ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సుల వివరాలు.. | Ask the expert: Career Counselling | Sakshi
Sakshi News home page

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సుల వివరాలు..

Published Thu, Jan 30 2014 2:34 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Ask the expert: Career Counselling

 టి. మురళీధరన్
 టి.ఎం.ఐ. నెట్‌వర్క్
 
 
 పీఎంఆర్‌డీఎఫ్ ఫెలోషిప్ వివరాలు తెలియజేయండి?
 - సుశాంత్, షాద్‌నగర్.
 పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్‌డీ) ప్రారంభించిన కార్యక్రమమే పీఎంఆర్‌డీఎఫ్ (ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోషిప్స్). ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఫెలోషిప్స్‌ను నిర్వహిస్తోంది. ఈ ఫెలోషిప్స్‌నకు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వ పథకాల అమలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై వెనుకబడిన జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) నుంచి ఎంఎస్సీ/ఎంఫిల్ (డెవలప్‌మెంట్ ప్రాక్టీస్) కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పూర్తిగా నిర్దేశించిన రాష్ట్రంలో ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్‌లో పూర్తిస్థాయి ఉద్యోగికి ఇచ్చే వేతనంతో సమానమైన జీతాన్ని అందజేస్తారు. వీరు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్, ఎన్‌బీఏ, ఎన్‌ఎస్‌ఏపీ, ఐఏపీ, ఐసీడీఎస్, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం వంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి తగిన సూచనలు ఇస్తారు.
 ఎంపిక విధానంలో మూడు దశలు ఉంటాయి. అవి.. ఆలిండియా కాంపిటెన్సీ అసెస్‌మెంట్ టెస్ట్ (ఏఐసీఏటీ), రిటెన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ మూడు దశలకు కలిపి 200 మార్కులు కేటాయించారు.
 ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 75 వేల ఫెలోషిప్ లభిస్తుంది. రెండో సంవత్సరంలో ఫెలోషిప్ మొత్తంలో 10 శాతం పెరుగుతుంది. ఓరియంటేషన్ సమయంలో నెలకు రూ.50 వేల స్టైపెండ్ ఇస్తారు.
 
 విద్యార్హత: 50 శాతం మార్కులతో నాలుగేళ్ల వ్యవధి ఉన్న గ్రాడ్యుయేషన్ (అగ్రికల్చర్/ఇంజనీరింగ్/లా/మెడిసిన్/ యానిమల్ హజ్బెండరీ తదితర) లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్. స్థానిక భాషపై పట్టు, సంబంధిత రంగంలో అనుభవం, కాలేజీ/పాఠశాల స్థాయిలో ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
 వయసు: 22-27 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ- 32 ఏళ్లు).
 వెబ్‌సైట్: pmrdfs.tiss.edu


 
 
 ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలు తెలపండి?
 - వెంకట్, జడ్చర్ల.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. విజ్‌క్రాఫ్ట్ వంటి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, వివిధ టీవీ చానళ్లలో ఈవెంట్ మేనేజర్‌గా, లాక్మే వంటి సంస్థలు నిర్వహించే ఫ్యాషన్‌షోలకు కో-ఆర్డినేటర్లుగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఫిల్మ్‌ఫేర్ వంటి వివిధ మీడియా హౌస్‌లు, టూరిజం, అడ్వర్టైజ్‌మెంట్ హౌస్‌ల్లో కూడా స్థిరపడొచ్చు. విదేశాల్లోనూ, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్‌ఏ నెట్‌వర్క్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. ఈ రంగంలో రాణించాలంటే కొన్ని ప్రత్యేక స్కిల్స్ తప్పనిసరి. విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు నాయకత్వ లక్షణాలు తప్పనిసరి.
 
 అందిస్తున్న సంస్థలు:
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్- ముంబై.
 వెబ్‌సైట్: www.niemindia.com
 ఈఎండీఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్- హైదరాబాద్.
 వెబ్‌సైట్: www.emdiworld.com
 అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
 (అమిటీ యూనివర్సిటీ)- న్యూఢిల్లీ.
 వెబ్‌సైట్: www.amity.edu/aiem
 అపేజయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్- ద్వారక.
 వెబ్‌సైట్: www.apeejay.edu
 
 
 హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలు తెలియజేయగలరు?    - సంతోష్, నల్లగొండ.
 ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హ్యూమన్ రిసోర్స్ సబ్జెక్టుకు సంబంధించి డిప్లొమా నుంచి పీజీ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో హెచ్‌ఆర్‌ను ఓ స్పెషలైజేషన్‌గా దాదాపు అన్ని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అంది స్తున్నాయి. ఇంకా... రెండేళ్ల వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఎంఏ- హెచ్‌ఆర్‌ఎం/ ఐఆర్‌పీఎం కోర్సులు కూడా చదవొచ్చు. ఎంఏ.. ఎంబీఏ.. పీజీ డిప్లొమా.. కోర్సు ఏదైనా హెచ్‌ఆర్‌కు సంబంధించి బోధనాంశాలు ఒకే తీరుగా ఉంటాయి. మానవ వనరులు, మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలతో కరిక్యులం రూపొందిస్తున్నారు. ఉత్పత్తి రంగమైనా, సేవా రంగమైనా చిన్న తరహా సంస్థ అయినా, బహుళజాతి కంపెనీ అయినా హెచ్‌ఆర్ సిబ్బంది కావాల్సిందే. కాబట్టి సంబంధిత కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు.
 
 హెచ్‌ఆర్ స్పెషలైజేషన్‌ను ఆఫర్ చేస్తున్న కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు:
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
 వెబ్‌సైట్:www.uohyd.ernet.ac.in
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్- హైదరాబాద్
 వెబ్‌సైట్: www.ipeindia.org
 ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
 వెబ్‌సైట్: www.andhraunivercity.edu.in
 కాకతీయ యూనివర్సిటీ- వరంగల్
 వెబ్‌సైట్: www.kakatiya.ac.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement