
మూక్స్‌లో చేరండిలా...
హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ.. ఇవన్నీ ప్రపంచ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు. వీటిలో చదవడం ఒక కల. అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఈ యూనివర్సిటీల్లో చేరే అవకాశం అతికష్టమ్మీద లభిస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో ప్రతి ఒక్కరూ చేరే అవకాశం కల్పిస్తోంది.. మూక్స్ (మ్యాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్). అంతేకాదు.. కూర్చున్న చోటు నుంచే ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్ల పాఠాలు వినే స్వప్నాన్ని సైతం సాకారం చేస్తోంది మూక్స్. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్‌నెట్ కనెక్షన్, ల్యాప్‌ట్యాప్ లేదా కంప్యూటర్. మూక్స్ ద్వారా తమకు నచ్చిన, మెచ్చిన యూనివర్సిటీల్లో పేరు నమోదు చేసుకుని అవి అందించే కోర్సులు అభ్యసించొచ్చు. సదరు కోర్సు సర్టిఫికెట్లు కూడా పొందొచ్చు. ఈ నేపథ్యంలో మూక్స్ కోర్సులు, వాటిలో చేరడం ఎలాగో తెలుసుకుందాం..
మ్యాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ విధానంలో యూనివర్సిటీలు/కాలేజీలు/ ఇన్‌స్టిట్యూట్లు అధికారికంగా సర్వీస్ ప్రొవైడర్లతో (ఎన్‌పీటీఎల్, ఎడ్‌ఎక్స్, కోర్స్ ఎరా, యుడాసిటీ వంటివి ) ఒప్పందాలు చేసుకుంటాయి. ఔత్సాహిక అభ్యర్థులు ఆయా వెబ్‌సైట్లల్లో ఏ సమయంలోనైనా వారి వీలును బట్టి క్లాసెస్‌కు ఎన్‌రోల్ అవ్వొచ్చు.
క్రేజీ కోర్సులు ఇవే
ప్రస్తుతం మూక్స్‌లో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్న కోర్సులు.. డేటాసైన్స్, గేమిఫికేషన్, మెంటల్ టూల్స్, డెవలపింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫర్ న్యూ కంపెనీస్, పైథాన్ ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, రెజ్యుమే రైటింగ్ అండ్ కవర్ లెటర్స్, వెబ్‌సైట్ బేసిక్స్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, రుబీ వెబ్ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులు, క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సులు, జీఎస్టీ సర్టిఫికేషన్ కోర్సులు, రిస్క్ మేనేజ్‌మెంట్ కోర్సులు.
మూక్స్.. ఉపయోగం
మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్(మూక్స్) ద్వారా ఇంట్లోనే ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచంలోని ఏ యూనివర్సిటీ కోర్సులనైనా అభ్యసించే వీలుంది. వీటిద్వారా వివిధ కోర్సుల పట్ల ఆసక్తి ఉన్న వారు తమ ఇష్టమైన కోర్సుకు నమోదు చేసుకోవచ్చు. నాలెడ్జ్‌ను పెంచుకోవడానికి ఉపయోగపడే కోర్సుల్లో చేరవచ్చు. ఆర్థికంగా వెసులుబాటు లేక నేర్చుకోవడం ఆపేసిన వారు ఈ కోర్సుల్లో చేరి నాలెడ్జ్‌ను పెంచుకోవచ్చు.
మూక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ విధానం
మూక్స్ సర్వీస్‌ను అందించే ప్రొవైడర్లను బట్టి కోర్సుకు నమోదయ్యే విధానం ఉంటుంది. ఆయా ప్రొవైడర్ల నిబంధనలకు అనుగుణంగా కొన్ని కోర్సులు ఉచితంగా అభ్యసించొచ్చు. మరికొన్ని కోర్సులకు నిర్దిష్ట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రముఖ మూక్స్ ప్రొవైడర్‌గా పేరొందిన కోర్సెరాలో ఉచిత, పెయిడ్ కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం కోర్సెరా 29 దేశాలకు చెందిన దాదాపు 150 యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంది. వీటిల్లో స్టాన్‌ఫోర్డ్, డ్యూక్, పెన్న్, ప్రిన్స్‌టన్, మిచిగాన్, పెకింగ్, హెచ్‌ఈసీ ప్యారిస్ లాంటి ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయి.
వీటికి తోడు ఐబీఎం, గూగుల్, పీడబ్ల్యూసీ వంటి కంపెనీలతోనూ పార్టనర్‌షిప్స్ ఏర్పరచుకుంది. ఈ కంపెనీలు కూడా పలు కోర్సులను ప్రారంభిస్తున్నాయి. ఇక కోర్సెరా అందించే మూక్స్‌ను అభ్యసించి సదరు కోర్సులో సర్టిఫికేట్ పొందాలంటే మాత్రం నిర్ణీత ఫీజు చెల్లించాల్సిందే. నిర్ణీత ఫీజు చెల్లించి గ్రేడెడ్ అసైన్‌మెంట్లు పూర్తి చేస్తేనే సర్టిఫికెట్ లభిస్తుంది. చాలా కోర్సుల్లో కొంత భాగం వరకు ఉచితంగా చేసే వీలుంది. కానీ సర్టిఫికేషన్ చేయాలంటే మాత్రం ఫీజు చెల్లించాలి. కోర్సెరాలోని కొన్ని కోర్సుల్లో గ్రేడెడ్ అసైన్‌మెంట్స్ కూడా పూర్తిగా ఉచితంగా ఉన్నాయి.
‘ఆడిట్ ఆప్షన్’
కోర్సెరాలో ఆన్‌లైన్ కోర్సెస్, స్పెషలైజేషన్స్ అనే రెండు రకాల కోర్సులు ఉంటాయి. స్పెషలైజేషన్స్ ఆప్షన్ ద్వారా ఒక టాపిక్‌పై వరుస లెక్చర్లు ఉంటాయి. అంటే.. ఒక సబ్జెక్ట్‌లో ప్రావీణ్యులు కావడానికి స్పెషలైజేషన్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ కరిక్యులమ్‌లో చివరగా ప్రాజెక్ట్ కూడా ఉంటుంది.
కోర్సెరాలో ఉచిత క్లాసులను ఆడిట్ ఆప్షన్ ద్వారా చూడవచ్చు. www.coursera.org/courses వెబ్‌సైట్‌లో ఆసక్తి ఉన్న కోర్సును కీవర్డ్స్‌తో సెర్చ్ చేయాలి. ఫలితంగా వచ్చిన జాబితాలో నుంచి కోర్సును ఎంచుకోవాలి. తర్వాత ఎన్‌రోల్ బటన్ వస్తుంది. దానిపై క్లిక్ ఇస్తే లాగిన్/సైనప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. లాగిన్ తర్వాత చివర్లో చిన్నగా ఆడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎలాంటి చెల్లింపులు చేయకుండా క్లాసులు వినవచ్చు.
మూక్స్ ప్రొవైడర్స్
కోర్స్ ఎరా; వెబ్‌సైట్: www.coursera.org
ఎడెక్స్; వెబ్‌సైట్: www.edx.org
యుడాసిటీ; వెబ్‌సైట్:www.udacity.com
ఎన్‌పీటీఈఎల్
మన దేశంలోనూ.. ఐఐటీ, ఐఐఎం, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన ప్రొఫెసర్స్ లెక్చర్స్‌ను మూక్స్ విధానంలో అభ్యసించే అవకాశం అందుబాటులో ఉంది. ఈ మేరకు.. కేంద్ర మానవ వనరుల శాఖ ఎన్‌పీటీఈఎల్ (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్ లెర్నింగ్) అనే ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను జాతీయ స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఐఐటీలు, ఐఐఎస్‌సీకి చెందిన నిష్ణాతులైన అధ్యాపకులు ఇచ్చే లెక్చర్స్ అభ్యసించొచ్చు. ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్, హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులను అభ్యసించే వీలుంది. సాధారణ కాలేజీలో చదువుతున్నా ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్ అధ్యాపకుల క్లాసులు వినే అవకాశం ఎన్‌పీటీఈఎల్ ద్వారా కలుగుతుంది. కాబట్టి విద్యార్థులు సరైన బోధనా సిబ్బంది లేరనే ఆందోళన లేకుండా వీరి క్లాసులు వినే సదవకాశముంది. ఇప్పటికే సదరు కోర్సులు చదువుతున్నవారు, ఆసక్తి ఉన్న ఎవరైనా ఎన్‌పీటీఈఎల్ మూక్స్ కోర్సులకు ఎన్‌రోల్ చేసుకోవచ్చు.
జూలై – నవంబర్‌లో ప్రారంభమయ్యే కోర్సులు ఎన్‌పీటీఈఎల్‌లో నిరంతరం మూక్స్ అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే లెక్చర్స్ వివరాలు కూడా ఈ పోర్టల్‌లో ముందుగానే తెలియజేస్తారు. ప్రస్తుతం జూలై నుంచి నవంబర్ వరకు అందుబాటులో ఉండే కోర్సుల వివరాలు..
బయోలాజిలక్ సైన్సెస్ అండ్ బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మేనేజ్‌మెంట్, హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, సివిల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగాలు, మెకానికల్/ ఇండస్ట్రియల్/ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
మేనేజ్‌మెంట్ విభాగంలో ఇంట్రడక్షన్ టు డేటా అనలిటిక్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, జండర్ జస్టిస్ అండ్ వర్క్‌ప్లేస్ సెక్యూరిటీ, టోటల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఫర్ మేనేజర్స్, మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్, పేటెంట్ లా ఫర్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్స్, ఈ బిజినెస్, సిక్స్ సిగ్మా కోర్సులకు ఈ నెల 23/ 24 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
సీఎస్‌ఈ
ఇందులో సీ, సీ++, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, సెర్చ్ మెథడ్స్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటాబేస్ సిస్టమ్స్, పైథాన్, డిజైన్ అండ్ అనాలసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, ఆబ్జెక్ట్ ఓరియెంటేడ్ అనాలసిస్ అండ్ డిజైన్, థియరీ ఆఫ్ కంప్యూటేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, క్రిప్టాలజీ లాంటి కోర్సులు ప్రారంభం కానున్నాయి. కోర్సు పరిమితి: 4 వారాల నుంచి 12 వారాల వరకు ఉంటుంది.
ఎన్‌రోల్ ఇలా..
ఎన్‌పీటీఈఎల్ కోర్సులకు ఎన్‌రోల్ కావాలనుకునే వారు https://onlinecourses.nptel.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కోర్సు కేటగిరీ లేదా ఆల్ రన్నింగ్ కోర్సెస్‌లో మీకు ఇష్టమైన కోర్సును ఎంచుకోవాలి. తర్వాత గూగుల్ అకౌంట్‌తో పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిచేయాలి. దీని తర్వాత కోర్సు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. కోర్సు ప్రారంభమయ్యాక అభ్యర్థులు తమకు వీలైన సమయంలో వీడియో లెక్చర్లు వినవచ్చు. ప్రతివారం క్రమం తప్పకుండా అసైన్‌మెంట్స్ పూర్తి చేయాలి. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెషన్ ఎగ్జామ్ ఉంటుంది. దీని కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.