చేనేత వేదన వింటారా?! | Sakshi
Sakshi News home page

చేనేత వేదన వింటారా?!

Published Thu, Apr 30 2015 12:09 AM

చేనేత వేదన వింటారా?! - Sakshi

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంలో భాగంగా బ్రిటిష్ వలసపాలకులు చేనేత రంగాన్ని, రాట్నాన్ని ధ్వంసంచేశారని కార్ల్ మార్క్స్ ఒక వ్యాసంలో అంటాడు. అపురూప వారసత్వ సంపదగా, విశిష్ట కళారూపంగా ఇప్పటికీ ప్రపంచంలో నీరాజనాలందుకుంటున్న చేనేత రంగానికి అన్యాయం చేయడంలో మన ప్రభుత్వాలు వలసపాలకులతో పోటీపడుతున్నాయి. చేనేత రంగానికి చేసే బడ్జెట్ కేటాయింపులను అంతకంతకూ తగ్గిస్తూ, ఆ రంగం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యల పరిష్కారంపై శ్రద్ధపెట్టక దాన్ని కొడిగట్టిస్తున్న మన పాలకులు దాన్ని మరింత శల్యావస్థకు చేర్చే మార్గాన్ని వెదుకుతున్నట్టు కనబడుతోంది. చేనేతకు రక్షణ కల్పించడం కోసమంటూ 1985లో తీసుకొచ్చిన చట్టాన్ని సవరించేందుకూ, వీలైతే దాన్ని రద్దుచేసేందుకూ ప్రయత్నాలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తమవుతున్నది.

చీరెలు, లుంగీలు వంటి 22 రకాల ఉత్పత్తులను చేనేత రంగానికే రిజర్వ్ చేస్తూ ఆ ఉత్పత్తులను మరమగ్గాలపై తయారు చేయరాదంటూ 1985నాటి చేనేత చట్టం నిర్దేశిస్తున్నది. ఈ 22 రకాల ఉత్పత్తులు కాలక్రమేణా 11 రకాలకు పడిపోగా...వాటిని సైతం మరమగ్గాలపై భారీయెత్తున ఉత్పత్తి చేసి మార్కెట్‌లను ముంచెత్తుతున్నారు. మరమగ్గాల ఉత్పత్తులను చేనేత వస్త్రాలుగా ఇంటా, బయటా చలామణి చేస్తున్నారు. తగినంతమంది సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేందుకూ, కఠినమైన చర్యలకు ఉపక్రమించేందుకూ కదలకపోగా ఆ చట్టానికే ఎసరు పెట్టే ఆలోచనలు చేయడం ఆందోళన కలిగించే అంశం. వారంక్రితం పార్లమెంటులో ఈ అంశం ప్రస్తావనకొచ్చాక చేనేత చట్టాన్ని రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మాట వాస్తవమైనా సాగుతున్న పరిణామాలు భరోసానిచ్చేవిగా లేవు.

ఈనాటికీ వ్యవసాయం తర్వాత మన దేశంలో అత్యధిక జనాభాకు ఆసరాగా నిలుస్తున్నదీ, ఆదుకుంటున్నదీ చేనేత రంగమే. చేనేత యూనిట్లలో ఇప్పటికీ 87 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కోటిన్నరమందికి పైగా జనం ఆ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత కార్మికుల్లో 75 శాతంమంది మహిళలు. ఈ గణాంకాలన్నీ చేనేత రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. మహిళలకొచ్చే ఆదాయం మొత్తం కుటుంబం కోసం, మరీ ముఖ్యంగా పిల్లల సంక్షేమం కోసం ఖర్చవుతుందనే వాస్తవాన్ని తెలుసుకుంటే చేనేత రంగాన్ని ప్రోత్సహించడం సామాజిక ప్రగతికి, వికాసానికి ఎంతగా దోహదం చేస్తుందో అర్థమవుతుంది. పెట్టుబడుల అవసరం పెరిగి, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువై, దిగుబడులకు గిట్టుబాటు ధరలు రాక...వ్యవసాయ రంగంనుంచి నిష్ర్కమిస్తున్నవారి శాతం పెరుగుతుంటే దానికి సమాంతరంగా చేనేత రంగం మూగగా రోదిస్తోంది.

నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ‘సబ్ కా సాథ్... సబ్ కా వికాస్’ అని నినదించినప్పుడు అందరూ సంతోషించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘మేకిన్ ఇండియా’ ఎందరిలోనో ఆశలు రేపింది. కానీ, చేనేత రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన రూ. 446.60 కోట్ల మొత్తాన్ని చూసి అందరూ నీరసించారు. నిరుటి బడ్జెట్‌తో పోలిస్తే ఈ కేటాయింపులు 21 శాతం తక్కువ! ఎన్డీయే సర్కారు మాత్రమే కాదు...అంతక్రితం పాలించిన యూపీఏ ప్రభుత్వం సైతం చేనేతను చిన్నచూపు చూసింది. చేనేత రుణాల మాఫీకి రూ. 6,800 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ఆ ప్రభుత్వం 2012-13 బడ్జెట్‌లో అందుకు కేటాయించిన మొత్తం రూ. 2,205 కోట్లు. తీరా ఖర్చు చూస్తే రూ. 291 కోట్లు దాటలేదు. చేనేత రంగానికి తక్కువ వడ్డీ రేట్లతో అప్పులిచ్చి ఆదుకునే నాబార్డ్ గణనీయంగా కోతపెట్టడంతో నేతన్నలు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సివచ్చింది. ముఖ్యమైన ముడి సరుకులు పత్తి నూలు, పట్టు నూలు, రంగులు, రసాయనాల ధరలు గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయి. నకిలీ చేనేత ఉత్పత్తులు రంగంలోకొచ్చి దారుణంగా దెబ్బతీశాయి. ఇన్నిటిమధ్య మన చేనేత రంగం 2013-14లో రూ. 2,812 కోట్ల ఎగుమతులు చేసి మన ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చింది.

ఇప్పటికి 11 రకాల ఉత్పత్తులను మాత్రమే చేనేత రంగానికి రిజర్వ్ చేసిన 1985నాటి చట్టాన్ని ఇంకా కుదించాలని మరమగ్గాల లాబీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. క్రితం నెలలో మరమగ్గాల యాజమాన్య సంఘాలు చీరెలు, లుంగీలను చేనేత చట్టంనుంచి తొలగించాలని డిమాండ్ చేయడం, ఈ నెలలో అందుకు సంబంధించిన అంశాలను చర్చించడం కోసం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తించింది. ఈ సమావేశానికి 20మందినే ఆహ్వానించడం, అందులో అత్యధికులు మరమగ్గాల రంగానికి చెందినవారు కావడం ఈ అనుమానాలను మరింతగా పెంచింది. మరమగ్గాలవారికి మేలుచేసేలా ‘చేనేత’ పదానికున్న నిర్వచనాన్నే మార్చేయడానికి మూడేళ్లక్రితం ఓ ప్రయత్నం జరిగింది. ఇప్పుడు సైతం అలాంటిదేమైనా ఉంటుందన్నదే ఆ రంగంలోనివారి ఆందోళన. చేనేత రంగానికి ముప్పు కలిగించే ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని, చేనేత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించడం బాగానే ఉన్నా అందుకు అనుగుణమైన ఆచరణ కనబడాలి. ముఖ్యంగా చేనేత రంగం అభివృద్ధి కోసం గతంలో నియమించిన శివరామన్, ఆబిద్ హుసేన్, మీరా సేఠ్ కమిటీల నివేదికల దుమ్ము దులిపి ఆ రంగం సముద్ధరణకు ఏమేమి చర్యలు అవసరమో గుర్తించాలి. ఇప్పటికీ అంతర్జాతీయంగా ఎంతో గిరాకి ఉన్న మన చేనేత ఉత్పత్తులకు రక్షణగా నిలిస్తేనే...ఆదుకుంటేనే ‘మేకిన్ ఇండియా’కు సార్థకత చేకూరుతుందని ఎన్డీయే సర్కారు గ్రహించాలి.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement