ధర్మ చక్ర పరివర్తనం అంటే? | new religions emergence | Sakshi
Sakshi News home page

ధర్మ చక్ర పరివర్తనం అంటే?

Published Mon, Sep 19 2016 3:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

ధర్మ చక్ర పరివర్తనం అంటే?

ధర్మ చక్ర పరివర్తనం అంటే?

క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలు ప్రపంచ చరిత్ర భవితవ్యాన్ని మార్గనిర్దేశం చేశాయి. ఇవి తమ ఆధునిక, విప్లవాత్మక

  నూతన మతాల ఆవిర్భావం
 క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలు ప్రపంచ చరిత్ర భవితవ్యాన్ని మార్గనిర్దేశం చేశాయి. ఇవి తమ ఆధునిక, విప్లవాత్మక భావాలతో అప్పటి వరకూ ఉన్న సామాజిక కట్టుబాట్లను, వ్యత్యాసాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. వీటికి ఆద్యులు సోక్రటీస్(గ్రీస్), జొరాస్టర్ (పర్షియా), కన్‌ఫ్యూషియస్, లావోత్సే (చైనా), రుషభనాథుడు, గౌతమ బుద్ధుడు (భారత్). వీరు ఆచరణీయ విలువలను ప్రబోధించే కొత్త మతాలను స్థాపించి ప్రజల్లో తాత్విక ఆలోచనలను పెంపొందించడానికి కృషి చేశారు. జైన, బౌద్ధ మతాలు విగ్రహారాధనను, పూజాసంస్కా రాలను, బ్రాహ్మణాధిపత్యాన్ని తిరస్కరించాయి.
 
 జైన మతం
 జైనమత ప్రచారకులను తీర్థంకరులు అంటారు. మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడు ఈ మతాన్ని స్థాపించాడు. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. చివరి (24వ) తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు జైనమత అభివృద్ధికి తన బోధనలతో విశేషంగా కృషిచేసి ప్రజాబాహుళ్యంలో ప్రత్యేక స్థానాన్ని పొందాడు.
 
 వర్ధమాన మహావీరుడు (క్రీ.పూ. 540-468)
 మహావీరుడు వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు. జ్ఞాత్రిక క్షత్రియ వంశీ యులైన సిద్ధార్థుడు, త్రిశాల ఇతని తల్లిదండ్రులు. భార్య యశోద, కూతురు ప్రియదర్శిని. కుటుంబ సుఖాలను వదిలి జినత్వం కోసం 12   ఏళ్లు తపస్సు చేసి, జినుడయ్యాడు. జినుడు అంటే కోర్కెలను జయించినవాడు. దీన్నే జ్ఞానోదయంగా పేర్కొంటారు. ఈ జినులే జైనులుగా ప్రసిద్ధి చెందారు. వీరి మతాన్ని జైనమతంగా పిలుస్తున్నారు. వర్ధమానుడు తన 72వ ఏట  పావాపురిలో నిర్యాణం చెందాడు.

  జైనమత సూత్రాలు
 వీటిని పంచవ్రతాలుగా పిలుస్తారు. అవి..
     1. సత్యం     2. అహింస     
     3. ఆస్తేయం (ఇతరుల ఆస్తిని దొంగిలించకూడదు)  4. అపరిగ్రహం (అవసరానికి మించి ఆస్తి సంపాదించకూడదు)
     5. బ్రహ్మచర్యం.
 వీటిలో మొదటి నాలుగు సూత్రాలను  పార్శ్వనాథుడు ప్రవచించగా 5వ సూత్రాన్ని మహావీరుడు ప్రబోధించాడు.
 ఠి    జైనమత ప్రధాన నియమాలు 3. వీటిని త్రిరత్నాలు అంటారు. అవి...
 1. సమ్యక్ దర్శనం    2. సమ్యక్ జ్ఞానం
 3. సమ్యక్ క్రియ.
 మత బోధనలపై విశ్వాసం కలిగి ఉండటమే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించడమే సమ్యక్ జ్ఞానం. వాటిని పాటించడమే సమ్యక్ క్రియ. వీటిని అనుసరించినవారు మోక్షానికి అర్హులవుతారని జైనుల నమ్మకం.
 
 జైనమత పవిత్ర గ్రంథాలను అంగాలు అంటారు. ఈ మతం.. హిందూ మతానికి దగ్గరగా ఉంటుంది. మహావీరుడు వర్ణవ్యవస్థను పూర్తిగా ఖండించలేకపోయాడు. అది పూర్వజన్మ సుకృతంగా అభిప్రాయపడ్డాడు. జైనమత వ్యాప్తి కోసం జైన సంఘాన్ని స్థాపించాడు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక, నంద వంశ రాజులు, మౌర్యరాజైన సంప్రతి చంద్రగుప్తుడు జైనమతాన్ని ఎక్కువగా ఆదరించారు. పాటలీపుత్రంలో (క్రీ.పూ. 300లో) చంద్రగుప్తుడు.. శ్రావణ బెళగొళ (కర్ణాటక)కు తన గురువు భద్రబాహుతో కలిసి వెళ్లాడు, అక్కడ సల్లేఖన (ఉపవాస) వ్రతాన్ని పాటించి కన్నుమూశాడు.
 జైన సాహిత్యం ప్రాకృత, కన్నడ భాషలో లభిస్తుంది.
 జైన మతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందింది.
 ఉదయగిరి (ఒడిశా), ఎల్లోరా (మహారాష్ట్ర) ల్లో జైన గుహలున్నాయి.
 మన రాష్ట్రంలో కొలనుపాక (నల్గొండ జిల్లా)లో జైన దేవాలయం ఉంది.
 మౌంట్ అబూ శిఖరం (రాజస్థాన్) పైనున్న దిల్వారా జైన దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది.
 
 శ్రావణ బెళగొళ (కర్ణాటక)లోని గోమఠేశ్వరుని విగ్రహం జైనమత శిల్పకళకు ప్రతీక.
 జైన సిద్ధాంతాలు కఠినంగా, ఆచరణకు దూరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే జైనుల్లో  శ్వేతాంబరులు (తెల్లని వస్త్రాలు ధరించేవారు), దిగంబరులు (వస్త్రాలు ధరించని వారు) అనే రెండు శాఖలు ఏర్పడ్డాయి. వీరి మధ్య ఐక్యత కోసం ఖారవేలుడు (కళింగరాజు) ఒక సమావేశం ఏర్పాటు చేసి విఫలుడయ్యాడు.
 
 బౌద్ధమతం
 వర్ధమాన మహావీరుడి సమకాలీనుడైన గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించాడు. కపిలవస్తు నగరంలోని లుంబినీ వనంలో బుద్ధుడు జన్మించాడు. శాక్యరాజైన శుద్ధోదనుడు, మాయాదేవి అతని తల్లిదండ్రులు. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. చిన్నతనంలో తల్లి చనిపోవడంతో సవతి తల్లి గౌతమి ప్రజాపతి బుద్ధుడిని పెంచింది. అందువల్ల అతనికి గౌతముడు అని పేరు వచ్చింది. గౌతముడి భార్య యశోధర, కుమారుడు రాహులుడు. బుద్ధుడు తన 29వ ఏట జీవిత పరమార్థం తెలుసుకున్నాడు. రాజ భోగాలను వదిలి మోక్షం కోసం బయలుదేరాడు. దీన్నే మహాభినిష్ర్కమణం అంటారు. ఇందులో భాగంగా వైశాలి, రాజగృహ నగరాల్లో పండితులను కలిశాడు. చివరికి గయ సమీపంలో బోధివృక్షం కింద 40 రోజులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడు. దీన్నే సంబోధిని అంటారు. అప్పటి నుంచి గౌతముడు (సిద్ధార్థుడు) బుద్ధుడిగా మారాడు.
 గౌతమబుద్ధుడు వారణాసి సమీపంలో ఉన్న మృగదావనం (సార్‌నాథ్) చేరి 5మంది పండితులకు ప్రథమంగా జ్ఞానబోధ చేశాడు. దీన్ని ధర్మచక్ర పరివర్తనంగా పిలుస్తారు. కుశి నగరంలో క్రీ.పూ. 483లో నిర్యాణం చెందాడు.
                   బౌద్ధమత సూత్రాలు
 
 బౌద్ధమత సూత్రాలు 4. వీటిని ఆర్యసూత్రాలు అంటారు. అవి..
 1.    {పపంచం దుఃఖమయం
 2.    దుఃఖానికి కోరికలే కారణం  
 3.    కోరికలను జయించడం ద్వారా దుఃఖం నశిస్తుంది.
 4.    కోరికలను జయించడానికి అష్టాంగమార్గాన్ని ఆచరించాలి.
        అష్టాంగ మార్గంలో 8 నీతి సూత్రాలు
         ఉన్నాయి. అవి..
 1. సరైన వాక్కు (మాట)
 2. సరైన క్రియ (పని)     
 3. సరైన జీవనం  
 4. సరైన శ్రమ (కష్టం)
 5. సరైన ఆలోచన
 6. సరైన ధ్యానం, 7. సరైన నిర్ణయం   
 8. సరైన దృష్టి (చూపు)
 వీటిని ఆచరించినవారు ప్రశాంతతను పొందుతారని బౌద్ధమతం ప్రబోధిస్తుంది.
 బౌద్ధమత గ్రంథాలను త్రిపీఠకాలు అంటారు. వీటిని ప్రాకృత భాషలో రాశారు. బౌద్ధ మతం విస్తృతంగా వ్యాపించింది. గొప్ప చక్రవర్తులు దీన్ని ఆదరించారు. దీంతో శ్రీలంక, బర్మా, చైనా, టిబెట్, జపాన్‌ల్లోనూ బౌద్ధ మతం వ్యాప్తి చెందింది.
 
 బౌద్ధులు స్థాపించిన నలంద, వల్లభి, ధాన్యకటక విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి.
 
 వైద్య శాస్త్రజ్ఞులైన చరకుడు, జీవకుడు, బౌద్ధమతాన్ని ఆచరించారు.
 బౌద్ధమత ఆచార్యుడైన నాగార్జునుడు  సుహృల్లేఖ, రస రత్నావళి అనే గ్రంథాలను రచించాడు.
 
 మహారాష్ట్రలోని కార్లీ, నాసిక్, అజంతా గుహల్లో, బార్హుత్, సాంచి, అమరావతి, నాగార్జున కొండల్లో బౌద్ధ ఆరామాలు, గుహాలయాలు, మనోహర శిల్పాలు ఉన్నాయి.
 గౌతమ బుద్ధుడి నిర్యాణం తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధమత వ్యాప్తి కోసం విశేషంగా కృషిచేసి.. దాన్ని జాతీయ ధర్మంగా, అంతర్జాతీయ మతంగా రూపొందించాడు. శాంతి, అహింసలను ప్రచారం చేసిన బౌద్ధం.. వర్ణ వ్యవస్థను ఖండించింది. అందరూ సమానమనే నీతిని, విశ్వ శాంతిని కాంక్షించింది.   
 
  బౌద్ధ సంఘ సమావేశాలు
 బౌద్ధమత సంఘ సమావేశాలను సంగీతులుగా పిలుస్తారు.
 
 మొదటి సంగీతి  (క్రీ.పూ.483):
 రాజగృహలో అజాత శత్రువు నిర్వహించాడు. దీనికి మహాకాశ్యపుడు అధ్యక్షుడు. ఈ సంగీతిలో సుత్త, వినయ పీఠకాలను సంకలనం చేశారు.
 
 రెండో సంగీతి (క్రీ.పూ. 383):
 వైశాలిలో కాలాశోకుడు నిర్వహించాడు. దీనికి సభకామి అధ్యక్షుడు. ఈ సంగీతిలో బౌద్ధ సంఘం రెండు శాఖలుగా(థేరవాదులు, మహాసాంఘికులు)గా విడిపోయింది.
 
 మూడో సంగీతి (క్రీ.పూ. 250):
 దీన్ని అశోకుడు పాటలీపుత్రంలో నిర్వహించాడు. దీనికి మొగలిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో అభిదమ్మ పీఠకాన్ని రూపొందించారు.
 
 నాలుగో సంగీతి (క్రీ.శ.72):
 కాశ్మీర్‌లోని కుందలవనంలో కనిష్కుడు నిర్వహించాడు. వసుమిత్రుడు అధ్యక్షుడు. ఈ సంగీతిలో బౌద్ధమతం.. మహాయాన, హీనయాన శాఖలుగా విడిపోయింది.నాలుగో బౌద్ధ సంగీతి తర్వాత బౌద్ధమతంలో తీవ్రమైన మార్పు సంభవించింది. మహాయాన బౌద్ధం అవలంబించినవారు బుద్ధుడిని ఆరాధించారు. విగ్రహాలు ప్రతిష్టించారు. హీనయానులు మాత్రం దీనికి వ్యతిరేక పద్ధతులను పాటించారు.
 
 వేద నాగరికతలోని వైదిక బ్రాహ్మణ క్రతువులైన విగ్రహారాధన, పూజా విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన బౌద్ధమతంలో తిరిగి మహాయానుల ద్వారా వాటినే బౌద్ధంలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మహాయాన శాఖ అభివృద్ధిలో ముందుంది.
 
 మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేసిన వారిలో ఆచార్య నాగార్జునుడు ప్రముఖుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement