
అమెరికా విద్యార్థి వీసాలకు దరఖాస్తుల వెల్లువ
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వె ళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వీసా దరఖాస్తులు ఏకంగా 37 శాతం అధికంగా వచ్చాయి. ఈ ఏడాది మేలో మొత్తం 2,731 దరఖాస్తులు అందినట్లు చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. వీసా ఇంటర్వ్యూ కోసం చాలామంది విద్యార్థులు వేచి చూస్తున్నారని తెలిపారు. అన్ని కేటగిరీల వీసా దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. విద్యార్థి వీసా దరఖాస్తులు అత్యధికంగా వస్తున్నాయని పేర్కొన్నారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో హెచ్చుతగ్గులు విద్యార్థులపై కొంత ప్రభావం చూపిస్తున్నాయి. రూపాయి విలువ స్థిరంగా ఉంటే.. అమెరికాకు వెళ్లేవారి సంఖ్య ఇంకా భారీగా పెరిగేది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), కంప్యూటర్ సైన్స్, సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటి వాటిలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు భారత విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలో లక్షకు పైగా భారత విద్యార్థులున్నారు. ఈ విషయంలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో ఉత్తరాది కంటే దక్షిణాది విద్యార్థులే ఎక్కువ. వీసా దరఖాస్తుదారుల్లో మహిళల కంటే పురుషులే అధికంగా ఉంటున్నారు. భారత విద్యార్థులను ఆకర్షించేందుకు అమెరికన్ కాన్సులేట్ విద్యార్థి వీసా ప్రక్రియను మరింత సులభతరం చేసింది. రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొదటిరోజు చేతి వేలిముద్రలు, ఫోటోలు తీసుకుంటారు. రెండోరోజు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కాన్సులేట్‌లో అరగంటలోనే పనులు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.