సీబీఎస్‌ఈ–ఎస్‌ఎస్‌సీ | CBSE -SSC | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ–ఎస్‌ఎస్‌సీ

Published Mon, Jun 26 2017 4:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

సీబీఎస్‌ఈ–ఎస్‌ఎస్‌సీ

సీబీఎస్‌ఈ–ఎస్‌ఎస్‌సీ

స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సీబీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ కరిక్యులం అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మెట్రో నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకు.. తల్లిదండ్రులంతా సీబీఎస్‌ఈకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి కారణమేంటి? అసలు సీబీఎస్‌ఈ కరిక్యులం, బోధనల్లోనిప్రత్యేకతలేంటిæ? చాలా మంది తల్లిదండ్రుల్లో రేకెత్తే ప్రశ్నలే ఇవి. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ విధానంలోని అంశాలపై ఫోకస్‌..


యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌
సీబీఎస్‌ఈ విధానంలో ‘యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌’ను విద్యార్థులకు అత్యంత అనుకూలాంశంగా చెప్పొచ్చు. ఇందులో సబ్జెక్ట్‌ను బోధించేటప్పుడు.. దానిపై పూర్తి అవగాహన కల్పించేలా తరగతిగదిలోనే విద్యార్థులతో యాక్టివిటీస్‌ చేయిస్తారు. ఉదాహరణకు.. గణితంలో ప్రాథమిక అంశాలైన కూడికల గురించి చెప్పేటప్పడు 2+2=4 అని బోర్డ్‌పై రాసి చూపడమే కాకుండా.. దానికి సంబంధించి చిన్నపాటి ప్రాక్టికల్‌ యాక్టివిటీని నిర్వహిస్తారు. ఫలితంగా చిన్నారుల్లో సదరు టాపిక్‌ను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. సీబీఎస్‌ఈ విధానంలోని మరో ప్రత్యేకత.. ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌. ఇందులో ఒక అంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థులను గ్రూపులుగా విభజించి.. వారితో సదరు టాపిక్‌పై ఏదైనా ఒక సమస్యను పరిష్కరింపజేస్తారు. ఈ విధానం భవిష్యత్తులో పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేందుకు బాటలు వేస్తుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌లోని మరో ప్రత్యేకత ఇలస్ట్రేషన్‌ మెథడ్స్‌ను అనుసరించడం. ఇందులో సబ్జెక్ట్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను బొమ్మలు, గ్రాఫ్‌లు, టేబుల్స్‌ రూపంలో బోధిస్తారు.

జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ
సీబీఎస్‌ఈ విధానంలో సిలబస్‌లోని ఒక అంశం ఆ తర్వాతి తరగతుల్లోనూ కొనసాగుతుంది. ఉదాహరణకు ఒకటో తరగతిలో పాఠ్యాంశాలు పదో తరగతి, +2 వరకు కొనసాగుతాయి. తరగతి స్థాయి పెరిగే కొద్దీ.. ఆయా అంశాల క్లిష్టత, విస్తృతి పెరుగుతుంది. దీంతోపాటు జాతీయ స్థాయిలో +2 అర్హతతో నిర్వహించే జేఈఈ, నీట్‌ తదితర పరీక్షలకు సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రామాణికంగా ఉంది. ఈ కారణంగానే ఆయా పరీక్షల్లో సీబీఎస్‌ఈ  విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు. ఇంగ్లిష్‌ నైపుణ్యాల విషయంలోనూ సీబీఎస్‌ఈ విద్యార్థులు ముందుంటున్నారు.

సబ్జెక్టులు.. సమ ప్రాధాన్యం
సీబీఎస్‌ఈ +2 స్థాయిలో అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను మేజర్‌ సబ్జెక్టులుగా చదవడంతో పాటు ఎలక్టివ్స్‌గా ఇతర విభాగాలకు చెందిన సబ్జెక్టులను అభ్యసించే అవకాశం ఉంటుంది. బోర్డ్‌ సిలబస్‌లో ఆ వెసులుబాటు లేదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు సీబీఎస్‌ఈ అనేక చర్యలు చేపడుతోంది. సీబీఎస్‌ఈ అకడమిక్‌ వెబ్‌సైట్‌ ద్వారా పలు రకాల లెర్నింగ్‌ మెటీరియల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

స్టేట్‌ బోర్డ్‌ సిలబస్‌లో మార్పులు
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల స్టేట్‌ బోర్డులు సైతం సిలబస్‌లో మార్పులు చేశాయి. కానీ, మౌలిక సదుపాయాల కొరతతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. స్టేట్‌ బోర్డ్‌ స్కూల్స్‌లో ప్రధానంగా యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్, ఇంటరాక్టివ్‌ లెర్నింగ్, ఇలస్ట్రేటివ్‌ మెథడ్స్‌కు అవసరమైన సామగ్రి కొరత అధికంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement