ నేతలు మరిచారు. ఢిల్లీని సురక్షిత నగరంగా మార్చడానికి మాజీ పోలీసు అధికారిణిగా ఆమె మాత్రమే సరైనవారన్న భావనతో సీఎం అభ్యర్థిగా తీసుకొచ్చా మని చెప్పుకున్నారు.
సహజంగానే పోలీసు అధికారిణిగా తీస్‌హజారి కోర్టు న్యాయ వాదులపై లాఠీచార్జి చేయించడం మొదలుకొని ఆమె తీసుకున్న కఠిన చర్యలన్నీ చర్చకొచ్చాయి. అటు కేజ్రీవాల్ ‘పొరుగింటి మనిషి’గా కనిపిస్తూ, గతంలో తమవైపు నుంచి జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పారు. తాము ఎలాంటి ఢిల్లీని రూపొందించదల్చుకున్నామో ఓటర్లకు వివరించారు. వారు నిత్యం ఎదుర్కొనే మంచినీరు, విద్యుత్తు వంటి అంశాల గురించి మాట్లాడారు. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి లభిస్తే ఎన్ని సమస్యలు పరిష్కారం కాగలవో అవగాహన కల్పించారు. అదే సమ యంలో క్రితం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘రాష్ట్ర ప్రతిపత్తి’ అంశాన్ని బీజేపీ ఈసారి విస్మరించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఆప్ కార్యకర్తలు గడపగడపకూ పార్టీ సందేశాన్ని చేరిస్తే...అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న బీజేపీ శ్రేణులు తమ నాయకగణం చేసిన తప్పులతో నైతిక సై్థర్యం కోల్పోయి జనాన్ని ఒప్పించలేకపోయాయి. ఇక వరస వైఫల్యాలతో చేవ చచ్చిన కాంగ్రెస్... అచ్చం ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఢిల్లీలో కూడా సున్నా చుట్టింది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే అయినా బీజేపీ పొందిన ఓటమి అసాధారణమైనది. ఇది ఆ పార్టీకి మాత్రమే కాదు...విజయగర్వంతో తప్పిదాలకు పాల్పడుతున్న పాలక పార్టీలన్నిటికీ పెద్ద గుణపాఠం.
‘ఆప్’ సునామీ!
Published Tue, Feb 10 2015 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement