మయన్మార్ ఎన్నికల్లో సూచీ విజయం | Myanmar election: Suu Kyi's NLD wins majority | Sakshi
Sakshi News home page

మయన్మార్ ఎన్నికల్లో సూచీ విజయం

Published Wed, Nov 18 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

మయన్మార్ ఎన్నికల్లో సూచీ విజయం

మయన్మార్ ఎన్నికల్లో సూచీ విజయం

అంతర్జాతీయం
 పారిస్ ఉగ్రదాడిలో 128 మంది మృతి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నవంబర్ 14న ఉగ్రవాదులు జరిపిన దాడులలో 128 మంది పౌరులు మరణించగా, మరో 300 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు పారిస్‌లోని ఏడుచోట్ల విచక్షణారహిత దాడులకు పాల్పడ్డారు. పారిస్ అంతర్జాతీయ స్టేడియం, బతాక్లాన్ థియేటర్‌తో పాటు కెఫేలపై బాంబులు, తుపాకులతో దాడిచేసి పౌరులను హతమార్చారు. ఉగ్రవాదుల్లో కొందరిని భద్రతా దళాలు కాల్చి చంపగా, మరికొందరు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సిరియాలో దాడులకు ప్రతీకారంగానే పారిస్ దాడులకు పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ప్రకటించింది. ఈ దాడిని ఫ్రాన్స్ అధ్యక్షుడు తమ దేశంపై జరిగిన యుద్ధంగా అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం పారిస్ దాడులను తీవ్రంగా ఖండించింది.
 
 ఆంటిల్యాలో జీ-20 సదస్సు
 రెండు రోజుల జీ-20 సదస్సు ఆంటిల్యా (టర్కీ)లో నవంబర్ 15న ప్రారంభమైంది. సదస్సులో దేశాధినేతలు ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చించారు. పారిస్ ఐఎస్‌ఐఎస్ దాడుల నేఫథ్యంలో సదస్సులో ఉగ్రవాద సమస్య ప్రధానాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోదీలు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, సుస్థిర వృద్ధి, ఇంధనం, వాతావరణ మార్పు, శరణార్థుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వీటితో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో కోటా సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఓటుహక్కు కల్పించడం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకొచ్చాయి.
 
 బ్రిటన్‌తో పౌరఅణు సహకార ఒప్పందం
 భారత ప్రధాని నరేంద్రమోదీ బ్రిటన్ పర్యటనలో భాగంగా నవంబర్ 12న ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి కామెరూన్ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఇరు దేశాలు పౌర అణుసహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా కలిసి అణిచి వేయాలని పిలుపునిచ్చారు. బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. బ్రిటీష్, భారత కంపెనీల మధ్య రూ.90,500 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, సైబర్ సెక్యూరిటీలలో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడంతో పాటు వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
 
 మయన్మార్ ఎన్నికల్లో సూచీ విజయం
 మయన్మార్‌లో తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూచీ ఘన విజయం సాధించారు. నవంబర్ 8న పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) 80 శాతం స్థానాలను కైవసం చేసుకొంది. మొత్తం 664 స్థానాలకు గాను 440 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన స్థానాలను సైన్యం తనకు కేటాయించుకొంది. భర్త, పిల్లలు విదేశాల్లో పుట్టడంతో సూచీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలిగా ఆ దేశ నిబంధనలు ఉన్నాయి.
 రాష్ట్రీయం
 
 వ్యవసాయ విశ్వవిద్యాలయానికి
 శంకుస్థాపన గుంటూరు సమీపంలోని లాం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్ సింగ్ నవంబర్ 16న శంకుస్థాపన చేశారు. 500 ఎకరాల్లో నిర్మించే ఈ విశ్వవిద్యాలయం కోసం రానున్న ఐదేళ్లలో రూ.1505 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
 అనురాగ్‌శర్మకు పూర్తిస్థాయి
 డీజీపీ బాధ్యతలు సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్‌శర్మను తెలంగాణ రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నవంబర్ 13న నిర్ణయం తీసుకొంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అనురాగ్‌శర్మ ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్నారు.
 
 క్రీడలు
 రోస్‌బర్గ్‌కు బ్రెజిల్ గ్రాండ్ ప్రి టైటిల్ బ్రెజిల్ ఫార్ములావన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ గెలుచుకొన్నాడు. నవంబర్ 16న జరిగిన రేసులో రోస్‌బర్గ్ మొదటి స్థానం దక్కించుకోగా, మరో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.
 
 ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్
 చాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు చెందిన శ్రీసాయి సిరిల్‌వర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజిత పతకం సాధించాడు. దీంతో బాలుర సింగిల్స్‌లో రజిత పతకం సాధించిన వ్యక్తిగా సిరిల్‌వర్మ రికార్డుకెక్కాడు.
 
 చైనా ఓపెన్ విజేతగా లీ జురుయ్
 చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను లీ జురుయ్ (చైనా) గెలుచుకొంది. నవంబర్ 15న జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్‌ను జురుయ్ ఓడించింది. దీంతో సైనా రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 
 వార్న్ వారియర్స్‌కు ఆల్‌స్టార్స్ సిరీస్
 క్రికెట్ టీ-ట్వంటీ ఆల్‌స్టార్స్ సిరీస్‌ను వార్న్ వారియర్స్ గెలుచుకొంది. వార్న్ వారియర్స్ టీం నవంబర్ 15న లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన మూడో టీ-ట్వంటీ మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్ టీంను ఓడించి 3-0 తో సిరీస్‌ను సొంతం చేసుకొంది.
 
 జాతీయం
 అమల్లోకి స్వచ్ఛ భారత్ సుంకం  స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సేవా సుంకాన్ని విధించింది. ఇది నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో అర్హమైన అన్ని రకాల సేవలపై 0.5 సుంకాన్ని విధిస్తారు. ఇప్పటికే విధిస్తున్న 14 శాతం సేవాపన్నుకు అదనంగా ఈ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అదనంగా నాలుగు వేల కోట్ల రూపాయలు సమకూరే అవకాశం ఉంది.
 
 15 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలు సడలింపు
 15 కీలక రంగాలకు సంబంధించి...విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ మేరకు కేంద్రం నవంబర్ 10న నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు ఎఫ్‌డీఐలకు అనుమతి ప్రక్రియను సరళతరం చేసింది. డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్, తోటపంటల సాగులో 100 శాతం, న్యూస్, కరెంట్ అఫైర్స్, టీవీ చానెళ్లు, రక్షణ రంగంలో 49 శాతం, నిర్మాణ రంగంలో పూర్తై ప్రాజెక్టుల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు  ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రాంతీయ ఎయిర్ సర్వీసుల్లో 49 శాతం మేర ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్‌గా అనుమతి మంజూరు చేయనున్నారు. రూ.5000 కోట్ల పరిధి వరకు ఎఫ్‌డీఐలకు అనుమతి మంజూరు చేసే అధికారాన్ని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డుకు కల్పించారు. గతంలో బోర్డుకు రూ.3,000 కోట్లు వరకే నిర్ణయాధికారం ఉండేది.
 
 అత్యుత్తమ 100 యూనివర్సిటీల్లో
 బెంగళూరు ఐఐఎస్‌సీ ప్రపంచంలోని 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) స్థానం దక్కించుకొంది. ఈ జాబితాలో ఐఐఎస్‌సీ తొలిసారిగా 99వ స్థానంలో నిలిచింది. లండన్‌కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నవంబర్ 12న ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అత్యుత్తమ సంస్థల జాబితాను విడుదల చేసింది. ఇందులో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్, కాల్‌టెక్, మసాచుసెట్స్ యూనివర్సిటీలు(మిట్) వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.
 
 సైన్‌‌స అండ్ టెక్నాలజీ
 జీశాట్-15 ప్రయోగం విజయవంతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీశాట్-15 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నవంబర్ 11న ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అరైన్-5 వీకే 227 ఉపగ్రహ వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జీశాట్-15తో పాటు అరబ్‌శాట్‌ను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టారు. జీశాట్-15లో 24 కేయూ బ్యాంక్ ట్రాన్స్‌పాండర్స్, రెండు గగన్ పేలోడ్స్ ఉన్నాయి. 3,164 కిలోల జీశాట్-15 ప్రస్తుతం సేవలందిస్తున్న ఇన్‌శాట్-3డీ, 4-బీల స్థానంలో సేవలందిస్తుంది. డీటీహెచ్ బ్రాడ్ బ్యాండ్, టీవీ ప్రసారాలకు సంబంధించిన సేవలతో పాటు గగన్ పేలోడ్స్ ద్వారా జీపీఎస్ సేవలకు జీశాట్-15 తోడ్పడుతుంది. రూ.660 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.
 
 నిఘా విమానం పీ-8ఐ జాతికి అంకితం
 నిఘా విమానం పీ-8ఐ విమానాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 13న జాతికి అంకితం చేశారు. ఈ దీర్ఘశ్రేణి సముద్ర గస్తీ విమానం ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా విమానాల్లో ఒకటిగా పేరొందింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల పీ-8ఐ చే రికతో భారత వైమానిక దళబలం మరింత పెరిగింది.
 
 ఆర్థికం
 ఫార్చ్యూన్ టాప్-50లో సత్యనాదెళ్ల, అజయ్‌బంగా  బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ రూపొందించిన ప్రపంచ టాప్ 50 బిజినెస్ లీడర్ల జాబితాలో భారత సంతతికి చెందిన అజయ్‌బంగా, ఫ్రాన్సిస్ డిసౌజా, సత్యనాదెళ్లలకు చోటు దక్కింది. ఈ జాబితాలో మాస్టర్డ్ కార్డ్‌అజయ్‌బంగా ఐదవ స్థానం, కాగ్నిజంట్ ఫ్రాన్సిస్ డిసౌజా 16వ స్థానం, మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల 47వ స్థానాలలో నిలిచారు. ఈ జాబితాలో నైక్ కంపెనీకి చెందిన మైక్ పార్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఫేస్‌బుక్ మార్క్‌జుకర్ బర్‌‌గ నిలిచారు.
 
 సరైన దిశలో భారత్ సంస్కరణలు
 భారత్‌లో ఆర్థిక సంస్కరణలు సరైన దిశలో పయనిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఐఎంఎఫ్ తెలిపింది. భారత వృద్ధిరేటును 2015లో 7.3 శాతంగా, 2016లో 7.5 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement