private universities bill
-
అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెం ట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2018ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జీవో 17 జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. గతేడాది మార్చి 28వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం బిల్లు పాస్ అయింది. అదే ఏడాది దానిపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే అమల్లోకి తెస్తుందని అంతా భావించారు. కాని గతేడాది దానిని అమల్లోకి తేలేదు. తాజాగా సోమవారం చట్టం అమలుకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం లేదా గురువారం జారీ చేసే అవకాశముంది. తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతిచ్చినా వచ్చే విద్యా సంవత్సరమే అవి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. చట్టంలోని ప్రధాన అంశాలు.. నాణ్యతతో కూడిన విద్య, పరిశోధనలకు ప్రాధాన్యం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా.. ఆధునిక పరిస్థితులకు పెద్ద పీట వేస్తూ ప్రపంచస్థాయి యూనివర్సిటీలను ఈ చట్టం ద్వారా ఏర్పాటుకు అనుమతిస్తున్నాం. ఈ చట్టం కింద ఏర్పాటయ్యే విద్యా సంస్థల కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కోర్సుల నిర్వహణ, ప్రవేశాల విధానం ఆయా యూనివర్సిటీలే నిర్ణయిస్తాయి. తెలంగాణ విద్యార్థులకు మాత్రం 25 శాతం సీట్లు కల్పించాలి. వాటిల్లో ఫీజులను యూనివర్సిటీనే నిర్ణయిస్తుంది. ప్రతి వర్సిటీ ఫీ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలి. ఆ కమిటీలో బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్, అకడమిక్ కౌన్సిల్‌కు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. లింగ వివక్ష, ప్రాంతం, కులం, పుట్టిన ప్రదేశం, మతం, రాజకీయ కోణం, ఇతర కారణా లతో ఎవరికీ ప్రవేశాలను తిరస్కరించడానికి వీల్లేదు. ఈ నిబంధనలు కొత్తగా వర్సిటీని ఏర్పాటు చేసే సంస్థలకు వర్తిస్తాయి. తెలంగాణలో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలు యూనివర్సిటీగా ఏర్పడితే ప్రవేశాల్లో పాత విధానమే అమలు చేయాలి. సీట్ల భర్తీలో ఇప్పుడున్న రూల్ ఆఫ్ రిజర్వేషనే వర్తిస్తుంది. ఫీజు విధానం కూడా ఇప్పుడున్న ప్రకారమే కొనసాగుతుంది. తెలంగాణ ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిర్ణయించిన ప్రకారమే కొనసాగుతాయి. యూనివర్సిటీలు ఏర్పాటైన ఐదేళ్లలోగా నేషనల్ అసేస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందాలి. యూనివర్సిటీలకు ఎంత భూమి ఉండాలి.. కార్ఫస్ ఫండ్ ఎంత పెట్టాలన్న నిబంధనను చట్టంలో పొందుపర్చలేదు. నిర్ణీత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని మాత్రం పేర్కొంది. ఈ యూనివర్సిటీలు యూజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ, ఎన్సీటీఈ తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థల నిబంధనలకు లోబడే కోర్సులను రూపొందించాలి. యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థల దరఖాస్తులను (ప్రాజెక్టు రిపోర్టులను) పరిశీలించి, అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తుంది. ప్రాజెక్టు రిపోర్టు వచ్చిన నెలలో ఆమోదించడమా? రిజెక్టు చేయడమా? అన్న దానిపై నిపుణుల కమిటీ నిర్ణయాన్ని తెలుపుతుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ రూపంలో ఇస్తుంది. అనుమతిచ్చిన ఏడాదిలోగా వర్సిటీని ఏర్పాటు చేయాలి. నాన్ ప్రాఫిట్ సొసైటీ, పబ్లిక్ ట్రస్టు, కంపెనీలు స్పాన్సరింగ్ బాడీగా ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయవచ్చు. వర్సిటీకి చాన్స్‌లర్ ఉంటారు. యూనివర్సిటీని ఏర్పాటు చేసిన సంస్థ చాన్స్‌లర్‌ను నియమిస్తుంది. ఆయన ముగ్గురు సభ్యులు కలిగిన ప్యానల్ నుంచి ఒకరిని వైస్ చాన్స్‌లర్‌గా నియమిస్తారు. తొలగించే అధికారం ఆయనకే ఉంటుంది. 70 ఏళ్లలోపు వారిని వీసీగా నియమిస్తారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. అయితే మొదటిసారి మాత్రం ఏడాదే ఉంటుంది. రిజిస్ట్రార్‌ను చాన్స్‌లరే నియమిస్తారు. యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిధిలోనే ఏర్పాటు చేయాలి. ఇవి మరే కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు. ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, ప్రత్యేకమైన కోర్సులను, పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ వర్సిటీలు రెండు అదనపు క్యాంపస్‌లు/సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. ఇవీ నాణ్యతా ప్రమాణాలు, వాస్తవిక అవసరాల మేరకు ఉంటాయి. అయితే ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో అదనపు క్యాంపస్‌ల ఏర్పాటుకు అనుమతివ్వవచ్చు. ఐదేళ్లలో అక్కడ కల్పించే మౌలిక సదుపాయాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్స్ ఉండవు. గౌరవ డిగ్రీలు కూడా ఇచ్చుకోవచ్చు. ప్రపంచంలో ఏ యూనివర్సిటీతోనైనా ఒప్పందం చేసుకోవచ్చు. నిధుల సేకరణ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఇతర దేశాల నుంచి కూడా నిధులు సేకరించుకోవచ్చు. యూనివర్సిటీల గవర్నింగ్ బాడీలో మెంబర్‌గా కార్యదర్శి, ఆ పైస్థాయి ప్రభుత్వ అధికారి ఉంటారు. ఏడాదికి నాలుగుసార్లు గవర్నింగ్ బాడీ సమావేశం కావాలి. ప్రభుత్వం సూచనలు మాత్రమే ఇస్తుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం జోక్యం చేసుకుంటుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా యూనివర్సిటీ మూసివేయొద్దు. -
‘ప్రైవేట్ వర్సిటీ బిల్లును నిలిపేయాలి’
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేట్ వర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదించడంపై డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయులు శంతన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యను అమలు చేస్తామని చెప్పి... నేడు ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహించే విధంగా బిల్లు తేవడం శోచనీయమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజన్న, రాం దాస్, విజయ్, బాలయ్య, తదితరులున్నారు. -
ప్రపంచ స్థాయి ప్రమాణాల కోసమే....
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలున్నవిద్యావకాశాల కోసమే ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనతో తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ‘ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన, నియంత్రణ బిల్లు’ను శాసన మండలి ఆమోదించింది. ఈ సందర్భంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ యువతకు విద్యావకాశాలు విస్తృతం చేయడం కోసమే ప్రైవేట్ యూనివర్సీటీలకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసమే 25 శాతం తెలంగాణ వాసులకు దక్కేలా నిబంధన విధించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయని గుర్తుచేశారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి ఆ యూనివర్సిటీలు పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్సష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే అత్యధిక ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో ఒకలా...ఇక్కడ మరో విధంగా భాజపా విధానం ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవసరానికి మించిన కాలేజీలు ఉన్నాయని, వాటిని నియంత్రిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే 1016 పోస్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చామన్నారు. -
అసెంబ్లీ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ఉపసంహరించుకోక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. మంగళవారం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ వామపక్ష విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడిని చేపట్టాయి. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ముట్టడిలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. -
'ఆ బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం'
-
'ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం'
హైదరాబాద్ : 25 మంది కార్పొరేట్ శక్తుల కోటరీ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తోందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని వారు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ బిల్లును వ్యాపార ధృక్పథంతో తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. ఈ బిల్లు వల్ల విద్యార్థులకు పూర్తిగా నష్టం కలుగుతుందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండా చేసి ఇంతమందికి అన్యాయం చేసే బిల్లును శాసనసభలో పాస్ చేసుకోవడం దురదృష్టమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుని... కార్పొరేట్ చేతుల్లో పెట్టిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సర్కార్ విద్యా, వైద్యాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టేస్తోందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి చేతులు రావడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై వారు నిప్పులు చెరిగారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాల్లో జల్సాలు చేయడానికి మాత్రం రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ యూనివర్శిటీలను ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు అన్నారు. -
'21న అసెంబ్లీలో ప్రైవేటు వర్సిటీల బిల్లు'
మహారాణిపేట (విశాఖపట్నం) : ఈ నెల 21న శాసనసభలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విశాఖలో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ వీసీల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్ని వర్సిటీల్లో ఒకే విధానం కోసం ఈ బిల్లును తీసుకురానున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో న్యాయమైన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రైవేటు వర్సిటీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. -
మంత్రి గంటా ఇల్లు ముట్టడి
చెదరగొట్టిన పోలీసులు తోపులాటలో పడి విద్యార్థి నేతలకు గాయాలు ఎంవీపీకాలనీ(విశాఖ): ప్రైవేట్యూనివర్సిటీల బిల్లును వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్థి నాయకులు సోమవారం నగరంలోని ఎంవీపీకాలనీలోని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకున్నారు. ఇది తెలుసుకుని కోపోద్రిక్తులైన ఏబీవీపీ విద్యార్ధి నాయకులు గంటా ఇంటి ఎదుట ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో పోలీసులు వారిని చెల్లాచెదురుచేశారు. దీంతో తోపులాటలో కొందరు కింద పడిపోయారు. ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు వాసు చొక్కా చిరిగిపొయింది. కడుపు మీద గాయమయింది. మరో విద్యార్ధి నాయకుడికి చేతిపై గాయమయింది. విద్యార్థి నాయకుల నినాదాలతో అప్రాంతం హోరెత్తింది. మంత్రి గంటా శ్రీనివాసరావు కార్పొరేట్ శక్తులకు మంత్రి కొమ్ముకాస్తున్నరని నినాదాలు చేశారు. 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి పి. సురేష్, ఎబివిపి ఆంధ్రాయూనివర్శిటి ఇన్చార్జి జి.రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెన్నా సురేష్, సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలగిరిరాజు, వి. మోహన్ యాదవ్, సాయికష్ణ, శేఖర్, ఏయూ పిహెచ్డి స్కాలర్స్ హేమ. జగదీష్, కార్తీకేయ,మణికంఠ, సూర్య, వంశీ యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్య అందని ద్రాక్ష
చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కనుమరుగయ్యే ప్రమాదముంది. విద్యా కేంద్రాలు ఫక్తు వ్యాపార కేంద్రాలు కానున్నాయి. పేదవారికి ఉన్నత విద్య దూరం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యారంగంలో తీవ్ర సంస్కరణలను అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ర్టంలో ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్య మొత్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల చుట్టూ తిరుగుతోంది. ఇంట ర్మీడియెట్ విద్య పూర్తిగా కార్పొరేట్ సంస్థల చేతుల్లో చిక్కుకుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ పుణ్యమా అని ఉన్నత విద్యలో కూడా ప్రైవేట్ ఆధిపత్యం పెరగనుంది. దేశంలో ఉన్నత విద్యను 12 శాతం మంది మాత్రమే అభ్యసిస్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ విద్యలోకి ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు చొరబడుతున్నందున పేదవారికి ఉన్నత విద్య ఇక అందని ద్రాక్షే. రాష్ట్రంలో విశ్వవిద్యాల యాలు అస్తవ్యస్తంగా ఉన్నాయనే సాకుతో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును తీసుకువస్తు న్నట్లు ప్రభుత్వం చేస్తున్న వాదన బడుగు, బలహీన వర్గాలను నిరాశపరుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ విశ్వవిద్యా లయాల బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 20 ప్రభుత్వ, 5 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అరకొర నిధులతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభు త్వ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయి. ఆదా యవనరుల లేమితో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, దూర విద్య కేంద్రాలను ప్రవేశపెడుతున్నారు. అన్ని వర్సిటీలూ లోటు బడ్జెట్‌తోనే ఉన్నాయి. ప్రతి విశ్వవిద్యాల యానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20 నుంచి రూ.50 కోట్లను మాత్రమే ఇస్తోంది. మిగతా లోటును పూడ్చుకో వడానికి ఫీజులను పెంచుతున్నారు. దూరవిద్యా కేంద్రాల ద్వారా రాబడుతున్నారు. యూజీసీ కూడా అంతంతమాత్రం గానే నిధులు మంజూరు చేస్తోంది. మౌలిక సదుపా యాలు అటకెక్కి పరిశోధనల్లో ప్రమాణాలు లోపిస్తున్నాయి. ఒక్క వర్సిటీలో కూడా పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది లేదు. రాష్ట్రంలో అతి పెద్దవిగా పేరొందిన ఆంధ్ర, నాగార్జున, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో కాం ట్రాక్టు లెక్చరర్లను నియమించడం విడ్డూరం. కొత్తగా ఏర్పడిన రాయలసీమ, కృష్ణా, ఆదికవి నన్నయ్య, అంబేద్కర్, యోగివేమన యూనివర్సిటీల నిర్వహణ దారుణంగా ఉంది. కొత్త విశ్వవిద్యాలయాలకు కనీసం రూ.50 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభు త్వం రూ.5 కోట్లు విసిరి చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వం 1995లో మొదటిసారిగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును తీసుకొచ్చింది. 30 శాతం సీట్ల ను ఫీజులు లేకుండా భర్తీచేయాలని, అనుమతి పొం దడానికి రూ.10 కోట్ల నిధిని ఏర్పర్చాలని, ఫీజులపై ప్రతి యేడూ యూజీసీకి నివేదిక ఇవ్వాలని, ప్రైవేట్ వర్సిటీలపై ప్రభుత్వానికి నియంత్రణ హక్కు ఉంటుం దని బిల్లు ముసాయిదాలో స్పష్టం చేశారు. కానీ ఇప్పటికే ఉనికిలో ఉన్న ప్రైవేట్ వర్సిటీలు పైన చెప్పిన ప్రమాణా లను విస్మరించి విద్యావ్యాపారం కొనసాగిస్తున్నాయి. దేశంలో 113 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గడ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ వర్సిటీలు తిష్ట వేశాయి. వీటిలో విద్య సామాజిక అంశంగా పోయి, ఉత్పత్తి ప్రక్రియలో చేసిన ఉత్పత్తిని వ్యాపారంలో పెట్టడంగా మారింది. దేశంలో ఏ ఒక్క ప్రైవేట్ వర్సిటీ కూడా యూజీసీ నిబంధనలు అమలు చేయడంలేదు. సామా జిక శాస్త్రాలకు సంబంధించి ఒక్క కోర్సు కూడా ప్రవేశ పెట్టడం లేదు. ఆ రాష్ట్ర మాతృభాషా కోర్సులు లేక పోగా, ఎంఎన్సీల మార్కెట్‌కు అవసరమైన కోర్సుల రూపకల్పన ఉంటుంది. దీంతో విద్యార్థులను పూర్తిగా మేధోబానిసలను తయారు చేసే ఉత్పత్తి యంత్రాలుగా మార్చుతున్నారు. ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ప్రైవేట్ యూని వర్సిటీ బాగోతంపై సుప్రీం కోర్టు స్పందించి ఏకంగా 112 వర్సిటీలను రద్దు చేసేంతవరకు వచ్చింది. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను అభివృద్ధి చేయ కుండా ఉన్నత విద్యా మార్కెట్‌ను అతి పెద్ద వ్యాపార రంగంగా మార్చబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తెలు గు కోర్సుల జాడ కనిపించదు. యూనివర్సిటీల్లో గొప్ప గా చెప్పుకునే సామాజిక కోర్సులు అంతరించిపోతాయి. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పరిశోధనలు జరగవు. వ్యవసాయ కోర్సులు, పరిశోధనలు అసలుండవు. కొద్దికాలంలోనే రాష్ట్ర యూనివర్సిటీలు అంతరించి పోయి ఉన్నత విద్య ప్రభుత్వ అధీనం నుంచి కార్పొరేట్ పరమౌతుంది. రిజర్వేషన్ల ఆచూకీ కూడా ఉండదు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమౌతారు. డీమ్డ్ యూనివర్సిటీలలో ఇప్పటికే జరు గుతున్న పరిణామాలను చూస్తే విద్యా కేంద్రాలు ఫక్తు వ్యాపార కేంద్రాలుగా మారబోతున్నాయి. వీటిని పరిగ ణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ప్రైవేట్ వర్సిటీల బిల్లును తీసుకురావడానికి ప్రయ త్నించడం గర్హనీయం. వర్సిటీ విద్యను అంగడి సరుకుగా మార్చి, పేదవా రికి ఉన్నత విద్య దొరకకుండా చేస్తున్న ప్రభుత్వ కుట్ర లకు వ్యతిరేకంగా విద్యార్థి సంస్థలు, సామాజికవేత్తలు, రాజకీయ పార్టీలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతి రేకించడం సామాజిక బాధ్యత కావాలి. దీన్ని ఒక రాజకీయ ఎజెండా తీసుకురావాలి. ఛత్తీస్గడ్ రాష్ట్రంలో జరిగే పరిణామాలను ఇక్కడ విద్యార్థి లోకం చవిచూడ కూడ దంటే ఇలాంటి బోగస్ వర్సిటీలకు సంబంధించిన బిల్లును ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలి. (వ్యాసకర్త ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షులు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్: 9441744061)