ఎంసెట్ - 2016 లాస్ట్ మినిట్ టిప్స్ | last minute tips for EAMCET 2016 students | Sakshi
Sakshi News home page

ఎంసెట్ - 2016 లాస్ట్ మినిట్ టిప్స్

Published Thu, Apr 28 2016 10:26 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఎంసెట్ - 2016 లాస్ట్ మినిట్ టిప్స్ - Sakshi

ఎంసెట్ - 2016 లాస్ట్ మినిట్ టిప్స్

ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే  ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) ఏపీలో ఏప్రిల్ 29న, తెలంగాణలో మే 2న జరగనుంది. ఏపీలో జవహర్‌లాల్ నెహ్రూ  టెక్నలాజికల్ యూనివర్సిటీ - కాకినాడ, తెలంగాణలో జవహర్‌లాల్ నెహ్రూ  టెక్నలాజికల్ యూనివర్సిటీ - హైదరాబాద్ ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. విద్యార్థులకు చివరి నిమిషం టిప్స్..
 
 ఒత్తిడికి లోనవొద్దు..
 ఎంసెట్ ద్వారా నచ్చిన కెరీర్‌ను ఎంచుకోవాలని కలలు కంటూ అభ్యర్థులు ఇందులో మంచి ర్యాంక్ సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రిపరేషన్ సాగించి ఉంటారు. పరీక్షకు ఇక అతి తక్కువ సమయమే ఉంది. ఈ సందర్భంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకూడదు. ఎలాంటి ఆందోళనకు, భావోద్వేగాలకు లోనుకాకూడదు. అతిగా ఆలోచించి లేని ఒత్తిడిని తలకెత్తుకోవద్దు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. పరీక్ష సమయంలో అనారోగ్యం పాలయితే మొదటికే మోసం వస్తుంది.
 
 పరీక్ష ముందురోజు..
  నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అందువల్ల మీకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లాలో ఒక రోజు ముందుగానే తెలుసుకోండి. అవసరమైతే ముందురోజే పరీక్ష కేంద్రం వద్దకు మీ పెద్దలతో కలిసి వెళ్లివస్తే మంచిది. దీనివల్ల పరీక్ష కేంద్రానికి ఎంత సమయంలో, ఏ మార్గంలో చేరుకోవచ్చో అవగాహన వస్తుంది. పరీక్ష రోజు నేరుగా, వేగంగా కేంద్రానికి చేరుకునేందుకు వీలవుతుంది. లేకుంటే పరీక్ష రోజు కేటాయించిన కేంద్రం గురించి తెలుసుకోవడం ఆలస్యం అయితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. పరీక్ష ముందురోజు రాత్రి బాగా నిద్రపోండి. తేలికపాటి ఆహారం భుజించండి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వేడి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోండి.
 
 చివరి నిమిషంలో బుక్స్ వొద్దు..
 పరీక్ష కేంద్రం వద్ద చివరి నిమిషంలో కూడా పుస్తకాలతో కుస్తీ పట్టడం వొద్దు. ఒకవేళ తెలియని అంశాలు ఏవైనా కనిపిస్తే మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అది పరీక్షపై ప్రభావం చూపిస్తుంది.
 
 ఎలాంటి భావోద్వేగాలకు లోను కావద్దు
 పరీక్ష పూర్తయిన తర్వాత  మీ మిత్రులతో, ఇతరులతో పరీక్ష గురించి ఎలాంటి చర్చలు చేయొద్దు. మీ ఫ్రెండ్స్ ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని, మీరు తక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని.. ఇలా వారితో పోల్చుకుని కుంగిపోవద్దు. ‘నేను బాగానే పరీక్ష రాశాను. నేను ఆశించిన ర్యాంకు దక్కించుకుంటాను’ అనే ఆత్మవిశ్వాసంతో ఉండండి. వేరే వాళ్లతో పోల్చుకుని ఎలాంటి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. అన్ని పరీక్షల్లానే ఎంసెట్ కూడా ఒకటి. ర్యాంకు రానంతమాత్రాన ఏమీ కాదు. ప్లాన్ చేసుకుంటే మంచి భవిష్యత్తునిచ్చే కెరీర్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రయత్నలోపం లేకుండా కష్టపడ్డానని అనుకోండి.
 
 నేరుగా ఇంటికి చేరుకోండి
 పరీక్ష పూర్తయిన వెంటనే.. బుక్స్ తీసి మీరు గుర్తించిన సమాధానాలు సరిగా ఉన్నాయా, లేదా? అని చూడకండి. మీరు తప్పుగా గుర్తించినవి కనిపిస్తే ఒత్తిడి పెరిగి తీవ్ర ఆందోళనకు లోనవుతారు. కాబట్టి పరీక్ష అయిపోగానే ఇంటికి చేరుకోండి. మీ తల్లిదండ్రులతో; సోదర, సోదరీమణులతో ఉల్లాసంగా గడపండి. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఆటలు, సంగీతం, సినిమాలతో రోజంతా సంతోషంగా ఉండండి.
 
 లాస్ట్ మినిట్ టిప్స్
 పరీక్ష రోజు..
 అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు పూర్తిచేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫాంను కూడా తమతోపాటు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఫాంపై గెజిటెడ్ అధికారి లేదా విద్యార్థి ఇంటర్ చదివిన కళాశాల ప్రిన్సిపల్ అటెస్టేషన్ చేయించాలి. అలాగే పరీక్షహాల్లో ఇన్విజిలేటర్ సమక్షంలో ఫాంలో పేర్కొన్న నిర్ణీత స్థలంలో అభ్యర్థి సంతకం చేసి ఎడమ చేతి బొటన వేలిముద్ర వేయాలి.
 
 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉన్న కుల ధ్రువీకరణ పత్రాన్ని పరీక్ష కేంద్రానికి తేవాల్సి ఉంటుంది.
 
 విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిది.
 
 క్యాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు తదితరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
 
 ఓఎంఆర్ షీట్‌ను మడతపెట్టడం, చించడం వంటివి చేయకూడదు. సమాధానాన్ని దిద్దడం మినహా దానిపై ఇతర కొట్టివేతలు, మరకలు ఉండకూడదు. అభ్యర్థులకు ఎట్టిపరిస్థితుల్లో మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వరు. అందువల్ల ఓంఎఆర్ షీట్ విషయంలో జాగరూకతతో వ్యవహరించాలి.
 
 -2016 ఏపీ, టీఎస్ ఎంసెట్‌లో అభ్యర్థి పేరు, హాల్‌టికెట్ నంబర్, ఫొటోను ఓఎంఆర్ షీట్‌పై ముద్రించి ఇవ్వనున్నారు. అభ్యర్థులు తాము సరైన ఓఎంఆర్ షీట్ తీసుకున్నారా, లేదా అని ముందుగానే చూసుకోవాలి.  
 -ఒకసారి పరీక్ష ప్రారంభమయ్యాక అభ్యర్థులను ఎట్టిపరిస్థితుల్లో పరీక్ష హాల్లోకి అనుమతించరు. కనీసం అరగంట ముందుగానే మీకు కేటాయించిన ఎగ్జాం హాల్లో ఉండేలా చూసుకోండి.
 
 -అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌ను ఉపయోగించొచ్చు. అదనంగా రెండు పెన్నులు, పెన్సిళ్లు ఉంచుకోవడం మంచిది.
 
 -పరీక్ష పూర్తయ్యేంత వరకు అభ్యర్థులను బయటకు పంపించరు. చివరి నిమిషం వరకు వారు పరీక్ష హాల్లో, తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చోవాలి.
 
 -ముందు బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. తర్వాత కొంచెం కష్టతరమైన ప్రశ్నలపై కసరత్తు చేయాలి.
 
 సమాధానాన్ని గుర్తించే ముందు మరోసారి ప్రశ్నను పరిశీలనగా చూస్తే మంచిది. ఒక్కోసారి ప్రశ్నను సరిగా చూడకుండా, వేరే విధంగా భావించి తప్పు సమాధానం గుర్తించే ప్రమాదం లేకపోలేదు.
 
 ఒత్తిడికి దూరంగా ఉండాలి
 ఎంసెట్‌కు హాజరవుతున్న విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 8:30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే మంచిది. విద్యార్థులను 8:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నాం. ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు పరిశీలనకు కేటాయించాలి. ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనసులోకి రానీయకూడదు. క్లిష్టంగా ఉన్న ప్రశ్నలు అందరికీ కష్టంగానే ఉంటాయనే దృక్పథం ఉంటే నిరుత్సా హానికి గురి కాకుండా పరీక్ష రాయగలరు. నెగెటివ్ మార్కులు లేవు కాబట్టి చివరి పది నిమిషాల సమయంలో తాము అటెంప్ట్ చేయని ప్రశ్నలకు గెస్సింగ్ విధానంలో సమాధానాలు గుర్తించాలి.  
 - ప్రొఫెసర్ సి.హెచ్. సాయిబాబు, కన్వీనర్, ఏపీ ఎంసెట్
 
 క్విక్ రివిజన్‌కే కేటాయించాలి
 టీఎస్ ఎంసెట్‌కు అందుబాటులో ఉన్న నాలుగు రోజుల సమయాన్ని విద్యార్థులు క్విక్ రివిజన్‌కు కేటాయించాలి.   పరీక్ష ముందు రోజు నాటికే రివిజన్, క్విక్ రివిజన్‌లు పూర్తి చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఈసారి కళాశాలలు - సీట్ల సంఖ్య పరంగా కౌన్సెలింగ్ సమయంలో పోటీ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలో వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించేలా కృషి చేయాలి. సమాధానాలను బబుల్ చేసే విషయంలో ఒకట్రెండుసార్లు సరిచూసు కోవాలి. బబుల్ చేసే ప్రశ్న సంఖ్య, తాము గుర్తించిన సమాధానం ఒకటేనా? కాదా? చూసుకోవాలి.
 - ప్రొఫెసర్. ఎన్.వి. రమణరావు
 టీఎస్ ఎంసెట్ కన్వీనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement