సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి | 1300 people killed in Syria chemical attack | Sakshi
Sakshi News home page

సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి

Published Thu, Aug 29 2013 12:28 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

1300 people killed in Syria chemical attack

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు
 
 
 అంతర్జాతీయం


 సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి
 సిరియా రాజధాని డెమాస్కస్ దగ్గర్లోని తూర్పు గౌటాలో ఆగస్టు 21న తిరుగుబాటుదారులపై ప్రభుత్వ బలగాలు రసాయనిక దాడి చేశాయి. ఈ ఘటనలో 1300 మంది మరణించారని ప్రతిపక్షాలు తెలిపాయి. వందలాదిమంది అస్వస్థతకు లోనయ్యారు. మరణించినవారిలో ఎక్కువ మంది పిల్లలున్నారు. అయితే, రసాయనిక దాడులు జరగలేదని ప్రభుత్వం పేర్కొంది.
 
 ఈ మరణాలపై దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్ కోరింది. ఐక్యరాజ్యసమితి బృందాలు వాస్తవాలు తెలుసుకోవాలని అమెరికా, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్‌‌స దేశాలు కోరాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 2011 నుంచి ఉద్యమాలు చెలరేగాయి. అసద్ అధికారం నుంచి వైదొలగి ప్రజాస్వామిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు, తిరుగుబాటు దళాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ పోరాటంలో 2012 జూన్ వరకు లక్షమంది మరణించారని, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.


 
 ప్రముఖ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ మృతి 
 ప్రముఖ అమెరికన్ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ (87) న్యూయార్‌‌కలో ఆగస్టు 20న మరణించారు. ఆయన క్రైం, సస్పెన్‌‌సతో కూడిన అనేక నవలలు రాశారు. గ్లిట్జ్, గెట్‌సార్‌‌ట్ల, అవుట్ ఆఫ్ సైట్, బండిట్స్ నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన 47వ పుస్తకం ‘బ్లూడ్రీమ్స్’ ఈ సంవత్సరం ప్రచురణ కావాల్సి ఉంది.
 
 
 జాతీయం
 ఎత్తై వైమానిక స్థావరంలో దిగిన సూపర్ హెర్క్యూలస్ విమానం
 జమ్మూ, కాశ్మీర్‌లోని లడక్‌లో ఉన్న దౌలత్‌బేగ్ ఓల్దీ వైమానిక స్థావరంలో భారత వాయుసేన.. సి-130 జె-30 సూపర్ హెర్క్యూలస్ రవాణా విమానాన్ని ఆగస్టు 20న దింపింది. ఈ స్థావరం ప్రపంచంలోనే ఎత్తై ప్రదేశంలో ఉంది. ఇది ఆక్సాయ్‌చిన్‌లో 16,614 అడుగులు (5,065 మీటర్లు) ఎత్తులో ఉంది. వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉంది. గత ఏప్రిల్‌లో చైనా బలగాలు ఇక్కడి భారత భూ భాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో సూపర్ హెర్క్యూలస్‌ను దించారు. దీంతో ఈ ప్రాంతానికి జవాన్లు, యుద్ధ సామాగ్రి తరలింపు, కమ్యూనికేషన్ల నిర్వహణ సజావుగా సాగుతాయి. ఈ విమానం 20 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్తుంది.
 

 ఆహార భద్రత పథకం ప్రారంభం
 ఆహార భద్రత పథకాన్ని ఢిల్లీలో ఆగస్టు 20న సోనియా గాంధీ ప్రారంభించారు. ఢిల్లీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి. దేశంలో 80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కోసం 1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. 6.2 కోట్ల టన్నుల బియ్యం, గోధుమలు, తృణ ధాన్యాలు సబ్సిడీపై పేదలకు అందజేస్తారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పథకానికి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.
 
 

నాలుగు ఒప్పందాలపై భారత్ - ఇరాక్ సంతకాలు
 ఇరాక్ ప్రధానమంత్రి నౌరీ అల్ - మాలికీ భారత పర్యటనలో ఆగస్టు 23న నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో బ్లాక్-8లో చమురు తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాన్ని పూర్తి చేయడం ఒకటి. ఈ కాంట్రాక్టును సద్దాం హుస్సేన్ పాలనలో 2000లో ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌కు కేటాయించారు. అయితే రెండో గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాక్ తిరిగి సంప్రదింపులకు పిలుపునిచ్చింది. ఈ పర్యటనలో ఇరాక్ ప్రధాని మాలికీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. చమురుశుద్ధి కర్మాగారాలు, ఎరువుల పరిశ్రమలు, స్టీల్ ప్రాజెక్టుల్లో ఉమ్మడి భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాలు చర్చించాయి.
 
 

వాయుసేనలోకి భారీ రవాణా విమానం
 వాయుసేన రవాణా సామర్థ్యం మరింత పటిష్టం కానుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్‌క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సెప్టెంబర్ 2న వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో వీటి సేవలను ఆయన ప్రారంభిస్తారు.

 

వాయుసేన 81వ స్క్వాడ్రన్‌లో చేర్చనున్న సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సుమారు రూ.20,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాదాపు 80 టన్నుల లోడ్‌ను ఇవి మోసుకెళ్లగలవు. 2011లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం పది సీ-17 విమానాల సరఫరాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 3 విమానాలను అందచేయగా వచ్చే ఏడాది చివరినాటికి మిగతావి సరఫరా కానున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో వీటి ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు.
 
 

ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్‌కు మూడో స్థానం
 ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్ మూడో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. జపాన్‌ను అధిగమించి భారత్ మూడో స్థానంలో చేరిందని ప్రపంచ డిజిటల్ మెజర్‌మెంట్ అండ్ అనలిటిక్స్ సంస్థ ‘కాంస్కోర్’ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 74 మిలియన్లకు పైగా ఇంటర్‌నెట్ వినియోగదారులున్నారు. 2012 మార్చి నుంచి వీరి సంఖ్య 31 శాతం పెరిగింది. వినియోగదారుల్లో మూడింట ఒక వంతు 35 ఏళ్లకంటే తక్కువ వయసువారున్నారు. పీసీ, ల్యాప్‌ట్యాప్ సర్వీసుల ఆధారంగా భారత్ నెట్ వినియోగదారుల సంఖ్య 74 మిలియన్లుగా కాంస్కోర్ సంస్థ పేర్కొంది. మొబైల్, టాబ్లెట్ నెట్ వినియోగదారులను కలుపుకుని ఈ సంఖ్య మార్చి 31 నాటికి 164.81 మిలియన్లని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.
 

రచయిత్రి మాలతీ చందూర్ కన్నుమూత
 ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ (84) ఆగస్టు 21న చెన్నైలో మరణించారు. ఆమె కృష్ణా జిల్లా, నూజివీడులో 1928లో జన్మించారు. ఆమె తెలుగులో మొత్తం 26 నవలలు రాశారు. మరెన్నో ఆంగ్ల రచనలను అనువదించారు. తొలి నవల ‘చంపకం - చెదపురుగులు’ కాగా, మొదటి కథ రవ్వలడ్డూలు. ఆమె నవల హృదయనేత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె ఆంధ్రప్రభ వారపత్రికలో నిర్వహించిన ప్రమదావనం శీర్షిక వరుసగా 47 ఏళ్లపాటు కొనసాగి గిన్నిస్ రికార్డుకెక్కింది.
 

 సంగీత దర్శకుడు రఘునాథ్ పాణి గ్రాహి
 కన్నుమూత
 ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) ఆగస్టు 25న భువనేశ్వర్‌లో మృతి చెందారు. ఆయన ఒడిశాలోనే తొలి సంగీత దర్శకుడు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. జయదేవుడి ‘గీత గోవిందం’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
 
 

హేతువాద నేత నరేంద్ర దభోల్కర్ హత్య
 ప్రముఖ హేతువాద నేత, మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారకుడు నరేందర దభోల్కర్ (69)ను పూణెలో ఆగస్టు 20న కాల్చి చంపారు. వైద్యుడైన నరేంద్ర అంధ శ్రద్ధ నిర్మూలన కమిటీకి అధ్యక్షుడిగా, సాధన వారపత్రిక సంపాదకుడిగా వ్యవహరించారు. గత రెండు దశాబ్దాలుగా సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు.
 
 

 క్రీడలు
 ప్రపంచకప్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం
 పోలండ్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆగస్టు 25న జరిగిన టీమ్ రికర్వ్ విభాగం ఫైనల్లో దీపిక కుమారి, రిమిల్, బొంబేలా దేవిలతో కూడిన భారత జట్టు, ప్రపంచ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. గత నెలలో కొలంబియాలో జరిగిన ప్రపంచ కప్‌లోనూ టీమిండియాకు బంగారు పతకం లభించింది.
 
 

గోపీచంద్ అకాడమీకి  రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్
 కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ - 2013 అవార్డు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఎ)కి లభించింది. అత్యుత్తమ అకాడమీల ఏర్పాటు, నిర్వహణ విభాగం కింద గోపీచంద్ అకాడమీని కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. ఈ అకాడమీ సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కాశ్యప్ వంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులను అందించింది. ఈ అవార్డు సర్వీసెస్ స్పోర్‌‌ట్స కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ), పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్‌‌డ, యు.కె. మిశ్రా జాతీయ స్పోర్‌‌ట్స అకాడమీ -అలహాబాద్‌లకు కూడా ప్రకటించారు.
 
 

ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు
 చైనాలో జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో ఆంధ్రపదేశ్‌కు చెందిన వెంకట్ రాహుల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆగస్టు 21న జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో రాహుల్ మొత్తం 310 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల 800 మీటర్ల పరుగులో అంజనా తమాకే స్వర్ణపతకం సాధించింది. భారత్‌కు తొలి స్వర్ణపతకం స్క్వాష్‌లో కుశ్‌కుమార్ అందించాడు. ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలతో పదో స్థానంలో నిలిచింది. చైనా 46 స్వర్ణం, 23 రజతం, 24 కాంస్యాలతో మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా (25-13-14) రెండోస్థానంలోనూ, జపాన్ (7-5-6) మూడోస్థానంలోనూ నిలిచాయి.
 

 ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో  భారత్‌కు నాలుగో స్థానం
 ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. సెర్బియాలో ఆగస్టు 25న ముగిసిన పోటీలో భారత రెజ్లర్లు బాలరాజ్ 76 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో రజతం, జతిన్ 42 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో కాంస్యం సాధించారు. 48 దేశాలు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో రష్యా మొదటి స్థానం సాధించగా, అజర్‌బైజాన్ రెండో స్థానంలో, ఇరాన్ మూడో స్థానంలో, భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి.  మహిళల విభాగంలో రష్యా మొదటి స్థానం, జపాన్ రెండో స్థానం, ఉక్రెయిన్ మూడో స్థానం, భారత్ ఏడో స్థానం సాధించాయి.
 

లియాండర్ పేస్‌కు 52వ డబుల్స్ టైటిల్
 అమెరికాలో ఆగస్టు 25న జరిగిన విన్‌స్టన్-సాలెమ్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్, కెనడా ప్లేయర్ డానియల్ నెస్టర్ జంట డబుల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో పేస్ జంట.. ట్రీట్ హుయ్ (ఫిలిప్పీన్స్) - ఇంగ్లోట్ (బ్రిటన్)లపై గెలిచారు. 40 ఏళ్ల లియాండర్ పేస్‌కు ఇది 52వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. నెస్టర్‌కు ఇది 81వ టైటిల్. అంతేకాకుండా ఈ విజయంతో నెస్టర్ తన కెరీర్‌లో డబుల్స్‌లో 900 పైగా విజయాలు సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు.
 
 

నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సౌరవ్, జోత్స్నలకు టైటిల్స్
 61 నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరవ్ ఘోషల్ గెలుచుకున్నాడు. జైపూర్‌లో ఆగస్టు 23న జరిగిన ఫైనల్స్‌లో మహేశ్ మంగోంకర్‌ను సౌరవ్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జోత్స్న చిన్నప్ప గెలుచుకుంది. ఫైనల్స్‌లో అపరాజితా బాలమురుకన్‌ను ఓడించింది.
 
 

న్యూహవెన్ ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విజేత సానియా-జీ జెంగ్
 భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఖాతాలో 17వ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. అమెరికాలో ఆగస్టు 25న జరిగిన న్యూ హవెన్ ఓపెన్ టోర్నమెంట్‌లో తన భాగస్వామి జీ జెంగ్  (చైనా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సానియా-జీ జెంగ్ , రెండో సీడ్ అనాబెల్ మెదీనా గారిగెజ్ (స్పెయిన్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటపై గెలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 17వ డబుల్స్ టైటిల్‌కాగా ఈ ఏడాది మూడోది. విజేతగా నిలిచిన సానియా జంటకు 36,500 డాలర్ల (రూ. 23 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
 

 ప్రముఖ సెయిలర్ సి.ఎస్. ప్రదీపక్ మృతి
 ప్రముఖ సెయిలర్, అర్జున్ అవార్డు గ్రహీత సి.ఎస్. ప్రదీపక్ (66) ఆగస్టు 24న హైదరాబాద్‌లో మరణించారు. హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ నిర్వహించడాన్ని ప్రోత్సహించిన వారిలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1972 - 1992 మధ్య కాలంలో ఆయన ప్రముఖ సెయిలర్‌గా కొనసాగారు. ఆయన వరల్డ్ మాస్టర్స్‌లో కాంస్యం, ఆసియన్ గేమ్స్‌లో కాంస్యం, ఆసియన్ రెగట్టాలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement