కుర్రకారు.. కొత్త కొలువులను సృష్టిస్తారు! | New jobs created by youth | Sakshi
Sakshi News home page

కుర్రకారు.. కొత్త కొలువులను సృష్టిస్తారు!

Published Thu, Oct 3 2013 12:59 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

కుర్రకారు.. కొత్త కొలువులను సృష్టిస్తారు! - Sakshi

కుర్రకారు.. కొత్త కొలువులను సృష్టిస్తారు!

అఖిలేశ్, సందీప్‌లు స్నేహితులు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎంబీఏలో చేరారు. అది పూర్తయిన కొద్ది రోజులకు ఇద్దరికీ మంచి కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో ఇద్దరూ తమ కెరీర్‌పై అభిప్రాయాలను ఇలా పంచుకుంటున్నారు..
అఖిలేశ్: జాబ్ ఆఫర్ బాగుంది. మరో ఆలోచన చేయకుండా వెంటనే జాబ్‌లో చేరిపోతా. ఉద్యోగం చేస్తూనే ఉన్నత ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తా. అంతేగానీ కొత్త కంపెనీ పెట్టి చేతులు కాల్చుకోలేను.
సందీప్: ఉద్యోగానికి పరిమితం కావడం
నాకిష్టం లేదు. ఎంబీఏ చేస్తున్నప్పుడు నాకొచ్చిన బిజినెస్ ఐడియాపై కొంత వర్క్ చేసి తర్వాత సొంతంగా కంపెనీ పెడదామనుకుంటున్నా. ఆ ఐడియాపై నాకు గట్టి నమ్మకముంది.
 
 అఖిలేశ్, సందీప్.. ఇద్దరి ఆలోచనల్లోనూ స్పష్టత ఉంది. అయితే అఖిలేశ్ ఉద్యోగానికే పరిమితం కావాలని భావిస్తుండగా, సందీప్ మరో అడుగు ముందుకేసి 9 టు 5 జాబ్‌కు పరిమితం కాకుండా తనకంటూ ఓ సొంత కలల ప్రపంచాన్ని నిర్మించుకుని, మరో పది మందికి ఉపాధి చూపుతూ పైకి ఎదగాలన్న పరిణితితో కూడిన ఆలోచన చేశాడు.
 
 ఆలోచనలే ఆసరాగా:
 మీరు ఎలా ఆలోచిస్తే అదే విధంగా తయారవుతారు..
 బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు..
 శక్తిమంతులమనుకుంటే అలానే అవుతారన్న వివేకానందుని మాటలను నేటి యువతరం ఒంటబట్టించుకుంటోంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంసీఏ, ఎంబీఏ.. చేసే కోర్సు ఏదైనా.. విద్యార్థుల చివరి లక్ష్యం మెచ్చిన కంపెనీలో నచ్చిన వేతనంతో కొలువును పొందడమనే ఆలోచన నుంచి మనమే పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎందుకు చేరకూడదు అని ఆలోచించే వారి సంఖ్య అధికమవుతోంది.
 
వినూత్న ఆలోచనలు చేస్తూ ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ వైపునకు అడుగులు వేసే వారు ఎక్కువవుతున్నారు. స్వయంగా కంపెనీలు ఏర్పాటు చేసి, వ్యాపారానికి కొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. ఓ తాజా అధ్యయనం ప్రకారం దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ బిజినెస్ విద్యార్థుల్లో 26 శాతం మంది అదే విధంగా ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 16 శాతం మంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా అడుగులు వేస్తున్నారు.
 
 
 కాలేజీ కేరాఫ్ ఇన్నోవేషన్:
నిన్నామొన్నటి వరకు కాలేజీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై ఎక్కువగా దృష్టిసారించేవి. సాధ్యమైనన్ని పెద్ద కంపెనీలు ప్రాంగణ నియామకాలు జరిపేలా ప్రయత్నించేవి. విద్యార్థులు కూడా ఏ కాలేజీలో ఎక్కువగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నాయో చూసుకొని చేరుతుండేవారు. ఇప్పుడు కళాశాలల యాజమాన్యాల ఆలోచన తీరులో మార్పు వచ్చింది. క్యాంపస్ నియామకాలతో పాటు విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల మెదళ్లో దాగున్న సృజనాత్మక ఆలోచనల్ని వెలికితీసి, వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి.
 
ఐఐటీలు, ఐఐఎంలు, నిట్‌ల వంటి ఉన్నత విద్యా సంస్థల దగ్గర నుంచి చిన్న నగరాల్లో నడిచే కళాశాలల వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఓ విద్యార్థి వద్ద మంచి ఆఠటజ్ఛీటట ఐఛ్ఛ్చీ ఉంది. అయితే ఆ ఆలోచనను విజయవంతంగా అమలు చేయాలంటే ఏం చేయాలి? దేనితో మొదలుపెట్టాలి? ఎలా ముందుకెళ్లాలి? వంటి ప్రశ్నలు సదరు విద్యార్థిని గందరగోళానికి గురిచేస్తాయి.
 
ఇలాంటి వారికి ఆసరాగా ఉండేందుకు ప్రత్యేక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలు తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు ఐఐటీ-పాట్నా.. విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్స్ దిశగా ప్రోత్సహించేందుకు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్’ ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో గెస్ట్ లెక్చర్లు, వర్క్‌షాప్‌లు, బిజినెస్ ప్లాన్ కాంపిటేషన్స్ వంటివి జరుగుతున్నాయి.
ఐఐఐటీ-హైదరాబాద్ క్యాంపస్‌లో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఈ) నడుస్తోంది. ఇది టెక్నాలజీకి సంబంధించి సృజనాత్మక వ్యాపార ఆలోచనలున్న వారిని ప్రోత్సహిస్తోంది. ఇంక్యుబేటర్ ద్వారా అండగా ఉంటోంది.
విద్యార్థుల ఆలోచనలను సానపట్టి వారి కలల్ని నిజం చేసేందుకు స్వయం (wayam), ఆకాశ్ (Akash).. ఇలా వివిధ పేర్లతో కళాశాలల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలు ఏర్పాటవుతున్నాయి.
ఒకే విధమైన ఆలోచనలు, ఆశయాలు ఉన్న విద్యార్థులను ఒకచోటకు చేర్చి, సంయుక్తంగా ప్రాజెక్టును చేపట్టేలా చేసేందుకు, వారిని భవిష్యత్ వ్యాపార భాగస్వాములుగా మార్చేందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలు దోహదం చేస్తున్నాయి.
 
 అప్లికేషన్ స్కిల్స్ ప్రధానం:
తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవంగా ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్స్ ద్వారా తెలుసుకోవాలి. అలాంటప్పుడు కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు రూపొందుతాయి. ఇవి విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడానికి దోహదం చేస్తాయి. అందుకే విద్యా సంస్థలు విద్యార్థుల్లో అప్లికేషన్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు టెక్ ఫెస్ట్‌లు వంటివి నిర్వహిస్తున్నాయి. వీటిలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఇలాంటి పోటీల్లో విజేతలు కావడం వల్ల వచ్చే ఆత్మవిశ్వాసం ఎంటర్‌ప్రెన్యూర్స్ దశకు మార్గాన్ని సుగమమం చేస్తాయి.
 
 ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే అవసరమయ్యే స్కిల్స్
 స్వయం ప్రేరణ (Self motivation)
 ఆత్మవిశ్వాసం (self confidence)
 సమయపాలన (Time management)
 భావ వ్యక్తీకరణ (communication)
 నాయకత్వం (Leadership)
 సృజనాత్మకత (Creativity)
 దేన్నయినా అమ్మగలిగే నేర్పు (Be able to sell anything)
 వైఫల్యాల నుంచి నేర్చుకోవడం (Learning from failures)
 
 అవకాశాలు-అపారం:
 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్.. అభివృద్ధి చెందిన దేశం స్థాయికి చేరాలంటే పది కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రధాన మార్గం. ప్రస్తుతం చాలా రంగాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు అనుకూల వాతావరణం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగాలు.. డ్రీమ్ సెక్టార్స్‌గా వెలుగొందుతున్నాయి.
 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు అవకాశమున్న విభాగాలు:
 ఒకటో స్థాయి: క్రాప్ ప్రొడక్షన్, ప్లాంటేషన్, లైవ్‌స్టాక్, ఫిషింగ్, మైనింగ్, క్వారీయింగ్ తదితరాలు.
 రెండో స్థాయి: హోటల్స్, రెస్టారెంట్స్, హోల్‌సేల్ అండ్ రిటైల్ ట్రేడ్ వంటివి.
 మూడో స్థాయి: మ్యాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై వంటివి.
 నాలుగో స్థాయి: ఐటీ, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ అండ్ బిజినెస్ సర్వీసెస్, కన్‌స్ట్రక్షన్, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్, సప్లై చైన్, ట్రాన్స్‌పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ తదితరాలు.
 
అందుబాటులో కోర్సులు:
విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దేందుకు బి-స్కూల్స్, ఉన్నత విద్యా సంస్థలు వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో పూర్తిస్థాయి ఎంబీఏ ప్రోగామ్‌లతో పాటు సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా వంటి కోర్సులు ఉన్నాయి. విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాలను విస్తృతం చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి.
 
కొన్ని సంస్థలు- అందిస్తున్న కోర్సులు:
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐ).. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్- బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సును ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు డిప్లొమా ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.ediindia.org
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డవలప్‌మెంట్.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సంబంధించి వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్, కెమికల్స్ తదితర విభాగాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేస్తోంది. వెబ్‌సైట్: www.niesbud.org
 అమిటీ బిజినెస్ స్కూల్ (ఏబీఎస్).. ఎంబీఏ-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (రెండేళ్లు) కోర్సును ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: www.amity.edu
 
 కోర్సులో ఏం బోధిస్తారు:
 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోసెస్.
 ఇన్నోవేషన్ ఇన్ బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రైజ్.
 బిజినెస్ మోడల్స్.
 ప్రొడక్ట్ డవలప్‌మెంట్, డిజైన్.
 మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూరియల్ ఫైనాన్స్.
 బిజినెస్ కమ్యూనికేషన్.
 ఎమర్జింగ్ బిజినెస్ సెక్టార్స్ అండ్ న్యూటెక్నాలజీస్.
 ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలను బోధిస్తారు.
 
 రిస్క్ ఉన్నచోటే విజయం ఉంటుంది!
 ఇంటర్, ఇంజనీరింగ్.. ఆపై పుణెలోని సింబయోసిస్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సంస్థలో ఎంబీఏ పూర్తిచేశా. తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, విప్రో సంస్థల్లో పనిచేశా. 9 టు 5 జాబ్‌కు పరిమితం కాకుండా నాకంటూ ఓ సొంత కలల ప్రపంచాన్ని నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో నెలకు రూ.65 వేల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని బయటకు వచ్చేశా. సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలుసుకున్న కొందరు వేలకు వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని కోరికోరి కష్టాలు తెచ్చుకోవడమెందుకని అన్నారు? అయితే ధైర్యం కోల్పోకుండా 2010లో హైదరాబాద్‌లో ‘ఎక్స్‌ప్రెస్ గ్రీన్ పేపర్ బ్యాగ్స్’ కంపెనీని ప్రారంభించా.
 
 మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ అయిన భర్త, కుటుంబ సభ్యుల అండదండలు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ప్రస్తుతం 18 మంది ఉద్యోగులతో పేపర్ బ్యాగ్స్‌కు బ్రాండ్ ఇమేజ్‌ను జోడించేలా వైవిధ్య భరితంగా కస్టమర్ అవసరాలకు తగినట్లు బ్యాగ్స్‌ను తయారు చేస్తున్నాం. ఇందులో ఒకటి బర్త్‌డే, మ్యారేజ్‌లకు, కార్పొరేట్ ఈవెంట్లకు బ్యాగ్‌పై ఫొటో వచ్చేలా చేయడం. ఇలా లామినేటెడ్, క్రా్‌ఫ్ట్, ప్రీమియం, గ్రోసరీ తదితర బ్యాగులు తయారు చేస్తున్నాం.
 
 బయట మార్కెట్లో ఒకే రకమైన బ్యాగులు అమ్మే షాపులు పది ఉంటాయి.. అదే మా కంపెనీ ఔట్‌లెట్‌లో అయితే పది రకాల బ్యాగులు ఒకేచోట దొరుకుతాయి. అందుకే వివిధ వర్గాల వారిని ఆకట్టుకోగలుగుతున్నాం. పూర్తిగా ప్లాస్టిక్ సంచులు నిషేధం అమల్లో ఉన్న ఆస్ట్రేలియా నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. సోనీ ఇండియా, కోకాకోలా వంటి పెద్ద సంస్థలు మా క్లయింట్లుగా ఉన్నాయి. త్వరలో పూర్తిస్థాయి ‘ఈ-కామర్స్’ కార్యకలాపాలను ప్రారంభిస్తా.
 
 మొదట్లో పేపర్ బ్యాగ్స్ తయారీ కంపెనీ పెడతానని చెబితే కొందరు పెదవి విరిచారు. రిస్క్ చేస్తున్నావేమో.. ఆలోచించుకో! అన్నారు. అయితే కొత్త ఆలోచన ఉన్నచోట రిస్క్ ఉంటుంది.. రిస్క్ ఉన్నచోట ఉన్నత విజయాలు సాకారమవుతాయి.. కదా! నవతరం విద్యార్థులు దీన్ని గుర్తించాలి.
 
 చాలా మంది కంపెనీ అవసరాలకు సరిపడా రుణాలు దొరకడం కష్టమంటారు. అయితే మనం ఎంచుకున్న ప్రాజెక్టు సరైంది అయితే రుణాలు దొరకడం కష్టం కాదు. నా వరకైతే బ్యాంక్ మేనేజర్.. మేము తయారు చేసిన ప్రోటోటైప్ బ్యాగులు చూసి.. ‘పేపర్‌తో ఇలాంటి బ్యాగులు కూడా తయారు చేయొచ్చా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కంపెనీకి ప్రారంభ పెట్టుబడికి అవసరమైన రుణాన్ని వెంటనే మంజూరు చేశారు.
 
 అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (అలెప్)లో ఔత్సాహికులకు పేపర్ బ్యాగ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నాను. ‘ అదేంటి? నీకు నీవే కాంపిటేటర్స్‌ని తయారు చేసుకుంటున్నావు’ అని కొందరు అంటుంటారు. దీనికి నేను.. ‘మరో పది మంది పేపర్ బ్యాగ్స్‌ను తయారు చేయడం ప్రారంభిస్తే ముడిసరకు సేకరణ ఖర్చులు తగ్గుతాయి. తద్వారా తక్కువ ధరకే బ్యాగులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ విసృ్తతమవుతుంది. మరిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి కదా’ అని సమాధానం చెబుతుంటా.
 
 ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు అవకాశాలు పెరిగాయి. ఏర్పాటు చేసే కంపెనీ చిన్నదైనా, పెద్దదైనా ఆలోచన సరైంది అయి, కష్టపడి పనిచేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం తథ్యం.
 ఆల్ ది బెస్ట్!
 
 -వసంత చిగురుపాటి,
 ఫౌండర్, ది పేపర్‌బ్యాగ్ షాప్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement