
ఫైనాన్షియల్ టెక్నాలజీ.. సంక్షిప్తంగా ఫిన్‌టెక్! ఇది ఇటీవల కాలంలో ఎంతో సుపరిచితంగా మారింది. నేటి డిజిటల్ యుగంలో ఫిన్‌టెక్ సంస్థల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. లోన్స్ మొదలు మ్యూచువల్ ఫండ్స్ వరకు.. డిజిటల్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించుకునేలా.. వినియోగదారులకు సేవలం దిస్తున్నాయి ఫిన్‌టెక్ సంస్థలు!దాంతో ఫిన్‌టెక్ రంగం ఇప్పుడు యువతకు సరికొత్త కెరీర్‌గా వేదికగా నిలుస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ నుంచి టెక్నికల్,ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థుల వరకు.. వారి అర్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది ఫిన్‌టెక్ రంగం!ఈ నేపథ్యంలో.... ఫిన్‌టెక్ ఉద్యోగాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం...
డిజిటల్ యుగం.. ఏ రంగంలో చూసినా.. టెక్నాలజీ ఆధారిత సేవలు. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్‌తో.. వ్యక్తులు తమకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కాలు కదపకుండా చక్కబెట్టుకునే అవకాశం లభిస్తోంది. రుణాలు తీసుకోవడం మొదలు.. బీమా చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఇలా అన్నిరకాల సేవలు స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో జరిగిపోతున్నాయి. ఇదంతా సాధ్యమయ్యేలా చేస్తున్నాయి ఫిన్‌టెక్ సంస్థలు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తరహా సేవలు అందించడంలో ముందుంటున్నాయి.
యాప్స్ ఆధారంగా.. ఒకే విండో
ఫిన్‌టెక్ సంస్థలు అందించే సేవలు అధికంగా మొబైల్ యాప్స్ రూపంలో∙ఉంటున్నాయి. ఉదాహరణకు ఇన్సూరెన్స్ పేమెంట్స్, అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన పలు రకాల సేవలను ఫిన్‌టెక్ సంస్థలు యాప్స్ ఆధారంగా వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన మొబైల్ వ్యాలెట్‌లు, ఆన్‌లైన్ పీర్ టు పీర్ లెండింగ్ వంటివి ఫిన్‌టెక్ సేవల పరిధిలోకే వస్తాయి.
మిలియన్ డాలర్ల రంగం
దేశంలో ఐదారేళ్ల క్రితమే ఫిన్‌టెక్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రంగం ఏటేటా శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఫిన్‌టెక్ రంగం ఈ ఏడాది 1520 మిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2023 నాటికి ఈ విలువ 2,580 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రధానంగా డిజిటల్ పేమెంట్స్, ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్, పర్సనల్ ఫైనాన్స్, ఆల్టర్నేటివ్ లెండింగ్‌ల విభాగాల్లో ఫిన్‌టెక్ సంస్థల సేవలు విస్తరిస్తున్నాయి.
వినియోగదారులు
ఫిన్‌టెక్ సేవల వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. గతేడాది డిజిటల్ పేమెంట్స్ విభాగంలో∙513.84 మిలియన్ల మంది ఫిన్‌టెక్ సంస్థల ద్వారా సేవలు పొందారు. వీరిసంఖ్య 2023 నాటికి 625.53 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఫిన్‌టెక్ సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలోపెట్టుకొని కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు రెండున్నర వేలకు పైగా సంస్థలు ఫిన్‌టెక్ విభాగంలో సేవలందిస్తున్నాయి. ఆయా సంస్థలకు నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది.
రెండు లక్షల ఉద్యోగాలు
రానున్న రెండేళ్లలో ఫిన్‌టెక్ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ రంగంలో లభించే ఉద్యోగాల వివరాలు... » కస్టమర్ ఎక్విజిషన్ » ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ » బిగ్‌డేటా అనలిటిక్స్ » అప్లికేషన్ డెవలప్‌మెంట్ » ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ » సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ » హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ » యూఐ/యూఎక్స్ డిజైనర్ » ప్రొడక్ట్ మేనేజర్ » ప్రొడక్ట్ ఇంజనీర్ » సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ » సోషల్ మీడియా మేనేజర్స్
ఫిన్‌టెక్ సేవలు
ఫిన్‌టెక్ సంస్థలు ప్రధానంగా ఆరు విభాగాల్లో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. అవి.. –డిజిటల్ లెండింగ్, –పేమెంట్ సర్వీసెస్, –సేవింగ్స్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్, –రెమిటెన్సెస్, –పాయింట్ ఆఫ్ సేల్, –ఇన్సూరెన్స్. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ సర్వీసెస్‌కు విపరీతమైన ప్రాధాన్యం కనిపిస్తోంది. గత ఏడాది ఫిన్‌టెక్ రంగంలో 20శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని.. కేవలం నగరాలు, పట్టణాలే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆల్టర్నేటివ్ లెండింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్సూర్ టెక్ పేరుతో ఫిన్‌టెక్ సంస్థలు తమ సేవలను ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు డెలాయిట్ సర్వేలో తేలింది.
ఉద్యోగ విభాగాలు
నాస్‌కామ్, మ్యాన్‌పవర్ గ్రూప్, డెలాయిట్ వంటి సంస్థలు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం– ఫిన్‌టెక్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్న ముఖ్యమైన విభాగాలు.. » సాఫ్ట్‌వేర్ –51 శాతం, » సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ 16 శాతం » కోర్ ఫైనాన్స్–11శాతం » ప్లానింగ్ అండ్ కన్సల్టింగ్–4 శాతం » టాప్ మేనేజ్‌మెంట్ –4 శాతం. ఇటీవల కాలంలో ఫిన్‌టెక్ స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ప్రకటించిన 2020–21 బడ్జెట్‌లో సైతం ఫిన్‌టెక్ సంస్థలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉంది.
స్టార్టప్స్
ఫిన్‌టెక్ సంస్థల్లో సగటున 150 నుంచి 200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫిన్‌టెక్ స్టార్టప్‌ల్లో ఒక్కో సంస్థలో కనీసం పది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఫిన్‌టెక్ రంగంలో పరోక్ష ఉపాధి అవకాశాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి సంస్థలో కోర్ విభాగంలో ఒక కొలువుకు కొనసాగింపుగా అయిదు ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంటే.. ఒక ప్రొడక్ట్ డిజైన్ స్థాయిలో ఒక నిపుణుడు ఉంటే.. ఆ తర్వాత దాన్ని వినియోగదారులకు చేర్చే వరకు ఐదు మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది.
ప్రోత్సాహకాలు
ఫిన్‌టెక్ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా దోహదం చేస్తున్నాయి. పేమెంట్ బ్యాంక్స్‌కు అనుమతి ఇవ్వడం.. పేటీఎం, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు పేమెంట్ బ్యాంక్స్‌ను ఏర్పాటు చేసి.. డిజిటల్ సేవలు అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ మొబైల్ ఆధారిత బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం కూడా ఫిన్‌టెక్ రంగంలో ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తోంది.
అర్హతలు
ఇంజనీరింగ్, టెక్నికల్ డిగ్రీలతోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కోర్సులు పూర్తిచేసుకుంటే.. ఫిన్‌టెక్ రంగంలో కొలువులు దక్కించుకోవచ్చు. అదే విధంగా డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, రోబోటిక్స్ వంటి అంశాలను అకడమిక్ స్థాయిలోనే అభ్యసిస్తే మెరుగైన అవకాశాలు లభిస్తాయి. మరోవైపు సంప్రదాయ డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులు కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
నైపుణ్యాలు
ఫిన్‌టెక్ సంస్థల్లో కొలువులు ఖాయం చేసుకోవాలంటే.. ప్రస్తుతం అవసరమవుతున్న ప్రధాన నైపుణ్యాలు.. » ఐఓఎస్ డెవలప్‌మెంట్ » ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ » సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్(ఎస్‌ఆర్‌ఈ) » ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్ » అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఏపీఐ) » బ్లాక్‌చైన్ టెక్నాలజీ. వీటిని పెంపొందిం చుకోవడానికి అభ్యర్థులు అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
వేతనాలు ఆకర్షణీయం
ఫిన్‌టెక్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కోర్ టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో.. ఏఐ ఇంజనీర్స్, డిజైనర్స్‌కు రూ.50వేల వరకు వేతనం లభిస్తోంది. ఇక యాప్ డెవలపర్స్, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం విభాగాల్లో రూ.30వేల వరకు వేతనం ఖాయం. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో పనిచేసే వారికి రూ.20 వేల నెల వేతనం అందుతోంది.
ఉద్యోగాన్వేషణ
ప్రస్తుతం ఫిన్‌టెక్ సంస్థల్లో నియామకాలు కొనసాగుతున్నాయి. కానీ.. వీటి గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండట్లేదు. ఫిన్‌టెక్ కంపెనీల్లో ఉద్యోగాన్వేషణకు అనువైన సాధనం.. జాబ్ పోర్టల్స్. జాబ్ పోర్టల్స్‌లో తమకు ఆసక్తి ఉన్న విభాగంలోని ఫిన్‌టెక్ సంస్థల్లో ఉద్యోగాల గురించి తెలుసుకోవచ్చు.
ఫిన్‌టెక్.. ముఖ్యాంశాలు
♦ రెండేళ్లలో దాదాపు రెండు లక్షల కొత్త ఉద్యోగాలు.
♦ ఏఐ, ఎంఎల్ నిపుణులు, యాప్ డెవలపర్స్‌కు డిమాండ్.
♦ అంతేస్థాయిలో ఎస్‌ఈఎం, ఎస్‌ఈఓలకు అవకాశాలు.
♦ నెలకు రూ. 20 వేల నుంచి రూ. 70 వేల వరకు వేతనం.
♦ ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు రెండున్నర వేల ఫిన్‌టెక్ సంస్థలు.
Comments
Please login to add a commentAdd a comment