
మంత్రి గంటా ఇల్లు ముట్టడి
చెదరగొట్టిన పోలీసులు
తోపులాటలో పడి విద్యార్థి నేతలకు గాయాలు
ఎంవీపీకాలనీ(విశాఖ): ప్రైవేట్‌యూనివర్సిటీల బిల్లును వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్థి నాయకులు సోమవారం నగరంలోని ఎంవీపీకాలనీలోని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకున్నారు. ఇది తెలుసుకుని కోపోద్రిక్తులైన ఏబీవీపీ విద్యార్ధి నాయకులు గంటా ఇంటి ఎదుట ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో పోలీసులు వారిని చెల్లాచెదురుచేశారు. దీంతో తోపులాటలో కొందరు కింద పడిపోయారు. ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు వాసు చొక్కా చిరిగిపొయింది. కడుపు మీద గాయమయింది.
మరో విద్యార్ధి నాయకుడికి చేతిపై గాయమయింది. విద్యార్థి నాయకుల నినాదాలతో అప్రాంతం హోరెత్తింది. మంత్రి గంటా శ్రీనివాసరావు కార్పొరేట్ శక్తులకు మంత్రి కొమ్ముకాస్తున్నరని నినాదాలు చేశారు.
14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి పి. సురేష్, ఎబివిపి ఆంధ్రాయూనివర్శిటి ఇన్‌చార్జి జి.రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెన్నా సురేష్, సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలగిరిరాజు, వి. మోహన్ యాదవ్, సాయికష్ణ, శేఖర్, ఏయూ పిహెచ్‌డి స్కాలర్స్ హేమ. జగదీష్, కార్తీకేయ,మణికంఠ, సూర్య, వంశీ యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.