2016 నుంచి సరికొత్త ‘శాట్’ | College board declared to conduct new SAT from 2016 | Sakshi
Sakshi News home page

2016 నుంచి సరికొత్త ‘శాట్’

Published Wed, Oct 29 2014 1:00 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

2016 నుంచి సరికొత్త ‘శాట్’ - Sakshi

2016 నుంచి సరికొత్త ‘శాట్’

అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అండర్‌గ్రాడ్యుయేట్  కోర్సుల్లో ప్రవేశానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల  ఆదరణ పొందిన పరీక్ష.. స్కాలాస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్(శాట్). అమెరికాలోని కాలేజీ బోర్డ్ నిర్వహించే ఈ పరీక్ష విద్యార్థుల్లోని రీడింగ్, రైటింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్‌ను గుర్తించేలా ఉంటుంది. కాలానుగుణంగా  ఇందులో మార్పులు తీసుకురావాలని కాలేజీ బోర్డ్ నిర్ణయించింది. శాట్‌ను మరింత ప్రభావవంతంగా, ఉపయోగకరంగా, ఫోకస్డ్‌గా మార్చాలని యోచిస్తోంది.  
 
మారిన(రీ డిజైన్డ్) శాట్‌ను 2016 నుంచి నిర్వహించనున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. సమకాలీనంగా శాట్‌ను రూపొందిస్తారు. కాలేజీ విద్యను విజయవంతంగా పూర్తిచేయడానికి, తర్వాత ఉద్యోగ జీవితంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన నాలెడ్జ్, స్కిల్స్‌కు పెద్దపీట వేస్తారు.  2014, 2015లో విద్యార్థులు ప్రస్తుత విధానంలోనే ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.  శాట్‌లో 1600 స్కోర్ ఉంటుంది. ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్/రైటింగ్, మ్యాథమెటిక్స్.. వీటిలో ఒక్కో విభాగానికి  200 నుంచి 800 పాయింట్ స్కేల్‌పై స్కోర్‌ను కేటాయిస్తారు. వ్యాసం(ఎస్సే) స్కోర్‌ను ప్రత్యేకంగా గణిస్తారు. ఎస్సేను ఐచ్ఛికాంశం(ఆప్షనల్)గా మార్చనున్నారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఎస్సేకు అదనంగా 50 నిమిషాలు కేటాయిస్తారు. శాట్‌లో ముఖ్యంగా 8 మార్పులు జరిగే అవకాశాలున్నాయి.
 
 పద సంపద: విద్యార్థుల ఆంగ్ల పద సంపద(వొకాబ్యులరీ)ను పరీక్షిస్తారు. ఇచ్చిన ప్యాసేజీలోని పదాలకు సందర్భానికి తగిన అర్థాలను వివరించాలని అడగనున్నారు. నిత్యజీవితంలో ఎక్కువగా ఉపయోగించే పదాలను ఇస్తారు. అందుకే విద్యార్థులు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. ఒక పదానికి వేర్వేరు సందర్భాల్లో ఎలాంటి అర్థాలుంటాయో తెలుసుకుంటే ఈ విభాగంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు.
 
 రీడింగ్/రైటింగ్ : శాట్‌లో కీలకమైన సెక్షన్.. ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్/ైరె టింగ్. ఇందులో సాహిత్యం, నాన్ ఫిక్షన్, హ్యుమానిటీస్, సైన్స్, హిస్టరీ, సోషల్ స్టడీస్ వంటి వాటి నుంచి ఇన్ఫర్మేషనల్ గ్రాఫిక్స్, మల్టీ పేరాగ్రాఫ్ ప్యాసేజీలు ఇస్తారు. ఇందులో సమస్యలకు రుజువులతో సహా పరిష్కార మార్గాలను చూపాల్సి ఉంటుంది.   
 
 ప్యాసేజీపై విశ్లేషణ: రీ డిజైన్డ్ శాట్‌లో ఎస్సే సెక్షన్‌పై ఎక్కువ ఫోకస్ చేశారు. ప్యాసేజీని క్షుణ్నంగా చదివి, పాఠకులను మెప్పించేందుకు రచయిత చేసిన వాదనను విశ్లేషించాల్సి ఉంటుంది. విస్తృతంగా చదివే అలవాటు ఉన్నవారికి  ఈ సెక్షన్ సులభమే. రీడింగ్, అనాలిసిస్, రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి.
 
 మ్యాథమెటిక్స్: గణితంలో ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనాలిసిస్, ఆల్జీబ్రా వంటి వాటిలో విద్యార్థుల ప్రతిభను మరింత లోతుగా పరిశీలిస్తారు. కాలేజీ, కెరీర్‌లో సక్సెస్‌కు అవసరమైన జామెట్రిక్, ట్రిగొనోమెట్రిక్ స్కిల్స్ కూడా పరీక్షిస్తారు.
 
 రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్: సైన్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులతోపాటు కాలేజీ, కెరీర్‌కు సంబంధించిన విషయాలు, వాస్తవ ప్రపంచంలోని అంశాలపై ప్రత్యక్షంగా ప్రశ్నలు అడుగుతారు. ప్యాసేజీలు, ఫీచర్ చార్ట్‌లు, గ్రాఫ్‌లు కూడా ఇస్తారు. వీటిలో తప్పులను సరిచేయడంతోపాటు కుదించి, తిరగ రాయాల్సి ఉంటుంది. ఒక పరిస్థితిని వివరించి, దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తారు. ప్రపంచ, రాజకీయ పరిణామాలు: సైన్స్, హిస్టరీ, సోషల్ స్డడీస్‌లో ప్రశ్నలు సంధించి, అభ్యర్థుల రీడింగ్, రైటింగ్, లాంగ్వేజ్, అనలిటికల్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. తాజా ఆవిష్కరణలు, ప్రపంచ, రాజకీయ పరిణామాలు, ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాలపై కూడా ప్రశ్నలుంటాయి.
 
 మేధావుల బోధనలు: అమెరికా ఫౌండింగ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, బిల్ ఆఫ్ రైట్స్, ఫెడరలిస్ట్ పేపర్స్‌తోపాటు మహాత్మాగాంధీ, ఎడ్మండ్ బర్కీ వంటి రచయితలు, మేధావులు, ఆలోచనాపరుల బోధనలపై ప్రశ్నలు అడుగుతారు. ఫ్రీడమ్, జస్టిస్, హ్యుమన్ డిగ్నిటీపై కూడా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తారు.
 
 తప్పు సమాధానాలు: ప్రస్తుతం శాట్‌లో తప్పు సమాధానాలకు స్కోర్‌లో కోత విధిస్తున్నారు. ఈ విధానాన్ని మార్చబోతున్నారు. మార్చిన శాట్‌లో రాంగ్ ఆన్సర్స్‌కు ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఉత్తమమైన సమాధానాలు ఇచ్చే దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ మార్పు చేశారు.   
 
 ఎస్సేను ఐచ్ఛికం చేశారెందుకు?
 మల్టిపుల్ చాయిస్ ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్ అండ్ రైటింగ్ సెక్షన్‌లోనే విద్యార్థుల ఎడిటింగ్ వర్క్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఇవే స్కిల్స్‌ను టెస్ట్ చేయడానికి ఎస్సే పరీక్ష అవసరం లేదని శాట్ వర్గాలు భావించాయి. మరోవైపు ఎస్సేపై కాలేజీ అడ్మిషన్ అధికారుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. కొందరు దీనిపై మొగ్గుచూపగా, మరికొందరు అవసరం లేదని వాదించారు. అందుకే దీన్ని ఐచ్ఛికంగా మార్చారు.
 
 కాలిక్యులేటర్లు ఉపయోగించొచ్చా?
 శాట్ మ్యాథ్ టెస్ట్‌లోని రెండు సెక్షన్లలో కాలిక్యులేటర్లను అనుమతిస్తారు.  ఈ గణన యంత్రాన్ని సక్రమంగా ఉపయోగించడం విద్యార్థులకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. మ్యాథమెటిక్స్‌లో నో-కాలిక్యులేటర్ సెక్షన్ కూడా ఉంది.
 
 ఏ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు?
 పాత శాట్ లేక మార్చిన శాట్.. ఏ పరీక్ష స్కోర్ నైనా కళాశాలలు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ రెండు పరీక్ష రాసిన విద్యార్థులు రెండు స్కోర్లను కళాశాలలకు పంపించుకోవచ్చు. 2016లో మార్చిన పరీక్ష మొదలయ్యాక.. పాత పరీక్ష ఉండదు.
 
 పీశాట్/ఎన్‌ఎంఎస్‌క్యూటీ కూడా మారతాయా?
 నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి నిర్వహించే ప్రిలిమినరీ శాట్/నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ క్వాలిఫయింగ్ టెస్ట్(పీశాట్/ఎన్‌ఎంఎస్‌క్యూటీ)ని కూడా మార్చాలని కాలేజీ బోర్డ్, నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ కార్పొరేషన్ నిర్ణయించాయి. వెబ్‌సైట్: http://sat.collegeboard.org/
- లీసా జైన్, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాలేజీ  
బోర్డ్ ఇన్ ఇండియా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement