ఉన్నత విద్య అందని ద్రాక్ష | private universities bill in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య అందని ద్రాక్ష

Published Wed, Jan 14 2015 12:44 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

private universities bill in andhra pradesh

చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కనుమరుగయ్యే ప్రమాదముంది. విద్యా కేంద్రాలు ఫక్తు వ్యాపార కేంద్రాలు కానున్నాయి. పేదవారికి ఉన్నత విద్య దూరం కానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యారంగంలో తీవ్ర సంస్కరణలను అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ర్టంలో ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్య మొత్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల చుట్టూ తిరుగుతోంది. ఇంట ర్మీడియెట్ విద్య పూర్తిగా కార్పొరేట్ సంస్థల చేతుల్లో చిక్కుకుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ పుణ్యమా అని ఉన్నత విద్యలో కూడా ప్రైవేట్ ఆధిపత్యం పెరగనుంది. దేశంలో ఉన్నత విద్యను 12 శాతం మంది మాత్రమే అభ్యసిస్తున్నారు.

ఇప్పుడు యూనివర్సిటీ విద్యలోకి ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు చొరబడుతున్నందున పేదవారికి ఉన్నత విద్య ఇక అందని ద్రాక్షే. రాష్ట్రంలో విశ్వవిద్యాల యాలు అస్తవ్యస్తంగా ఉన్నాయనే సాకుతో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును తీసుకువస్తు న్నట్లు ప్రభుత్వం చేస్తున్న వాదన బడుగు, బలహీన వర్గాలను నిరాశపరుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ విశ్వవిద్యా లయాల బిల్లును ప్రవేశపెట్టనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 20 ప్రభుత్వ, 5 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అరకొర నిధులతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభు త్వ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయి. ఆదా యవనరుల లేమితో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, దూర విద్య కేంద్రాలను ప్రవేశపెడుతున్నారు. అన్ని వర్సిటీలూ లోటు బడ్జెట్‌తోనే ఉన్నాయి. ప్రతి విశ్వవిద్యాల యానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20 నుంచి రూ.50 కోట్లను మాత్రమే ఇస్తోంది. మిగతా లోటును పూడ్చుకో వడానికి ఫీజులను పెంచుతున్నారు. దూరవిద్యా కేంద్రాల ద్వారా రాబడుతున్నారు. యూజీసీ కూడా అంతంతమాత్రం గానే నిధులు మంజూరు చేస్తోంది.

మౌలిక సదుపా యాలు అటకెక్కి పరిశోధనల్లో ప్రమాణాలు లోపిస్తున్నాయి. ఒక్క వర్సిటీలో కూడా పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది లేదు. రాష్ట్రంలో అతి పెద్దవిగా పేరొందిన ఆంధ్ర, నాగార్జున, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో కాం ట్రాక్టు లెక్చరర్లను నియమించడం విడ్డూరం. కొత్తగా ఏర్పడిన రాయలసీమ, కృష్ణా, ఆదికవి నన్నయ్య, అంబేద్కర్, యోగివేమన యూనివర్సిటీల నిర్వహణ దారుణంగా ఉంది. కొత్త విశ్వవిద్యాలయాలకు కనీసం రూ.50 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభు త్వం రూ.5 కోట్లు విసిరి చేతులు దులుపుకుంది.

కేంద్ర ప్రభుత్వం 1995లో మొదటిసారిగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును తీసుకొచ్చింది. 30 శాతం సీట్ల ను ఫీజులు లేకుండా భర్తీచేయాలని, అనుమతి పొం దడానికి రూ.10 కోట్ల నిధిని ఏర్పర్చాలని, ఫీజులపై ప్రతి యేడూ యూజీసీకి నివేదిక ఇవ్వాలని, ప్రైవేట్ వర్సిటీలపై ప్రభుత్వానికి నియంత్రణ హక్కు ఉంటుం దని బిల్లు ముసాయిదాలో స్పష్టం చేశారు. కానీ ఇప్పటికే ఉనికిలో ఉన్న ప్రైవేట్ వర్సిటీలు పైన చెప్పిన ప్రమాణా లను విస్మరించి విద్యావ్యాపారం కొనసాగిస్తున్నాయి. దేశంలో 113 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గడ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ వర్సిటీలు తిష్ట వేశాయి. వీటిలో విద్య సామాజిక అంశంగా పోయి, ఉత్పత్తి ప్రక్రియలో చేసిన ఉత్పత్తిని వ్యాపారంలో పెట్టడంగా మారింది.

దేశంలో ఏ ఒక్క ప్రైవేట్ వర్సిటీ కూడా యూజీసీ నిబంధనలు అమలు చేయడంలేదు. సామా జిక శాస్త్రాలకు సంబంధించి ఒక్క కోర్సు కూడా ప్రవేశ పెట్టడం లేదు. ఆ రాష్ట్ర మాతృభాషా కోర్సులు లేక పోగా, ఎంఎన్‌సీల మార్కెట్‌కు అవసరమైన కోర్సుల రూపకల్పన ఉంటుంది. దీంతో విద్యార్థులను పూర్తిగా మేధోబానిసలను తయారు చేసే ఉత్పత్తి యంత్రాలుగా మార్చుతున్నారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ప్రైవేట్ యూని వర్సిటీ బాగోతంపై సుప్రీం కోర్టు స్పందించి ఏకంగా 112 వర్సిటీలను రద్దు చేసేంతవరకు వచ్చింది.

రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను అభివృద్ధి చేయ కుండా ఉన్నత విద్యా మార్కెట్‌ను అతి పెద్ద వ్యాపార రంగంగా మార్చబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తెలు గు కోర్సుల జాడ కనిపించదు. యూనివర్సిటీల్లో గొప్ప గా చెప్పుకునే సామాజిక కోర్సులు అంతరించిపోతాయి. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పరిశోధనలు జరగవు. వ్యవసాయ కోర్సులు, పరిశోధనలు అసలుండవు. కొద్దికాలంలోనే రాష్ట్ర యూనివర్సిటీలు అంతరించి పోయి ఉన్నత విద్య ప్రభుత్వ అధీనం నుంచి కార్పొరేట్ పరమౌతుంది. రిజర్వేషన్‌ల ఆచూకీ కూడా ఉండదు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమౌతారు. డీమ్డ్ యూనివర్సిటీలలో ఇప్పటికే జరు గుతున్న పరిణామాలను చూస్తే విద్యా కేంద్రాలు ఫక్తు వ్యాపార కేంద్రాలుగా మారబోతున్నాయి. వీటిని పరిగ ణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ప్రైవేట్ వర్సిటీల బిల్లును తీసుకురావడానికి ప్రయ త్నించడం గర్హనీయం.

వర్సిటీ విద్యను అంగడి సరుకుగా మార్చి, పేదవా రికి ఉన్నత విద్య దొరకకుండా చేస్తున్న ప్రభుత్వ కుట్ర లకు వ్యతిరేకంగా విద్యార్థి సంస్థలు,  సామాజికవేత్తలు, రాజకీయ పార్టీలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతి రేకించడం సామాజిక బాధ్యత కావాలి. దీన్ని ఒక రాజకీయ ఎజెండా తీసుకురావాలి. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో జరిగే పరిణామాలను ఇక్కడ విద్యార్థి లోకం చవిచూడ కూడ దంటే ఇలాంటి బోగస్ వర్సిటీలకు సంబంధించిన బిల్లును ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలి.

(వ్యాసకర్త ఎస్‌ఎఫ్‌ఐ మాజీ అధ్యక్షులు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్: 9441744061)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement