ప్రస్తుతం ట్యాక్సేషన్, రిటర్న్స్ ఫైలింగ్‌పై అందరిలో అవగాహన పెరిగింది. అదే సమయంలో వీటికి సంబంధించిన నిబంధనలు కఠినంగా అమలవుతున్న కారణంగా రిటర్న్స్ దాఖలు చేయడానికి, పన్ను భారం నుంచి వీలైనంత మినహాయింపు పొందడానికి అందరూ ట్యాక్సేషన్ నిపుణులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తున్న ట్యాక్సేషన్ విభాగంలో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
ప్రధానంగా రెండు విభాగాలు
ట్యాక్సేషన్‌లో ప్రధానంగా రెండు విభాగాలున్నాయి. అవి.. డెరైక్ట్ ట్యాక్సేషన్, ఇన్-డెరైక్ట్ ట్యాక్సేషన్. వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగం, ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందేవారు చెల్లించే ఇన్‌కం ట్యాక్స్.. డెరైక్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. సంస్థల స్థాయిలో ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటివి ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ రెండు విభాగాల్లో నిపుణుల అవసరం పెరుగుతోంది.
డిగ్రీ, పీజీ స్థాయిలో..
ట్యాక్సేషన్ విభాగంలో నైపుణ్యాలు పొందేందుకు సంప్రదాయ డిగ్రీ నుంచే బాటలు వేసుకోవచ్చు. బీకాం స్థాయిలో గ్రూప్ సబ్జెక్టుల కాంబినేషన్‌లో ట్యాక్సేషన్ ఒక ప్రధాన సబ్జెక్టుగా ఉంటోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు సేల్స్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్‌కం ట్యాక్స్, ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ వంటి సబ్జెక్టులను స్పెషలైజేషన్లుగా అందిస్తున్నాయి.
స్పెషలైజ్డ్ కోర్సులు కూడా..
ఇటీవలి కాలంలో ట్యాక్సేషన్ రంగంలో ఏర్పడుతున్న మానవ వనరుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, సంస్థలు ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్, పీజీ డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్/ట్యాక్స్ ‘లా’స్ పేరుతో కోర్సులు అందిస్తున్నాయి. ట్యాక్సేషన్‌లో ప్రస్తుతం ఆన్‌లైన్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ట్యాక్స్ స్టడీస్ (చెన్నై), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ (ఢిల్లీ) వంటి కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో ఉండే సర్టిఫికెట్ కోర్సులను ఆన్‌లైన్ విధానంలో కరస్పాండెన్స్ పద్ధతిలో ఆఫర్ చేస్తున్నాయి.
దూర విద్యావిధానంలో..
ట్యాక్సేషన్ నిపుణుల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని, యూనివర్సిటీలు సైతం దూరవిద్యా విధానంలో పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, ఐఎంటీ - ఘజియాబాద్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ వంటి ప్రముఖ యూనివర్సిటీలు ఫైనాన్షియల్ ట్యాక్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్
చేస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ కోర్సులు కూడా..
ట్యాక్సేషన్ రంగంలో ఇటీవల సాఫ్ట్‌వేర్ కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈఆర్‌పీ సొల్యూషన్స్‌గా పేర్కొనే శాప్-ఫికోలో ట్యాక్సేషన్ ఒక సబ్జెక్టుగా ఉంటోంది. అదేవిధంగా అకౌంటింగ్ ప్యాకేజ్‌లుగా పేర్కొనే ట్యాలీ, వింగ్స్, పీచ్ ట్రీ కోర్సుల్లోనూ డెరైక్ట్ ట్యాక్సెస్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్‌కు సంబంధించి నైపుణ్యాలు అందించే విధంగా కోర్సు స్వరూపం ఉంటోంది.
పలు హోదాల్లో..
ట్యాక్సేషన్ విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ కోర్సులు పూర్తిచేసిన వారికి అర్హతలకు తగిన విధంగా వివిధ సంస్థల్లో, ట్యాక్స్ కన్సల్టింగ్ కంపెనీల్లో పలు హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అవి.. ట్యాక్స్ అకౌంటెంట్, ట్యాక్స్ అనలిస్ట్, ట్యాక్స్ అడ్వైజర్, ట్యాక్స్ ఎగ్జామినర్, ట్యాక్స్ మేనేజర్, బిజినెస్ ట్యాక్స్ అడ్వైజర్, ఇన్‌కం ట్యాక్స్ అడ్వైజర్.
ఆకర్షణీయ వేతనాలు
ఎంట్రీ లెవల్‌లో ట్యాక్స్ అకౌంటెంట్‌గా కనిష్టంగా రూ.15 వేలతో కెరీర్ ప్రారంభించొచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ అడ్వైజర్/మేనేజర్ స్థాయిలో గరిష్టంగా నెలకు రూ.40 నుంచి రూ.45 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉంది.
స్వయం ఉపాధి..
ట్యాక్సేషన్ విభాగంలో స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి క్లయింట్లకు ఔట్‌సోర్సింగ్ విధానంలో సేవలందించొచ్చు. అయితే ఈ విషయంలో అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నెట్‌వర్క్ బాగా ఉంటేనే క్లయింట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఆ మూడు సంస్థల్లో స్పెషలైజ్డ్ కోర్సులు
కామర్స్ కెరీర్స్ అనగానే గుర్తొచ్చే మూడు ఇన్‌స్టిట్యూట్‌లు.. ఐసీఏఐ (ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా), ఐసీడబ్ల్యూఏఐ (ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా), ఐసీఎస్‌ఐ (ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా). ఇప్పుడు ఇవి కూడా సర్వీస్ ట్యాక్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్‌లో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నాయి.
ప్రస్తుతం ట్యాక్స్ ఫైలింగ్, రిటర్న్స్ దాఖలు విషయాల్లో ఈ-ఫైలింగ్ విధానం అందుబాటులోకి వచ్చినా ట్యాక్సేషన్ నిపుణులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి రూపాల్లో ముందుగానే పన్ను చెల్లింపులు చేసిన వ్యక్తులు, సంస్థలు ఆర్థిక సంవత్సరం చివరలో దాఖలు చేసే రిటర్న్స్ సమయంలో మినహాయింపులు ఆశించడం. ఇందుకోసం ట్యాక్సేషన్ నిపుణులను సంప్రదిస్తున్నారు. చిన్న పట్టణాల నుంచి మెట్రో సిటీల వరకు బహుళ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- ఆర్. చెంగల్ రెడ్డి,
ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ వైస్ చైర్మన్.
టాప్ గేర్‌లో...ట్యాక్సేషన్!
Published Sun, Oct 23 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
Advertisement