వంజారా లేఖ చెప్పే నిజాలు! | Gujarat DIG Vanjara Letter war over Narendra Modi | Sakshi
Sakshi News home page

వంజారా లేఖ చెప్పే నిజాలు!

Published Thu, Sep 5 2013 12:10 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

Gujarat DIG Vanjara Letter war over Narendra Modi

ఎవరికీ జవాబుదారీకాని వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనది. ముఖ్యంగా యూనిఫాంలో ఉండేవారు ఆ బాణీలో విధులు నిర్వర్తిస్తే చుట్టూ ఉన్నవారికే కాదు... ఏదోరోజున వారికి సైతం అది యమపాశంగా మారుతుంది. వివిధ ఎన్‌కౌంటర్ కేసుల్లో నిందితుడిగా ముద్రపడి, ముంబై జైల్లో గత ఆరేళ్లకుపైగా ఉంటున్న గుజరాత్ డీఐజీ డీజీ వంజారా వర్తమాన అవస్థ అటువంటిదే. ‘గుజరాత్ సర్కారు తనను తాను కాపాడుకోవడం కోసం ఎంతో నమ్మకంగా వ్యవహరించిన పోలీసు అధికారులకు ద్రోహం చేసింద’ని ఆయన ఆక్రోశిస్తున్నాడు. ‘మీ అభీష్టానికి అనుగుణంగా, మీ విధానాలను అనుసరించి పనిచేస్తే... మీరు మమ్మల్ని కాపాడాల్సిన ధర్మాన్ని కాలరాశారు. అందువల్లే ప్రభుత్వంలో కూర్చున్న ద్రోహులను కాపాడవలసిన బాధ్యత నావైపు నుంచి కూడా లేదని భావిస్తున్నాను’ అంటూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి రాసిన పది పేజీల ఉత్తరంలో వంజారా కడిగిపారేశారు.
 
ఇప్పుడు మీరు గొప్పగా చెప్పుకుంటున్న గుజరాత్ అభివృద్ధి నమూనా సాకారం కావడానికి తమ త్యాగాలే కారణమని ఆయన మోడీకి గుర్తుచేశారు. ‘జైల్లో మగ్గుతున్న పోలీసు అధికారులకు రుణపడి ఉన్నానన్న సంగతిని ఢిల్లీవైపుగా యాత్ర సాగించే హడా వుడిలో మరిచిపోకండ’ని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వంజారా పేరు చెబితే గుజరాత్ గజగజ వణికిపోయేది. ఆయనగారి వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో, ఎవరు మరునాటికల్లా ఎన్‌కౌంటర్ ఘటనలో విగతజీవుైలై కనబడతారోనన్న దిగులు మైనారిటీ వర్గాలను ఆవహించేది.
 
 ఆ ఎన్‌కౌంటర్ల పరంపర ఆయనకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అన్న పేరు తెచ్చిపెట్టింది. 2002-07 మధ్య గుజరాత్‌లో సాగిన ఎన్‌కౌంటర్లలో ఎందరెందరో మరణించారు. నరేంద్రమోడీని అంతమొందించ డానికి కుట్ర పన్నారన్నదే వీరందరిపైనా సాధారణంగా ఉండే అభియోగం. ఆ సమయంలో జరిగిన 22 బూటకపు ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలంటూ పౌరసమాజ ప్రతినిధులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలుచేశాక గుట్టంతా బయటపడింది. ఈ కేసులన్నీ వివిధ కోర్టుల్లో ఇప్పుడు విచారణలో ఉన్నాయి. దాదాపు 32 మంది ఉన్నతాధికారులు ఈ కేసుల్లో నిందితులుగా జైలు జీవితం గడుపుతున్నారు.
 
 అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీని దోషిగా నిలబెడుతూ, సూటిగా ప్రశ్నిస్తూ లేఖ రాసేంత సాహసం వంజారాకు ఎక్కడిది? మోడీ సాధారణ ముఖ్యమంత్రి కూడా కాదు...మరికొన్ని నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగుతారని భావిస్తున్న వ్యక్తి. ఆ స్థాయి నాయకుడిని ఒక పోలీసు అధికారి బహిరంగంగా నిలదీశారంటే కారణం ఏమిటి? ముఖ్యమంత్రి కుర్చీలో ఉండే నాయకుడికి పోలీసు అధికారులు వ్యక్తిగతంగా పరిచయస్తులై ఉండటం, వారు చెప్పే పనుల్ని వీరు చేయడం వింతేమీ కాదు. అయితే, ఆ పరిచయం అధికారిక పరిమితులను దాటి వెళ్లిందని వంజారా లేఖ చూస్తే అర్ధమవుతుంది. ఐపీఎస్ అధికారిగా వంజారా బాధ్యతలు చాలా కీలకమైనవి. గుజరాత్ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం, చట్టబద్ధపాలన సక్రమంగా నడిచేలా చూడటం ఆయన బాధ్యతలు. వాటిని నెరవేర్చడంలో తనకున్న పరిమితులేమిటో వంజారాకు తెలియనివి కాదు. ఐపీఎస్ అధికారిగా, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా వాటిపై ఆయనకు అవగాహన ఉండితీరాలి.  కానీ, మోడీని తన దేవుడిగా భావించానని, ఆయనకోసమే అంతా చేశానని వంజారా ఇప్పుడంటున్నారు. ఇలా చేయడంపై ఆయనకేమీ పశ్చాత్తాపం లేదు. ఆయన ఫిర్యాదల్లా ఇంత నమ్మకంగా, ఇంత విశ్వాసంగా పనిచేసిన తమను జైలు గోడలమధ్య అనాథగా మిగిల్చారన్నదే. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం రూపొందించిన విధానాన్ని మాత్రమే తాము అనుసరించామని ఆయన చెబుతున్నారు. తమను అరెస్టుచేసి విధానకర్తలను వెలుపల ఉంచడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
 
  నిజానికి వంజారా అసలు ఆగ్రహం మోడీపై కాదు...ఆయనకు అప్పుడూ, ఇప్పుడూ నమ్మకస్తుడైన లెఫ్టినెంట్‌గా ఉన్న అమిత్ షాపై. షా గతంలో గుజరాత్ హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. మోడీ చెప్పినట్టల్లా షా చేయించేవారా, మోడీ చెప్పారని చెప్పి చేయించేవారా అన్నది ఎవరికీ తెలియదుగానీ...ఇప్పుడు వంజారా చెబుతున్న ‘విధానానికి’ కర్త, కర్మ, క్రియ మాత్రం ఆయనే. వంజారా అరెస్టయిన కేసుల్లో అమిత్‌షా కూడా నిందితుడే. మూడేళ్లక్రితం మంత్రి పదవిలో ఉండగా షా అరెస్టయి అటు తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. బీజేపీలో మోడీ శకం ప్రారంభమయ్యాక ఆయనకు జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవి కూడా దక్కింది. ఇప్పుడు వంజారా దుగ్ధంతా ఆయనపైనే. షా చర్యలవల్లే తామంతా జైల్లో మగ్గవలసి వస్తున్నదన్నది ఆయన ఆరోపణ. ట్రిగర్ నొక్కమని చెప్పడానికీ... నొక్కడానికీ మధ్య ఉన్న తేడాను వంజారా గమనించినట్టు లేరు. ఎన్‌కౌంటర్ల ఆదేశం అమిత్‌షాదే కావొచ్చు...కానీ అందుకు సాక్ష్యం? ఆయన అలాంటి ఆదేశాలిచ్చినట్టు నిరూపణ అయితే తప్ప దోషిగా రుజువయ్యే అవకాశం లేదు. చర్యకు పాల్పడినవారిదే ప్రధాన బాధ్యత అవుతుంది. ఆ సంగతిని వంజారాయే కాదు... ఆ మార్గంలో నడిచిన, నడుస్తున్నవారంతా గుర్తు పెట్టుకోవాలి. ఇంతకూ వంజారా పలుకులు ఆయనవేనా, బీజేపీ ఆరోపిస్తున్నట్టు వేరొకరెవరైనా పలికిస్తున్నారా అన్నది అంత ప్రాముఖ్యంగల అంశం కాదు. పదవుల్లో ఉన్నాం కదా అని...ప్రశ్నించేవారెవరూ లేరుకదా అని చట్టాలనూ, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే అలాంటివారిని ఆపత్కాలంలో అవి కాపాడలేవన్నదే ఇందులో ప్రధానాంశం. విషాదమేమంటే... వంజారాకు ఆ రకమైన స్పృహ ఇప్పటికీ కలగలేదని ఆయన రాసిన లేఖ స్పష్టంచేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement