క్యాట్ @ 172
ఈ ఏడాది 172 బిజినెస్ స్కూల్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నాయి. గతేడాది 130 ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే క్యాట్ ఆధారంగా అడ్మిషన్లు చేపట్టాయి. క్యాట్ ఫలితాలను జనవరి 14న ప్రకటిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 13 ఐఐఎంలలో 3,335 సీట్లు ఉన్నాయి. మరో 115 సీట్లు పెరిగే అవకాశం ఉంది.
మారనున్న బీఈడీ, డీఈడీ కోర్సుల స్వరూపం
ఉపాధ్యాయ కోర్సుల స్వరూపం పూర్తిగా మారిపోనుందని, ప్రాథమిక విద్యకు, ప్రాథమికోన్నత విద్యకు, సెకండరీ స్కూల్ విద్యకు సంబంధించి వేర్వేరు కోర్సులు అందుబాటులోకి రానున్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎస్‌సీటీఈ) చైర్‌పర్సన్ సంతోష్ పండా తెలిపారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు కేంద్రం ఈ సంస్కరణలు తేనుందని వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న డీఈడీ కోర్సుకు బదులుగా 12వ తరగతి తర్వాత రెండు సమీకృత కోర్సులు అమల్లోకి వస్తాయి.
వాటిల్లో ఒకటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కాగా, మరొకటి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ). డీఈఎల్‌ఈడీ కోర్సు 12వ తరగతి అనంతరం నాలుగేళ్లపాటు ఉండే సమీకృత డిగ్రీ. అంటే డిగ్రీతోపాటు ఉపాధ్యాయ విద్యలో శిక్షణ ఉంటుంది. ఇది ప్రాథమిక విద్యార్థులకు (ఐదో తరగతి వరకు) బోధించేందుకు ఉద్దేశించింది. బీఈఎల్‌ఈడీ కోర్సు కూడా నాలుగేళ్లపాటు ఉంటుంది. ఇది కూడా సమీకృత డిగ్రీ. డిగ్రీతోపాటు ఉపాధ్యాయ విద్యలో శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు చేసిన వారు 8వ తరగతి వరకు బోధించవచ్చు. డిగ్రీ తర్వాత ఉండే బీఈడీ కాలవ్యవధి రెండేళ్లు. ఇది సెకండరీ విద్యకు సంబంధించిన కోర్సు.
కొత్తగా 58 మెడికల్ కాలేజీలు
దేశంలో కొత్తగా 58 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటి ద్వారా 5,800 సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ అనుమతినిచ్చింది. ఈ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూరుస్తాయి. ఇందులో కేంద్రం తన వాటాగా రూ. 8,457.40 కోట్లు సమకూరుస్తుంది. రాష్ట్రాలు తమ వాటాగా రూ. 2,513.70 కోట్లు వెచ్చిస్తాయి. ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటుకు దాదాపు రూ. 189 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 381 మెడికల్ కాలేజీల్లో 49,918 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కృష్ణన్ రీసెర్చ్ అసోసియేట్‌షిప్ ఫెలోషిప్స్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డాక్టర్ కృష్ణన్ రీసెర్చ్ అసోసియేట్‌షిప్ ఫెలోషిప్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఫెలోషిప్స్ ద్వారా బార్క్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డు, వేరిబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ వంటి సంస్థల్లో పరిశోధనల్లో పాలుపంచుకోవచ్చు. అంతేకాకుండా ఇదే సమయంలో నెలకు రూ.26 వేల స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2014
వివరాలకు: www.barc.gov.in
ఏఐపీఎంటీ తో ఏఎఫ్‌ఎంసీ
దేశంలోని ప్రఖ్యాత మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటైనా.. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్‌ఎంసీ)-పుణే 2014 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది అడ్మిషన్లను సీబీఎస్‌ఈ నిర్వహించే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) ద్వారా చేపట్టనున్నారు. ఈ పరీక్షను మే 4న నిర్వహించనున్నారు. ఏఎఫ్‌ఎంసీలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు ఏఐపీఎంటీకి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 31 (రూ. 1000 అపరాధ రుసుంతో). అంతేకాకుండా ఏఎఫ్‌ఎంసీ ఇన్‌స్టిట్యూట్‌కు కూడా వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వివరాలను త్వరలోనే ఇన్‌స్టిట్యూట్ వెల్లడిస్తుంది.