
ఏపీపీఎస్సీ..గ్రూప్–2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–2 స్క్రీనింగ్ పరీక్ష ముగిసింది. ఇక తదుపరి దశ.. మెయిన్ ఎగ్జామినేషన్. దీనికి అర్హత సాధించేందుకు అవసరమైన కటాఫ్ ఎంత ఉంటుంది? అనే సందేహం అభ్యర్థుల్లో ఉంది.ఈ క్రమంలో కటాఫ్ అంచనాతోపాటు మెయిన్ పరీక్ష సన్నద్ధతకు నిపుణుల సూచనలు..
పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి నిర్వహించిన గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్‌కు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. 982 ఉద్యోగాలకు 4,83,321 మంది పోటీపడ్డారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా ఒక్కో ఉద్యోగానికి 50 మంది చొప్పున ఎంపిక చేసి, వారికి మే 20, 21 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
్గ కటాఫ్ 85 – 105: స్క్రీనింగ్ టెస్ట్ కటాఫ్ 85 నుంచి 105 మధ్యలో ఉంటుందని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి పరీక్ష జరిగిన రోజున కటాఫ్ 90 నుంచి 110 మధ్యలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఏపీపీఎస్సీ... ప్రిలిమినరీ ‘కీ’ ప్రకటించిన తర్వాత కటాఫ్ అంచనాల్లో మార్పు వచ్చింది. 110 మార్కులు పొందే అభ్యర్థుల సంఖ్య 1500 నుంచి 2000 లోపు ఉంటుందని.. వారు కూడా సివిల్స్, గ్రూప్–1 వంటి పరీక్షలకు సన్నద్ధమవుతూ.. గ్రూప్–2కు హాజరైనవారే ఉంటారని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు.
్గ ఫ్యాక్ట్స్‌కు ప్రాధాన్యం: స్క్రీనింగ్ టెస్ట్‌లోని ప్రశ్నలను పరిశీలిస్తే.. ఊహించిన విధంగానే ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలకు ప్రాధాన్యం లభించింది. 80 శాతం ప్రశ్నలు ఈ కోవకు సంబంధించినవే. గతంలో సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నట్లు అభ్యర్థులను వడపోయడమే లక్ష్యంగా ప్రశ్నలు రూపొందించినట్లు తెలుస్తోంది. కరెంట్ అఫైర్స్, పాలిటీలో ఫ్యాక్ట్స్ ఆధారిత ప్రశ్నలు అధికంగా ఉన్నాయి. ఎకానమీలో కూడా గణాంకాలు, కేటాయింపులు, పథకాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇది డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులకు కొంత కలిసొచ్చే అంశం.
్గ మెయిన్‌కు.. డిస్క్రిప్టివ్ విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. మెయిన్‌లో అడిగే ప్రశ్నలు ఒక అంశంపై సంపూర్ణ అవగాహన, అనువర్తిత నైపుణ్యం అవసరమైన విధంగా ఉండే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ తరహాలో సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ వరకు ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ చేసి, కటాఫ్ మార్కులు సాధిస్తామనే నమ్మకమున్న అభ్యర్థులు సైతం తమ ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ తరహాకు మళ్లించాలని చెబుతున్నారు.
్గ పేపర్–1 ప్రిపరేషన్: గ్రూప్–2 మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్–1 జనరల్ స్టడీస్‌ను పటిష్ట ప్రణాళికతో అధ్యయనం చేయాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలను, సమకాలీన పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. నాన్–మ్యాథ్స్ అభ్యర్థులు జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ముమ్మరం చేయాలి. సిలబస్‌లోని 12 విభాగాల్లో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, డేటా ఎనాలిసిస్ అంశాలను రెండు విభాగాల్లో పొందుపరిచారు. వీటి నుంచి 10–15 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బేసిక్ మ్యాథ్స్ నుంచి పై–చార్ట్స్, ఫ్లో–చార్ట్స్ వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
్గ పేపర్–2.. చారిత్రకం.. రాజ్యాంగం: పేపర్–2లోని ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి స్వాతంత్య్రోద్యమానికి ముందు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉద్యమాలు.. వాటి ప్రాధాన్యాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉద్యమాలు, వాటికి నేతృత్వం వహించిన వ్యక్తులు, సాంస్కృతిక ఉద్యమకారుల గురించి తెలుసుకోవాలి. ఆంర«ధ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవాలి. రెండో సెక్షన్‌లో భారత రాజ్యాంగంలో అధికరణలు, వాటి నేపథ్యాలకు సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలి.
్గ పేపర్–3 ఎకానమీ: ఎకానమీ విషయంలో అభ్యర్థులు పంచవర్ష ప్రణాళికల నుంచి నీతి ఆయోగ్ వరకు కాన్సెప్ట్, అప్లికేషన్ ఓరియెంటేషన్ విధానంలో అభ్యసనం సాగించాలి. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రణాళికలకు సంబంధించిన ప్రశ్నలను పరిశీలిస్తే.. గరీబీ హటావోను లక్ష్యంగా చేసుకున్న ప్రణాళిక ఏమిటి? వంటి ఫ్యాక్ట్ ఆధారిత ప్రశ్నలు అడిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు.. ఫలితాలు, కారణాలు వంటి విభిన్న కోణాల్లో అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి రాష్ట్రంలోని సహజ వనరులు– ఆదాయాభివృద్ధి పథకాలు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా సంక్షేమ పథకాలు.. వాటి లక్షిత వర్గాలు.. ప్రస్తుతం వాటి తీరుతెన్నులపై అవగాహన పెంపొందించుకోవాలి.
ఆన్‌లైన్ టెస్ట్‌పై అవగాహన
గ్రూప్–2 మెయిన్ ఎగ్జామినేషన్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ఆన్‌లైన్ టెస్ట్ విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే కంప్యూటర్ ఆపరేటింగ్‌కు సంబంధించి బేసిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. లేదంటే పరీక్ష సమయంలో ఇబ్బందికి గురవుతారు. సమయం సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది.
టైమ్ మేనేజ్‌మెంట్ ప్రధానం
గ్రూప్–2 మెయిన్ ఎగ్జామినేషన్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు టైమ్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యమివ్వాలి. సబ్జెక్టుల ప్రిపరేషన్ కోణంలో చూస్తే ఇటీవల కాలంలో కీలకంగా మారిన పర్యావరణ సంబంధిత అంశాలపై దృష్టిసారించాలి. ఒకవైపు ఫ్యాక్ట్స్‌కు ప్రాధాన్యమిస్తూనే మరోవైపు వాటికి సంబంధించిన నేపథ్యంపై క్షుణ్నంగా అవగాహన పెంపొందించుకోవాలి.
– గురజాల శ్రీనివాసరావు,
సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, హైదరాబాద్.
గ్రూప్–2 మెయిన్ ఎగ్జామినేషన్
పేపర్–1
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు
పేపర్–2
సెక్షన్–1: ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
సెక్షన్–2: భారత రాజ్యాంగం 150 మార్కులు
పేపర్–3 ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ
ఆంధ్రప్రదేశ్ ఎకానమీ 150 మార్కులు