
గాడ్జెట్స్.. ఫ్లాప్స్
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్.. సాంకేతిక విప్లవంలో సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ముఖ్యంగా యువతకు వీటిపై ఉండే మక్కువను మాటల్లో చెప్పలేం. అందుకే యువతను ఆకర్షించేలా నిత్యం ఏదో ఒక కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వస్తోంది. దిగ్గజ కంపెనీలు కూడా మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా సరికొత్త గాడ్జెట్లను రూపొందిస్తున్నాయి. అవి క్లిక్ అయితే అందరికీ చేరువవుతాయి. కానీ ప్రపంచంలోనే టాప్ కంపెనీలు బెస్ట్ అని భావించి, ఎన్నో కొత్త ఫీచర్స్‌తో తెచ్చిన గాడ్జెట్స్ సైతం వినియోగదారులను ఆకట్టుకోలేక తెరమరుగైన సందర్భాలెన్నో! అలా మార్కెట్‌లో ఫెయిల్ అయిన గాడ్జెట్లు సెగ్వే పీటీ, గూగుల్ గ్లాస్
గురించి తెలుసుకుందాం..
సెగ్వే పీటీ (పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్)
ఐఫోన్ తర్వాత అంతే స్థాయి అంచనాలతో మార్కెట్‌లోకి వచ్చిన ఆవిష్కరణ.. ది సెగ్వే పీటీ (పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్). ఇది రెండు చక్రాలుండే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బ్యాటరీ ఎలక్ట్రానిక్ వెహికల్. దీన్ని 2001లో అమెరికాకు చెందిన డీన్ కామెన్ రూపొందించారు. దీన్ని ఇండియాలో బర్డ్ సెగ్వే పేరుతో బర్డ్ గ్రూప్ కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సెగ్వేను నడపడం చాలా సులువు. ఇది మోషన్ సెన్సార్ల ఆధారంగా రైడర్ కదలికలను బట్టి ముందుకు వెనక్కి, కుడి, ఎడమ వైపులకు కదులుతుంది. సెగ్వే పీటీలను కేవలం సాధారణ ప్రయాణాలకు మాత్రమే కాకుండా.. విమానాశ్రయాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, టూరిజంలో ఎక్కువగా వినియోగిస్తారు. దీని గరిష్ట వేగం గంటకు 20 కి.మీ.
చాలా అంచనాలతో ఈ వెహికల్‌ను లాంచ్ చేశారు. స్టీవ్ జాబ్స్ సైతం పర్సనల్ కంప్యూటర్ లాగే సెగ్వే కూడా ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఒక కొత్త ఆవిష్కరణగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో దీని పట్ల చాలా ఆసక్తి పెరిగింది. కానీ ఇది లాంచ్ అయిన తర్వాత అంచనాలను అందుకోకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో పోలీస్ పెట్రోలింగ్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, పర్యాటక రంగాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.
గూగుల్ గ్లాస్..
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి మరో అద్భుత టెక్నాలజీగా భావించిన ప్రొడక్ట్.. గూగుల్ గ్లాస్. కీబోర్డులు, టచ్ స్క్రీన్‌ల అవసరం లేకుండా మాటలతోనే గారడీ చేయడానికి కళ్ల జోడు రూపంలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త గాడ్జెట్ గూగుల్ గ్లాస్. ఇది కళ్లజోడు ఆకారంలో ఉండే ఆప్టికల్ హెడ్ మౌంటెడ్ డిస్‌ప్లే. ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్, మెసేజింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటివి చేయొచ్చు.
క్లిక్ ఎ పిక్చర్ అంటే వెంటనే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని ఫొటో తీస్తుంది. రికార్డ్ అంటే వీడియో తీస్తుంది. అంతేకాదు దీని ద్వారా తీసిన ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అప్‌లోడ్ చేసుకోవచ్చు. గమ్యం తెలియని చోట దారి చూపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. గూగుల్ గ్లాస్ ధరిస్తే ఒక చిన్న కంప్యూటర్ కళ్ల ముందు ఉన్నట్టే. ఇన్ని సదుపాయాలతో మార్కెట్‌లోకి వచ్చిన గూగుల్ గ్లాస్ మొదట్లో ఎక్కువ మందిని ఆకర్షించింది.
కానీ దీనికి సరైన మార్కెటింగ్ లభించలేదని నిపుణుల అభిప్రాయం. దీనికి తోడు గూగుల్ గ్లాస్ సాయంతో ఎదుటివారికి తెలియకుండా ఫొటో లు, వీడియోలు తీసే అవకాశం ఉండటంతో ప్రైవసీ, పైరసీ లాంటి వివాదాలు తలెత్తాయి. అప్పట్లో ఇంగ్లండ్‌లోని రెస్టారెంట్లు, థియేటర్లు, ఆసుపత్రుల్లాంటి ప్రదేశాల్లో గూగుల్ గ్లాస్ వాడకంపై నిషేధం విధించారు. గొప్ప టెక్నాలజీ ఇన్నోవేషన్‌గా, పెద్ద హంగామాతో ఎంతో ఆసక్తి రేపుతూ జనం ముందుకు వచ్చిన గూగుల్ గ్లాస్ చివరకు ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేక తెరమరుగైంది.