
న్యూఢిల్లీ: చిప్స్, కూల్ డ్రింక్స్ తదితర జంక్ ఫుడ్స్ అమ్మకాలను, వాటి ప్రచారాన్ని పాఠశాల ప్రాంగణాల్లో, పరిసరాల్లో నిషేధించాలని ఆహార నియంత్రణ సంస్థ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రతిపాదించింది. స్కూళ్లలో, వాటికి 50 మీటర్ల పరిధిలో వాటిని అమ్మకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వాటి ప్రచారాన్ని కూడా ఆయా ప్రాంతాల్లో నిషేధించాలని సూచించింది. తద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించవచ్చంది.
ఈ ప్రతిపాదనలను ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్–2019’ ముసాయిదా లో పొందుపర్చారు. ‘ఉప్పు, కొవ్వు, చక్కెర శాతాలు ఎక్కువగా ఉన్న పదార్థాల ప్రచారం కూడా నిర్వహించకూడదు’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అతి తక్కువగా ఉండే సాచురేటెడ్ ఫ్యాట్, చక్కెర, ఉప్పు అత్యంత ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు, పానీయాలను జంక్ ఫుడ్‌గా పేర్కొంటారు. ఈ ఆహార పదార్థాలవల్ల ఊబకాయం, డయాబెటిస్, కేన్సర్లు, గుండె సమస్యలు వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment