ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ | Football World Cup in Germany | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ

Published Thu, Jul 17 2014 4:35 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ - Sakshi

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ

వార్తల్లో వ్యక్తులు
 ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్
 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా రామ్‌నాయక్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ జూలై 14న ఉత్తర్వులు జారీచేసింది. అలాగే గుజరాత్‌కు ఓమ్ ప్రకాశ్ కోహ్ల, పశ్చిమబెంగాల్‌కు కేసరినాథ్ త్రిపాఠి, చత్తీస్‌గఢ్‌కు బలరాందాస్ టాండన్, నాగాలాండ్‌కు పద్మనాభ ఆచార్యలు గవర్నర్లుగా నియమితులయ్యారు. పద్మనాభ ఆచార్యకు త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ జూలై 11న ఉత్తర్వులు జారీచేసింది. అండమాన్ నికోబార్‌దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అజయ్‌కుమార్‌సింగ్ పుదుచ్చేరి అదనపు బాధ్యతలను అప్పగించింది.
 
 అదనపు సొలిసిటర్ జనరల్‌గా పింకీ ఆనంద్
 సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో నియమితులైన రెండో మహిళ. కాగా సుప్రీంకోర్టు నుంచి మహిళా అధికారి నియామకం కావడం ఇదే తొలిసారి. మొదటి మహిళా అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్.
 
 ఇక్రిశాట్ రాయబారులుగా స్వామినాథన్, సైనా

 అంతర్జాతీయ మెట్ట పంటల, ఉష్ణమండల వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) రాయబారులుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నియమితులయ్యారు. జూలై 14న సంస్థ డెరైక్టర్ జనరల్ విలియం డి దార్ గౌరవ ఇక్రిశాట్ అంబాసిడర్ ఆఫ్ గుడ్‌విల్ అవార్డును వారికి అందజేశారు.
 
 ఐరాస గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎమ్మా
 ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్ జూలై 8న నియమితులయ్యారు. ఈమె హ్యారీ పోటర్ సీక్వెల్ చిత్రాల్లో నటించారు. గుడ్ విల్ అంబాసిడర్‌గా యువతుల్లో సాధికారత, స్త్రీలకు పురుషులతో సమాన హోదా అంశాలపై ఆమె విస్తృత ప్రచారం చేయనున్నారు.
 
 కాలిఫోర్నియా వర్సిటీ

 సీఐఓగా భారతీయ మహిళ
 అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (డేవిస్)‘ ముఖ్య సమాచార కమిషనర్ (పీఐఓ)గా భారతీయ అమెరికన్ విజీ మురళి నియమితులయ్యారు. ఆమె కాలిఫోర్నియా వర్సిటీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తారు. ఉస్మానియా వర్సిటీ నుంచి 1977లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేశారు.
 
 సీఈఐబీ డైరక్టర్ జనరల్‌గా అర్చనా రంజన్
 ఆర్థిక నేరాలను నియంత్రించే సంస్థలను సమన్వయపరిచే అత్యున్నతమైన కేంద్ర ఆర్థిక నిఘా సంస్థ (ిసీఈఐబీ ) డైరక్టర్ జనరల్‌గా అర్చనా రంజన్ నియమితులయ్యారు. 1979 బ్యాచ్‌కు చెందిన అర్చనా రంజన్ ప్రస్తుతం రాజస్థాన్ ఆదాయపు పన్ను శాఖ ముఖ్య కమిషనర్‌గా ఉన్నారు.
 
 జాతీయం
 కేంద్ర బడ్జెట్ 2014-15

 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 17,94,892 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జులై 10న లోక్‌సభకు సమర్పించారు. అందరితో కలిసి... అందరి వికాసానికి (సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్) నినాదంతో రూపొందించిన బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు... ప్రణాళిక వ్యయం రూ.5,75, 000 , ప్రణాళికేతర వ్యయం రూ.12,19, 892 కోట్లు, మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 17,94, 892 కోట్లు. 2014-15లో ద్రవ్యలోటు లక్ష్యం జీడీపీలో 4.1శాతం. ఇది 2015-16లో 3.6శాతంగా మార్చాలి. వచ్చే మూడు నాలుగేళ్లలో వృద్ధి రేటు అంచనా 7 నుంచి 8 ళాతం. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడుల పరిమితి రక్షణ, బీమా రంగాల్లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు. వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంపు సీనియర్ సిటిజన్లకు పరిమితి రూ. 3లక్షలు.
 
 పంచాయతీలకు ఇంటర్నెట్ ప్రాజెక్ట్ సర్వే పూర్తి

 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్‌ఓఎఫ్‌ఎన్.) ప్రాజెక్ట్ కింద చేపట్టిన సర్వే పూర్తయింది. దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామపంచాయతీలకు 2017 నాటికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్, స్పెషల్ పర్సన్ వెహికల్ సంస్థలు ప్రాజెక్టును రూపొందించాయి. ఈ ప్రాజెక్టును చేపట్టేముందు రాజస్థాన్‌లోని ఆజ్మీర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, త్రిపురలలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తారు.
 
 దేశంలో అటవీ విస్తీర్ణం 21.23 శాతం
 2011 నుంచి అటవీ విస్తీర్ణం 5,871 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు 13వ భారత అటవీ నివేదిక 2013 తెలిపింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ జూలై 8న దీన్ని విడుదల చేశారు. దేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం 69.79 మిలియన్ హెక్టార్లుగా నివేదిక పేర్కొంది. ఇది దేశ విస్తీర్ణంలో 21.23 శాతం. వృక్షాల విస్తీర్ణం 91,266 చదరపు కిలోమీటర్లు. 1988 జాతీయ అటవీ విధానం భూభాగంలో అటవీ వృక్షాల విస్తీర్ణం 33 శాతంగా ఉండాలని లక్ష్యాన్ని నిర్ణయించింది. పశ్చిమబెంగాల్‌లో గరిష్టంగా అటవీ విస్తీర్ణం (3,816 చ.కి.మీ) పెరిగింది. తర్వాత స్థానాల్లో ఒడిశా (1,444 చ.కి.మీ), కేరళ (622 చ.కి.మీ) ఉన్నాయి. ముంపు, ఖనిజాల త వ్వకం, పోడు వ్యవసాయం కారణంగా నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అటవీవిస్తీర్ణం తగ్గిందని నివేదిక వెల్లడించింది.
 
 ఆర్థిక సర్వే 2013-14

 ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2013-14 ఆర్థిక సర్వేను జూలై 9న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ముఖ్యాం శాలు.. జీడీపీ వృద్ధిరేటు 2014-15లో 5.4-5.9 శాతంగా ఉండవచ్చు. ఇది 2015-16లో ఏడు నుంచి ఎనిమిది శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2014-15లో కరెంట్ ఖాతాలోటును జీడీపీలో 2.1 శాతానికి పరిమితం చేయాలి. 2014లో ద్రవ్యోల్బణం సాధారణంగా ఉంటుందని అంచనా.
 
 రైల్వే బడ్జెట్ 2014-15
 కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానంద గౌడ జూలై 8న 2014-15 రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ విలువ అత్యధికంగా రూ. 65,445 కోట్లు. ఇది 2013-14 కంటే 10 శాతం ఎక్కువ. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు ..కొత్తగా 58 రైళ్లు, 11 రైళ్లు ప్రయాణ దూరం పొడిగింపు, రూ.60 వేల కోట్లతో అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు, మెట్రో నగరాలను కలుపుతూ హైస్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ, కొత్తగా ఈ-టికెటింగ్ రిజర్వేషన్ వ్యవస్థ , ప్రధాన స్టేషన్లు, ఎంపిక చేసిన రైళ్లలో వైఫై సేవలు, రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతితోపాటు ప్రతి ఆరు నెలలకు రైలు ఛార్జీల సవరణ.
 
 పోలవరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
 పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014కు జూలై 11న లోక్‌సభ, జూలై 14న రాజ్యసభ ఆమోదించాయి. పోలవరంగా పిలిచే ఇందిరాసాగర్ ప్రాజెక్టును బహుళ ప్రయోజనార్థం గోదావరి నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద నిర్మిస్తున్నారు. 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించారు.
 
 బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష
 ఆధునీకరించిన బ్రహ్మోస్ క్షిపణిని రక్షణ,పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డీఓ) ఒడిశాలోని చాందీపూర్ వద్ద గల పరీక్షా కేంద్రం నుంచి జూలై8న విజయవంతంగా పరీక్షించింది. ఇది 500 సెకన్లలో 290 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. మోబైల్ లాంఛర్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఇది బ్రహ్మోస్ 44వ ప్రయోగం. ఈ క్షిపణికి పర్వతాలు, భవనాల మధ్య ఉండే రహస్య శత్రు స్థావరాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు.
 
 సాగర శోధనకు ‘సింధు సాధన‘

 దేశంలో తొలిసారిగా నిర్మించిన పరిశోధన నౌక సింధు సాధన ప్రారంభమైంది. ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయమంత్రి జితేందర్ సింగ్ దీన్ని జూలై 13న గోవాతీరంలో జాతికి అంకితం చేశారు.
 
 
 అంతర్జాతీయం
 వారసత్వ సంపదగా
 దిలీప్‌కుమార్ పూర్వీకుల ఇల్లు
 బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ పూర్వీకుల ఇంటిని పాకిస్థాన్ ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. పెషావర్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఖవానీ బజార్ ప్రాంతంలో ఉన్న దిలీప్‌కుమార్ పూర్వీకుల ఇల్లు ప్రస్తుతం పాతబడిపోయింది. దీన్ని ఆధునీకరించి ప్రదర్శనశాల ఏర్పాటు చేసే పనిలో పాక్ ప్రభుత్వం సిద్ధమైంది.
 
 బ్రిటన్ పార్లమెంట్ స్క్వైర్‌లో గాంధీ విగ్రహం
 బ్రిటన్ పార్లమెంట్ స్క్వైర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ప్రతిష్టిస్తామని బ్రిటన్ విదేశాంగమంత్రి విలియమ్‌హేగ్, ఛాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌ఛెక్కర్ జార్జి ఓస్‌బోర్న్ ప్రకటించారు. ఇప్పటివరకు నెల్సన్‌మండేలా, అబ్రహం లింకన్‌తోపాటు ప్రపంచనేతల విగ్రహాలు పార్లమెంట్ స్క్వైర్‌లో ఉన్నాయి. గాంధీ విగ్రహం 11వది.
 
 సముద్ర వివాదంలో బంగ్లాదేశ్‌కు అనుకూల తీర్పు
 భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న బంగాళాఖాతం సముద్ర సరిహద్దు వివాదంపై ఐక్యరాజ్యసమితి ట్రైబ్యునల్ జూలై7న బంగ్లాదేశ్‌కు అనుకూల తీర్పునిచ్చింది. బంగాళాఖాతంలోని 25,602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 19,467 చ.కి.మీ విస్తీర్ణం బంగ్లాదేశ్‌కు చెందుతుందని ఐక్యరాజ్యసమితి ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భారత్ భూ సరిహద్దు ఒప్పందాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాల్సి ఉంది. ఈ తీర్పునకు అన్ని పక్షాలు కట్టుబడి ఉండాలి. అప్పీలుకు వెళ్లే అవకాశం లేదు.
 
 నిఖిల్ శ్రీవాస్తవకు జార్జ్ పోల్యా ప్రైజ్
 భారతీయ యువ గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన జార్జ్ పోల్యా ప్రైజ్‌ను మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో గణితపరంగా కీలకమైన కడినన్- సింగర్ భావనను ఆడమ్ డబ్ల్యూ మార్కస్, డేనియల్ ఏ స్పిల్‌మాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి నిఖిల్ చేసిన పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది.
 
 
 క్రీడలు
 ప్రపంచకప్ విజేత జర్మనీ

 బ్రెజిల్‌లో మారకానాలో జూలై 13న జరిగిన ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనాను ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా ఉత్తర,దక్షిణ అమెరికా ఖండంలో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో విజేతగా నిలిచిన తొలి ఐరోపా దేశంగా జర్మనీ జట్టు చరిత్ర సృష్టించింది. జర్మనీకి ఇది నాలుగో ప్రపంచకప్. తదుపరి 2018 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు (21వ)కు రష్యా ఆతిథ్యమివ్వనుంది. ఈ సందర్భంగా ప్రకటించిన అవార్డుల వివరాలు.. గోల్డెన్‌బాల్ (అత్యుత్తమ ఆటగాడు): లియోనెల్ మెస్సి (అర్జెంటీనా), గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్): రోడ్రిగెజ్ (కొలంబియా), గోల్డెన్ గ్లోవ్ (అత్యుత్తమ గోల్‌కీపర్): మాన్యుల్ న్యూర్ (జర్మనీ),ఉత్తమ యువ ఆటగాడు: పాల్ ఫోగ్బా (ఫ్రాన్స్), ఫెయిర్ ప్లే అవార్డు (కొలంబియా జట్టు)
 
 నిఖిత్ జరీన్‌కు బాక్సింగ్‌లో స్వర్ణం

 తెలంగాణకు చెందిన నిఖిత్‌జరీన్ గోల్డెన్‌గ్లవ్ ఆఫ్ వోజ్‌వోదినా అంతర్జాతీయ బాక్సింగ్‌చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. సెర్బియాలోని వోజ్‌వోదినాలో జూలై 13న జరిగిన ఫైనల్‌లో 54 కిలోల విభాగంలో హంగేరికి చెందినపెరెన్జ్‌జూడిత్‌ను నిఖిత్ జరీన్ ఓడించింది.
 
 నైజీరియా ఫుట్‌బాల్ జట్టుపై నిషేధం
 నైజీరియా ఫుట్‌బాల్ జట్టును ఫిఫా నిషేధించింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫుట్‌బాల్ పోటీల్లో ఆ జట్టు పాల్గొనరాదని జూలై 9న ఆదేశాలు జారీచేసింది. నైజీరియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఫిఫా ఈ చర్యకు పాల్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement