వ్యాపార నిర్వహణకు అనుకూల నగరం బెంగళూరు | Current affairs in indian economy 2013 | Sakshi
Sakshi News home page

వ్యాపార నిర్వహణకు అనుకూల నగరం బెంగళూరు

Published Thu, Jan 2 2014 1:37 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Current affairs in indian economy 2013

2013 - ఆర్థిక రంగం
 
82వ బడ్జెట్ సమర్పణ.. ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్.. తొలి మహిళా బ్యాంకు ప్రారంభం.. ఫోర్‌‌బ్స బిలియనీర్ల జాబితా.. వంటి అంశాలు ఆర్థికంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
 
 రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా 14వ ఆర్థిక సంఘాన్ని జనవరి 2న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
 జెనీవాలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) జనవరి 8న విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆర్థిక ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యంలో భారత్ 9వ స్థానంలోనూ, పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో 10వ స్థానంలోనూ ఉంది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది.
 
 వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 43వ వార్షిక సదస్సు దావోస్ (స్విట్జర్లాండ్) లో జనవరి 23 నుంచి 27వరకు జరిగింది.
 
 2011-12 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 6.2 శాతంగా (గతంలో దీన్ని 6.5 శాతంగా పేర్కొంది) కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్‌ఓ) అంచనా వేసింది. తాజా అంచనాలను జనవరి 31న విడుదల చేసింది. దీంతోపాటు అంతకుముందు రెండేళ్ల జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సవరించింది. దీని ప్రకారం 2010-11 లో వృద్ధిరేటు 8.4 శాతం నుంచి 9.3 శాతానికి పెరిగింది.
 
 భారతీయుల జీవన ప్రమాణాన్ని లెక్కించే సగటు నెలవారీ తలసరి ఆదాయం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం వృద్ధితో రూ.5,130కు పెరిగిందని కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌ఓ) పేర్కొంది. 2010-11లో ఇది రూ.4,513. కాగా, ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2011-12లో వార్షిక తలసరి ఆదాయాన్ని రూ. 61,564గా సీఎస్‌ఓ అంచనా వేసింది.
 
 ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) కు కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా కల్పించింది. దీంతో ఈ రెండు సంస్థలు రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు.
 
 2012-13లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌ఓ) ముందస్తు అంచనాల్లో ఫిబ్రవరి 7న తెలిపింది.
 
 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్‌ఈఎల్)లో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సల్స్ లిమిటెడ్ (బీహెచ్‌పీవీ) విలీనానికి ఫిబ్రవరి 21న కేంద్ర కేబినెట్ అనుమతించింది.
 
 2012-13 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 27న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యాంశాలు: 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6.1-6.7 శాతం మేర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందనేది సర్వే అంచనా. అయితే, ఈ ఏడాది (2012-13) వృద్ధిరేటు 5 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది.
 
 బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ మార్చి 4న బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. భారతీయుల్లో కుబేరుడిగా ముకేష్ అంబానీ మళ్లీ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. లక్ష్మీ మిట్టల్ రెండో ర్యాంక్‌ను పొందారు. విప్రో అధినేత ప్రేమ్‌జీ 11.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కాగా, ప్రపంచ కుబేరుల్లో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ (73 బిలియన్ డాలర్లు) వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని పొందడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ (67 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలిచారు.
 
 ఇంటర్నేషనల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఉపాధ్యక్షునిగా భారతీ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓ సునీల్ భారతీ మిట్టల్ ఎన్నికయ్యారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన మూడో వ్యక్తి మిట్టల్.
 
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) భారత్ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ ఏప్రిల్ 30న కుదించింది. ఆరు నెలల క్రితం 7 శాతంగా ఉన్న అంచనాలను 6.1 శాతానికి తగ్గించింది.
 
 బ్రెజిల్‌కు చెందిన రాబెర్టో అజెవెడో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డెరైక్టర్ జనరల్‌గా మే 8న నియమితులయ్యారు. డబ్ల్యూటీవో 1995, జనవరి 1న ఏర్పడింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో 159 దేశాలకు సభ్యత్వముంది.
 
 ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) 2013 సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 5.3 శాతానికి తగ్గించింది.
 
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు వాస్తవ ప్రాతిపదికన 5.7 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
 2014-15లో 6.5 శాతం, 2015-16లో 6.7 శాతం వృద్ధిరేటు ఉండొచ్చని పేర్కొంది.
 
 జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం మాస్కోలో జూలై 19-20 తేదీల్లో జరిగింది. ఆర్థిక వ్యవస్థల వృద్ధి పునరుత్తేజానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
 
 నాయకత్వానికి ఉత్తమమైన పది ఆసియా కంపెనీల జాబితాలో టాటా గ్రూప్ నాలుగో స్థానంలో నిలిచింది. శామ్‌సంగ్ కంపెనీకి మొదటి స్థానం దక్కింది. అంతర్జాతీయ జాబితాలో చూస్తే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, జనరల్ ఎలక్ట్రిక్, కోక-కోలాలు ఉన్నాయి.
 
 ప్రణాళిక సంఘం జూలై 23న విడుదల చేసిన అంచనాల ప్రకారం భారతదేశంలో 2011-12లో పేదరికం 21.9 శాతానికి తగ్గింది. ఇది 2004-05లో 37.2 శాతంగా ఉండేది. 2011-12లో పేదరికంలో ఉన్నవారి సంఖ్య 270 మిలియన్లు. అంటే ప్రతి ఐదుగురు భారతీయుల్లో ఒకరు దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 217 మిలియన్లు, పట్టణ ప్రాంతాల్లో 53 మిలియన్లు ఉన్నారు.
 
 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ సెప్టెంబర్ 4న బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా రాజన్ నియమితులయ్యారు.
 
 2013-14 ఆర్థిక అంచనాల నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఏసీ) సెప్టెంబర్ 13న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.3 శాతంగా పేర్కొంది. దీన్ని ఏప్రిల్‌లో 6.4 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగం 4.8 శాతం, పారిశ్రామిక రంగం 2.7 శాతం వృద్ధి చెందుతాయని పేర్కొంది. సేవల రంగంలో వృద్ధి 6.6 శాతానికి తగ్గుతుందని తెలిపింది.
 
 ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నిధులు (రెమిటెన్సులు) పొందడంలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 2013లో భారత్ 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు పొంది మొదటి స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో అక్టోబర్ 3న తెలిపింది. చైనా 60 బిలియన్ డాలర్లు పొంది రెండో స్థానంలో నిలిచింది.
 
 భారత్ స్థూల దేశీయోత్పత్తి 2013లో కేవలం 3.75 శాతమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. క్రితం అంచనా (ఏప్రిల్‌లో) 5.7 శాతం. కాగా 2014లో వృద్ధిరేటు అంచనాను సైతం ఇంతకు ముందు ఉన్న 6.2 శాతం నుంచి 5 శాతానికి కుదించింది.
 
 2050 నాటికి భారత్ 160 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రఫిక్ స్టడీస్ తెలిపింది. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 710 కోట్ల్లుగా ఉంది.
 
 అభివృద్ధి చెందిన దేశాల్లో 15.7 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ తెలిపింది. అక్టోబర్ 2న విడుదల చేసిన ‘ప్రపంచంలో ఆహార భద్రత స్థితి - 2013’ అనే నివేదికలో 2011- 13లో మొత్తం 842 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు తెలిపింది.
 
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) భారత్ వృద్ధి రేటు కేవలం 4.7 శాతమేనని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. గతంలో 6.1 శాతంగా వేసిన అంచనాలను కుదించింది.
 
 భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు బెంగళూరు అత్యంత అనుకూలమైన నగరంగా అగ్రస్థానం దక్కించుకుంది. హైదరాబాద్ 12వ స్థానంలో, విశాఖపట్నం 21వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు తర్వాత చెన్నై, ముంబై, పుణే నగరాలు వరుసగా తర్వాత స్థానాలు దక్కించుకోగా ఢిల్లీకి అసలు చోటు దక్కలేదు.
 
 భారతీయ మహిళా బ్యాంకు తొలి శాఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నవంబర్ 19న ముంబైలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా చెన్నై, బెంగళూరు, గువాహటి, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్  శాఖలను కూడా ప్రధాని ప్రారంభించారు.
 
 భారత వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు.
 
 దేశీయ అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కి మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉషా సంగ్వాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
 
 ప్రపంచంలో వ్యాపారానికి ఉత్తమ దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ 5న విడుదల చేసింది. 148 దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం దక్కింది. ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌కు రెండో స్థానం, హాంగ్‌కాంగ్‌కు మూడో స్థానం లభించాయి.
 
 కేంద్ర బడ్జెట్: 2013-14
 ముఖ్యాంశాలు
 
 2013-14 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 28న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఇది ఎనిమిదోసారి. తద్వారా ఆయన.. అత్యధిక బడ్జెట్లు సమర్పించిన రెండో ఆర్థిక మంత్రిగా ఘనత సాధించారు. ఈ జాబితాలో పది బడ్జెట్లతో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తొలి స్థానంలో ఉన్నారు. మొత్తమ్మీద స్వతంత్ర భారతావనిలో ఇది 82వ బడ్జెట్. వీటిలో 66 సాధారణ వార్షిక బడ్జెట్‌లు కాగా, 12 తాత్కాలిక బడ్జెట్‌లు, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన నాలుగు మినీ బడ్జెట్‌లు ఉన్నాయి.
 
 బడ్జెట్ వ్యయం: రూ. 16,65,297 కోట్లు
 రెవెన్యూ వసూళ్లు: రూ.10,56,331 కోట్లు
 మూల ధన వసూళ్లు: రూ.6,08, 967 కోట్లు
 ప్రణాళికా వ్యయం: రూ. 5,55,322 కోట్లు
 ప్రణాళికేతర వ్యయం: రూ. 11,09,975 కోట్లు
 రెవెన్యూ లోటు: రూ. 3,79,838 కోట్లు
 ద్రవ్య లోటు: రూ. 5,42,499 కోట్లు
 ప్రాథమిక లోటు: రూ. 1,71,814 కోట్లు
 వివిధ రంగాలకు కేటాయింపులు:
 రక్షణ వ్యయం: రూ. 2,03,672 కోట్లు
 గ్రామీణాభివృద్ధి: రూ. 80,194 కోట్లు
 వ్యవసాయం: రూ. 27,049 కోట్లు
 విద్య: రూ. 65,867 కోట్లు
 శాస్త్ర సాంకేతిక రంగం: రూ. 6,275 కోట్లు
 
 భారత జీడీపీ వృద్ధి రేటు 2013లో 5.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదిక  పేర్కొంది. 2014లో ఈ రేటు 6.4 శాతంగా ఉంటుందని కూడా తెలిపింది.
 
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 7న నియమితులయ్యారు. బ్యాంక్ చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement