
ఐదో తరగతి డ్రాపవుట్..వందల మందికి పాఠాలు!
చదువంటే అమితాసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక ఐదో తరగతితోనే బడి మానేసిన ఆ బాలుడు తర్వాత బతుకుతెరువుకు ఎన్నో పనులు చేశాడు. ఫ్యాక్టరీల్లో కూలిపనులకు వెళ్లాడు. రెస్టారెంట్లు, గ్యారేజీల్లో పనిచేశాడు. టీలు, సమోసాలు అమ్మాడు. ఎన్నోసార్లు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో అన్నదానం ద్వారా ఆకలి తీర్చుకున్నాడు. కొన్ని రోజులు ఆటో నడిపాడు.
కానీ చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని, ఎప్పటికైనా తాను చదువు కొనసాగించి తనలాంటి వారికి సాయపడాలని సంకల్పించాడు. అదే సంకల్పంతో పదేళ్ల తర్వాత మళ్లీ చదువు మొదలు పెట్టి డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం బిహార్ మారుమూల ప్రాంతాల్లో వందల మంది నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించిన బిహార్ యువకుడు విజయ్ కుమార్ చౌహాన్ స్ఫూర్తిదాయక కథనం.
విజయ్ కుమార్ చౌహాన్ తల్లిదండ్రులు దినసరి కూలీలు. పూటగడవడం కోసం కుటుంబంలో అందరూ పని చేయాల్సిన పరిస్థితి. అందువల్ల విజయ్ ఐదో తరగతి తర్వాత చదువు మానేసి కూలి పనులకు వెళ్లేవాడు. పదిహేనేళ్ల వయసులో లూథియానాకు మకాం మార్చాడు. పొట్టకూటికోసం ఎన్నో పనులు చేశాడు. అయితే మనసులో చదువుకోలేకపోయాననే బాధ నిరంతరం వెంటాడేది. తన స్వస్థలం బిహార్‌లో ఎంతో మంది తనలాగే చదువుకు దూరమవడం కలచివేసేది. ఎలాగైనా తాను చదువును కొనసాగించి అలాంటి వారికి సాయపడాలని భావించేవాడు.
మళ్లీ సొంతూరుకు
దాదాపు పదేళ్ల తర్వాత విజయ్ కుమార్ 2012లో స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అక్కడ ప్రయోగ్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీవో) అమలు చేస్తున్న బోధన విధానం విజయ్‌కు బాగా కలిసొచ్చింది. దానిద్వారా పలు పుస్తకాలు, శిక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేవి. వాటిని వినియోగించుకొని పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత దూరవిద్యా విధానంలో బీఏ సైతం పూర్తి చేశాడు.
అసలు ప్రస్థానం
ప్రయోగ్ ద్వారా చదువు నేర్చుకున్న తర్వాతి నుంచే విజయ్ తన అసలు ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ముందుగా ప్రయోగ్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ సమీప గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లి ప్రయోగ్ విశేషాలను అక్కడి విద్యార్థులకు వివరించేవాడు. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల లభించే ఫలితాల గురించి తననే ఉదాహరణగా పేర్కొంటూ వారిలో చదువు పట్ల ఆసక్తి పెంచాడు. అలాగే ఆ ఎన్‌జీవో సాయంతో వందల మంది పేద విద్యార్థులు బడి బాట పట్టేలా చేశాడు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ స్థాయి విద్యాభివృద్ధిపై విజయ్ దృష్టి సారించాడు.
తానే స్వయంగా ఇంటర్మీడియెట్ స్థాయి విద్యార్థులకు శిక్షణనిచ్చేలా సంస్థను నెలకొల్పేందుకు నడుం బిగించాడు. కానీ ఇంటర్‌లో ఉండే మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల బోధనకు ముందుకొచ్చే వారు కనిపించలేదు. దాంతో మ్యాథ్స్, సైన్స్‌లను తానే నేర్చుకొని విద్యార్థులకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్లపాటు ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లను ఔపోసన పట్టాడు. వాటిలోని మెళకువలన్నీ నేర్చుకొని బోధనలో ఆరితేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
వీడియో లెక్చర్స్
ఇంటర్ సబ్జెక్ట్‌లలో నైపుణ్యాలు పొందిన విజయ్.. ఆ పాఠాలు అందరికీ చేరువయ్యేందుకు వీడియో లెక్చర్స్ సరైన మార్గమని భావించాడు. అప్పటికే బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ప్రయోగ్ ద్వారా వాటిని అందుబాటులోకి తెచ్చాడు. వాటికి ఇప్పుడు ఎంతో ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ప్రయోగ్ ద్వారా శిక్షణ ఇస్తున్న విజయ్ త్వరలోనే సొంతగా శిక్షణ సంస్థను నెలకొల్పుతానని, అందుకు అవసరమైన నిధుల సమీకరణకు అన్వేషిస్తున్నానని చెబుతున్నాడు.
ఎందరో ఉత్తీర్ణులు.. అదే ఆనందం
ప్రయోగ్ డిజిటల్ క్లాస్‌లు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గతం కంటే ఎంతో పెరిగిందని, అది తనకు చాలా ఆనందం కలిగిస్తోందని అంటున్నాడు విజయ్. ఇప్పుడు డిజిటల్ పాఠాలు నేర్చుకొని ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు.
దృఢ సంకల్పం ఉంటే అడ్డంకులెన్ని ఎదురైనా అనుకున్నది సాధించొచ్చని, ఆ సంకల్ప బలమే తనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిందని అంటాడు విజయ్. ఇల్లు గడవడానికి ఐదో తరగతిలో బడి మానేసి కూలి పనులు చేసిన తాను ఇప్పుడు డిగ్రీ పట్టాతో వందల మందికి పాఠాలు చెప్పగలగడానికి దృఢ సంకల్పమే కారణమంటున్నాడు.