టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
ఇన్సూరెన్స్ కోర్సులు అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
- శ్రీధర్, నిర్మల్.
వివిధ సంస్థలు ఇన్సూరెన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా బీమా పరిశ్రమపై ఔత్సాహికుల్లో సమగ్ర అవగాహన కల్పిస్తారు. బీమా వ్యాపారానికి యాక్చూరియల్ సైన్స్ ఆధారం. ఇన్సూరెన్స్ రిస్క్స్, ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని యాక్చూరియల్ సైన్స్ అందిస్తుంది. పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు బీమా వ్యాపారానికి అవసరం. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు యాక్చూరియల్ సైన్స్ ఉపయోగపడుతుంది.
ఇన్సూరెన్స్, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం), హైదరాబాద్.. ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్; ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్; ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
అర్హత: గ్రాడ్యుయేషన్. సీఏ, ఐసీడబ్ల్యూఐ లేదా సీఎస్ వంటి ప్రొఫెషనల్ అర్హతలున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐఐఆర్‌ఎం.. పీజీ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్ కోర్సును కూడా ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.iirmworld.org.in
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై.. ఎంఎస్సీ యాక్చూరియల్ సైన్స్ కోర్సును అందిస్తోంది.
అర్హత: మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌తో బీఎస్సీ.
వెబ్‌సైట్: www.unom.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, హైదరాబాద్.. ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్, జీడీ, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.ipeindia.org
అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్చూరియల్ సైన్స్, నోయిడా.. ఎంబీఏ (ఇన్సూరెన్స్) కోర్సును అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. మ్యాట్/క్యాట్/జీమ్యాట్/అమిటీ ఎంట్రన్స్, జీడీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్‌సైట్: www.amity.edu
కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టెన్సీలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో పీజీ ప్రోగ్రామ్ వివరాలు తెలియజేయండి?
- గణేశ్, వనపర్తి.
ఇన్‌స్ట్రుమెంటేషన్ అప్లికేషన్స్.. మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ఉపయోగపడతాయి. ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంటెక్ పూర్తిచేసిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయి.
కోర్సులు:
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్.. ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
అర్హత: ఈఈఈ/ఈసీఈ/ఈఐఈ/ఐసీఈలో బీఈ లేదా బీటెక్. గేట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.jntuh.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఇన్‌స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత: ఈసీఈ/ ఈఈఈ లేదా సంబంధిత సబ్జెక్టుతో బీఈ లేదా బీటెక్. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి..
ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈఈఈ/ ఈసీఈ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ కంట్రోల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్.
వెబ్‌సైట్: svuniversity.ac.in
కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలీ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. భారతీయ రైల్వేలు, బీఎస్‌ఎన్‌ఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర ప్రముఖ సంస్థల్లోనూ ఉన్నత ఉద్యోగాలుంటాయి. సంస్థలు రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తున్నాయి.
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ద్వారా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ లా చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు?
- గణేశ్, గుంటూరు.
రాజీవ్‌గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఐఐటీ ఖరగ్‌పూర్.. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సును అందిస్తోంది. ఈ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. మూడేళ్ల కాల వ్యవధిగల ఈ కోర్సులో ఆరు సెమిస్టర్లుంటాయి. ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్/ ఎల్‌శాట్ ఇండియా/ ఎల్‌శాట్ గ్లోబల్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, బేసిక్ సైన్స్, లీగల్ ఆప్టిట్యూడ్, ఎస్సే పరిజ్ఞానాన్ని పరీక్షించేలా పరీక్ష ఉంటుంది.
వెబ్‌సైట్: www.rgsoipl.iitkgp.ernet.in
నేను బీటెక్ పూర్తిచేశాను. కెనడాలో ఎంఎస్ చేయడానికి విధివిధానాలేమిటి?
- బాల, నిజామాబాద్.
కెనడాలో ఎంఎస్ చేయాలనుకుంటే తొలుత అక్కడ ఉన్న కొన్ని యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలి. ఆయా వర్సిటీల్లో ప్రవేశ విధానాలను తెలుసుకోవాలి. నిర్దేశ జీఆర్‌ఈ, టోఫెల్ స్కోర్ ఆధారంగా వర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ కోరిన అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీ నుంచి అంగీకారపత్రం లభిస్తే అప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.