మోదీ మయన్మార్ యాత్ర
మూడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్‌లో పర్యటించారు. 2014లో ఆయన కేవలం ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మాత్రమే వెళ్లారు. ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల కోసం పర్యటించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం మయన్మార్ అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. గత కొన్ని నెలలుగా అక్కడి సైన్యం రోహింగ్యా ముస్లింలపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గత నెల 25న రోహింగ్యా మిలి టెంట్ సంస్థ రఖినే రాష్ట్రంలో పోలీసు, సైనిక పికెట్లపై దాడులు చేసి 12మంది అధికారులను హతమార్చడంతో ఈ సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత మయన్మార్ భద్రతా దళాలు సాగిస్తున్న దమనకాండ అంతా ఇంతా కాదు. వారి కాల్పుల్లో 400మంది జనం మరణించగా, లక్షన్నరమందికి పైగా పొరుగు నున్న బంగ్లాదేశ్‌కు ప్రాణాలు అరచేతబట్టుకుని వలసపోతున్నారు.
ఈ క్రమంలో అనేకమంది నీటిలో మునిగి చనిపోవడం, వ్యాధుల బారిన పడటం సంగతలా ఉంచి మయన్మార్ సైన్యం అమర్చిన మందుపాతరలు పేలి ప్రాణాలు కోల్పో తున్నారు. తీవ్ర గాయాలపాలై బంగ్లాదేశ్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అత్యాచా రాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మయన్మార్‌పై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నది. మానవ హక్కుల్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు చెబుతోంది. ఇలాంటి సమయంలో నరేంద్ర మోదీ మయన్మార్ వెళ్లారు.
మన పొరుగు దేశంలో ఒక సంక్షోభం తలెత్తినప్పుడు, ఆ సంక్షోభం ప్రభావం మన దేశంపై కూడా పడకతప్పదని అర్ధమవుతున్నప్పుడు మౌనంగా ఉండటం ఇబ్బందికరమే. పైగా ఆ దేశంలో జరుగుతున్నది మానవ ఉత్పాతం. మెజారిటీగా ఉన్న బుద్ధిస్ట్‌ల నుంచి మాత్రమే కాదు... వారికి వత్తాసుగా వచ్చిపడే సైన్యం నుంచి కూడా రోహింగ్యాలు అణచివేతను ఎదుర్కొంటూ అక్కడ రెండో తరగతి పౌరులుగా కాలం వెళ్లదీస్తున్నారు.
1978 నుంచి క్రమం తప్పకుండా చెలరేగుతున్న హింసాకాండ వల్ల ఇప్పటికే దాదాపు నాలుగు లక్షలమంది రోహింగ్యాలు పొరు గునున్న బంగ్లాదేశ్‌కూ, మన దేశంతో సహా మరికొన్ని ఇతర దేశాలకూ వలసపో యారు. సముద్రం మీదుగా మలేసియా, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌లకు చేరడం కోసం చిన్న చిన్న పడవల్లో వెళ్లున్న వేలాదిమంది మధ్యలోనే జలసమాధి అవు తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు వెళ్లేవారు కూడా ఇలాంటి ప్రమాదాల్లోనే చిక్కుకుంటున్నారు. మయన్మార్ నుంచి వస్తున్న శరణార్ధుల వల్ల మన దేశానికి కూడా సమస్యలొస్తున్నాయి. అలా వచ్చేవారికి తగిన ఉపాధి చూపలేక ప్రభుత్వ యంత్రాంగం సతమతమవుతున్నది.
నరేంద్ర మోదీ పర్యటనలో భారత్–మయన్మార్‌ల మధ్య సాగర ప్రాంత భద్రత, మయన్మార్ ప్రజాతంత్ర సంస్థల బలోపేతం, ఆరోగ్యం, ఐటీ రంగాల్లో సహకారంతోసహా 11 ఒప్పందాలు కుదిరాయి. రఖినేలో తలెత్తిన రోహింగ్యా సంక్షోభం గురించి...ఆ విషయంలో అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి మోదీ ప్రస్తావించకపోవచ్చుగానీ రఖినే రాష్ట్రంలో మన దేశం విస్తృత స్థాయిలో సహాయ కార్యక్రమాలు అమలు చేయడానికి మాత్రం ఆ పాలకులను ఒప్పించారు. రోహింగ్యాల విషయంలో ఇంతకుమించి ఏమీ చేయలేకపోవడం చాలామందిని నొప్పించి ఉండొచ్చు. మయన్మార్ మానవ హక్కుల హననంపై ఐక్యరాజ్యసమితి, పలు ప్రపంచ దేశాలు మొదలుకొని మన దేశంలోని ప్రజా స్వామ్య ఉద్యమకారుల వరకూ అందరూ ఆగ్రహంతో ఉన్నారు. కానీ ఒకపక్క మన దేశంలో ఉంటున్న రోహింగ్యా శరణార్ధులను అక్రమంగా వలసవచ్చిన వారిగా నిర్ధారించి బలవంతాన పంపేయడానికి సిద్ధపడుతూ మానవహక్కుల గురించి మయన్మార్‌కు ఉద్బోధించడం కష్టం.
అదీగాక మయన్మార్‌తో మనకు ఈశాన్యం వైపు 1,600 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది. మిజోరం, మణిపూర్, నాగా లాండ్, అరుణాచల్‌ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాలు ఆ సరిహద్దు పొడవునా ఉన్నాయి. ఎన్‌ఎస్‌సీఎన్(ఖాప్లాంగ్) వంటి మిలిటెంట్ సంస్థలు మయన్మార్ భూభాగంలో తలదాచుకుంటూ ఈ రాష్ట్రాల్లో హింసకు పాల్పడుతుంటాయి. మయన్మార్ సహకారం లేనిదే ఇలాంటి వీటిని అదుపు చేయడం అసాధ్యం. దానికితోడు మయన్మార్ సైనిక పాలకులను వ్యతిరేకిస్తే వారు చైనాతో చెలిమి చేసి మన దేశానికి సమస్యలు సృష్టిస్తారన్న భయం ఉండనే ఉంది. ఏతావాతా మన భద్రతే ముఖ్యం తప్ప, పొరుగు దేశంలో ఏం జరిగినా అనవసరం అని మన పాలకులంతా ఎప్పుడో నిర్ణయానికొచ్చారు.
ఒకప్పుడు ఈ వైఖరి ప్రస్తుత మయన్మార్ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీకి కోపం తెప్పించింది. ప్రజాస్వామ్య ఉద్యమ సారథిగా 2012లో ఆమె మన దేశం వచ్చినప్పుడు మన పాలకులను నిష్టూరమాడారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, తర్వాతా ప్రజా స్వామిక ఉద్యమాలకు నైతిక మద్దతు అందించిన భారత్ ఆపత్కాలంలో మయ న్మార్ ప్రజలను వదిలిపెట్టిందని ఆనాటి ప్రధాని మన్మోహన్ సమక్షంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి రోహింగ్యాల విషయంలో నరేంద్ర మోదీ ఇప్పుడా పని చేసి ఉంటే సూచీ ఆగ్రహం పట్టలేకపోయేవారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పాలక వ్యవస్థలో భాగంగా మారారు.
అయితే మన ప్రయోజనాల పరిరక్షణతోపాటే మయన్మార్ పాలకులు హేతుబద్ధంగా వ్యవహరించేలా చూడటం కూడా అవసరం. ఎందుకంటే ప్రస్తుత సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే మన దేశానికి ఇప్పటికే ఉన్న శరణార్థుల సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. అందువల్ల ఏదో స్థాయిలో మయన్మార్‌కు చెప్పడమే మంచిది. అక్కడి ప్రజాతంత్ర సంస్థల్ని బలోపేతం చేయడమంటే కేవలం ఎన్నికల సంఘంలాంటి సంస్థల నిర్మాణానికి సాయపడటం మాత్రమే కాదు... ప్రజాస్వామిక భావనలను పెంపొందించడం కూడా. ఆ పని చేయడంతోపాటు ఇక్కడున్న రోహింగ్యాలను వెనక్కు పంపే ఆలోచన కూడా మన ప్రభుత్వం మానుకోవాలి.