అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం | State Government Implements Private University Rule | Sakshi
Sakshi News home page

అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం

Published Tue, Jul 16 2019 8:42 AM | Last Updated on Tue, Jul 16 2019 8:51 AM

State Government Implements Private University Rule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణ స్టేట్‌ ప్రైవేటు యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెం ట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌–2018ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జీవో 17 జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. గతేడాది మార్చి 28వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం బిల్లు పాస్‌ అయింది. అదే ఏడాది దానిపై ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి వెంటనే అమల్లోకి తెస్తుందని అంతా భావించారు. కాని గతేడాది దానిని అమల్లోకి తేలేదు.

తాజాగా సోమవారం చట్టం అమలుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం లేదా గురువారం జారీ చేసే అవకాశముంది. తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతిచ్చినా వచ్చే విద్యా సంవత్సరమే అవి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.

చట్టంలోని ప్రధాన అంశాలు..

  • నాణ్యతతో కూడిన విద్య, పరిశోధనలకు ప్రాధాన్యం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా.. ఆధునిక పరిస్థితులకు పెద్ద పీట వేస్తూ ప్రపంచస్థాయి యూనివర్సిటీలను ఈ చట్టం ద్వారా ఏర్పాటుకు అనుమతిస్తున్నాం.  
  • ఈ చట్టం కింద ఏర్పాటయ్యే విద్యా సంస్థల కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కోర్సుల నిర్వహణ, ప్రవేశాల విధానం ఆయా యూనివర్సిటీలే నిర్ణయిస్తాయి. తెలంగాణ విద్యార్థులకు మాత్రం 25 శాతం సీట్లు కల్పించాలి.
  • వాటిల్లో ఫీజులను యూనివర్సిటీనే నిర్ణయిస్తుంది. ప్రతి వర్సిటీ ఫీ ఫిక్సేషన్‌ కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలి. ఆ కమిటీలో బోర్డు ఆఫ్‌ మేనేజ్‌మెంట్, అకడమిక్‌ కౌన్సిల్‌కు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. లింగ వివక్ష, ప్రాంతం, కులం, పుట్టిన ప్రదేశం, మతం, రాజకీయ కోణం, ఇతర కారణా లతో ఎవరికీ ప్రవేశాలను తిరస్కరించడానికి వీల్లేదు. ఈ నిబంధనలు కొత్తగా వర్సిటీని ఏర్పాటు చేసే సంస్థలకు వర్తిస్తాయి.  
  • తెలంగాణలో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలు యూనివర్సిటీగా ఏర్పడితే ప్రవేశాల్లో పాత విధానమే అమలు చేయాలి. సీట్ల భర్తీలో ఇప్పుడున్న రూల్‌ ఆఫ్‌ రిజర్వేషనే వర్తిస్తుంది. ఫీజు విధానం కూడా ఇప్పుడున్న ప్రకారమే కొనసాగుతుంది. తెలంగాణ ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిర్ణయించిన ప్రకారమే కొనసాగుతాయి.
  • యూనివర్సిటీలు ఏర్పాటైన ఐదేళ్లలోగా నేషనల్‌ అసేస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ నుంచి గుర్తింపు పొందాలి.
  • యూనివర్సిటీలకు ఎంత భూమి ఉండాలి.. కార్ఫస్‌ ఫండ్‌ ఎంత పెట్టాలన్న నిబంధనను చట్టంలో పొందుపర్చలేదు. నిర్ణీత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని మాత్రం పేర్కొంది.
  • ఈ యూనివర్సిటీలు యూజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ, ఎన్సీటీఈ తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థల నిబంధనలకు లోబడే కోర్సులను రూపొందించాలి.
  • యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థల దరఖాస్తులను (ప్రాజెక్టు రిపోర్టులను) పరిశీలించి, అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తుంది.
  • ప్రాజెక్టు రిపోర్టు వచ్చిన నెలలో ఆమోదించడమా? రిజెక్టు చేయడమా? అన్న దానిపై నిపుణుల కమిటీ నిర్ణయాన్ని తెలుపుతుంది. లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ రూపంలో ఇస్తుంది. అనుమతిచ్చిన ఏడాదిలోగా వర్సిటీని ఏర్పాటు చేయాలి.
  • నాన్‌ ప్రాఫిట్‌ సొసైటీ, పబ్లిక్‌ ట్రస్టు, కంపెనీలు స్పాన్సరింగ్‌ బాడీగా ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయవచ్చు. వర్సిటీకి చాన్స్‌లర్‌ ఉంటారు. యూనివర్సిటీని ఏర్పాటు చేసిన సంస్థ చాన్స్‌లర్‌ను నియమిస్తుంది. ఆయన ముగ్గురు సభ్యులు కలిగిన ప్యానల్‌ నుంచి ఒకరిని వైస్‌ చాన్స్‌లర్‌గా నియమిస్తారు. తొలగించే అధికారం ఆయనకే ఉంటుంది. 70 ఏళ్లలోపు వారిని వీసీగా నియమిస్తారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. అయితే మొదటిసారి మాత్రం ఏడాదే ఉంటుంది. రిజిస్ట్రార్‌ను చాన్స్‌లరే నియమిస్తారు.
  • యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిధిలోనే ఏర్పాటు చేయాలి. ఇవి మరే కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు.
  • ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, ప్రత్యేకమైన కోర్సులను, పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ వర్సిటీలు రెండు అదనపు క్యాంపస్‌లు/సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. ఇవీ నాణ్యతా ప్రమాణాలు, వాస్తవిక అవసరాల మేరకు ఉంటాయి.
  • అయితే ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో అదనపు క్యాంపస్‌ల ఏర్పాటుకు అనుమతివ్వవచ్చు. ఐదేళ్లలో అక్కడ కల్పించే మౌలిక సదుపాయాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటుంది.
  • ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్స్‌ ఉండవు. గౌరవ డిగ్రీలు కూడా ఇచ్చుకోవచ్చు.
  • ప్రపంచంలో ఏ యూనివర్సిటీతోనైనా ఒప్పందం చేసుకోవచ్చు.  
  • నిధుల సేకరణ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఇతర దేశాల నుంచి కూడా నిధులు సేకరించుకోవచ్చు. యూనివర్సిటీల గవర్నింగ్‌ బాడీలో మెంబర్‌గా కార్యదర్శి, ఆ పైస్థాయి ప్రభుత్వ అధికారి ఉంటారు.  
  • ఏడాదికి నాలుగుసార్లు గవర్నింగ్‌ బాడీ సమావేశం కావాలి.  
  • ప్రభుత్వం సూచనలు మాత్రమే ఇస్తుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం జోక్యం చేసుకుంటుంది.
  • ప్రభుత్వ అనుమతి లేకుండా యూనివర్సిటీ మూసివేయొద్దు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement