భారతదేశ శీతోష్ణస్థితి | Sakshi Bhavitha | Sakshi
Sakshi News home page

భారతదేశ శీతోష్ణస్థితి

Published Sat, Apr 30 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

భారతదేశ శీతోష్ణస్థితి

భారతదేశ శీతోష్ణస్థితి

రుతుపవన ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. రుతుపవన ప్రక్రియ ఆవిర్భావాన్ని కింది సిద్ధాంతాల ద్వారా వివరించవచ్చు. అవి
* థర్మల్ సిద్ధాంతం
* ఫ్లాన్ సిద్ధాంతం
* జెట్‌స్ట్రీమ్ సిద్ధాంతం
* టిబెటన్ హీట్ ఇంజిన్
* ఎల్‌నినో సిద్ధాంతం
* ఈక్వినో, ఐవోడీ దృక్పథం

థర్మల్ సిద్ధాంతం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు సముద్ర పవనాల లాంటివి. ఖండ-సముద్ర భాగాల ఉష్ణ ప్రవర్తనలో వ్యత్యాసం వల్ల ఇవి ఏర్పడతాయి.

నైరుతి రుతుపవనాలను భారత ఉపఖండంలోకి ఆకర్షించే అల్పపీడన మండలం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడిందని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. ఫ్లాన్ సిద్ధాంతం ప్రకారం ఆగ్నేయ రుతుపవనాలు దక్షిణాసియాలో రూపాంతరం చెంది.. నైరుతి రుతుపవనాలుగా భారత్‌లో ప్రవేశిస్తాయి. సూర్యుడి సాపేక్ష గమనం వల్ల భూమధ్యరేఖా అల్పపీడన మండలం కర్కటక రేఖ వద్దకు స్థానభ్రంశం చెంది నైరుతి రుతుపవనాలను ఆకర్షిస్తుంది. వేసవిలో టిబెట్ పీఠభూమి దాదాపు కొలిమిగా మారుతుంది. పర్వత పరివేష్టిత పీఠభూమి కావడంతో ఇక్కడ ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి.

దీంతో టిబెటన్ పీఠభూమి నుంచి సంవహన వాయువులు దక్షిణంగా వీచి దక్షిణ హిందూ మహాసముద్రంలో అవనతం చెందుతాయి. దాంతో దక్షిణ హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఏర్పడుతుంది. దక్షిణ హిందూ మహాసముద్రానికి వాయవ్య భారతదేశానికి మధ్య పీడన ప్రవణత ఏర్పడటంతో దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి కవోష్ణ ఆర్ధ్ర పవనాలు భారత్‌లో ప్రవేశిస్తాయి. ఉప ఆయనరేఖా పశ్చిమ జెట్‌స్ట్రీమ్ జూన్ మొదటి వారంలో హిమాలయాలకు ఉత్తరంగా స్థానభ్రంశం చెందడం వల్ల నైరుతి రుతుపవనాలు ఉద్ధృతంగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి.

ఆఫ్రికా తూర్పు తీరంలోని సోమాలియా నుంచి అరేబియా సముద్రం మీదుగా.. కేరళ తీరం వైపు వీచే సోమాలియా నిమ్న స్థాయి జెట్‌స్ట్రీమ్ నైరుతి రుతుపవనాలను బలోపేతం చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో  నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తుందని వాతావరణ  నిపుణుల అభిప్రాయం. ఈ కారణంతోనే రుతుపవనాల భవిష్యత్తు నమూనాలో ఎల్‌నినో చలనరాశులకు పెద్దపీట వేశారు. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇటీవల ఎల్‌నినో నైరుతి రుతుపవన వ్యవస్థల మధ్య సంబంధం బలహీనపడుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
 
రుతుపవన పూర్వకాలాన్ని నడివేసవిగా పరిగణిస్తాం. ఈ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటారుు. ముఖ్యంగా వాయవ్య భారతదేశం, దక్కన్ పీఠభూమి అంతర్భాగాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45నిఇలకు పైగా నమోదవుతారుు. ఈ కాలంలో సంవహన ప్రక్రియ వల్ల మధ్యాహ్నం గాలిదుమ్ములు, చిరుజల్లులతో కూడిన స్థానిక పవనాలు వీస్తారుు.

వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు ఆంధీలు(ఉత్తరప్రదేశ్), లూ (పంజాబ్, హర్యానా), కాల బైశాఖి(బిహార్, పశ్చిమబెంగాల్), మామిడి జల్లులు(దక్షిణ భారతదేశం). నైరుతి రుతుపవన కాలంలో దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తారుు. వార్షిక సగటు వర్షపాతంలో సుమారు మూడింట రెండొంతులు ఈ నాలుగు నెలల కాలంలోనే సంభవిస్తుంది. బంగాళాఖాతం, అరేబియూ సముద్రం నుంచి వీచే ఆర్ధ్ర రుతుపవనాలు విస్తారంగా వర్షాన్నిస్తాయి.

పశ్చిమ తీరమైదానం, దక్షిణ షిల్లాంగ్ పీఠభూమి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఇక్కడ సగటు వర్షపాతం 250 సెం.మీ.కు పైగా నమోదవుతుంది. ఈ మండలానికి చెందిన చిరపుంజి, మాసిన్‌రామ్‌లలో ప్రపంచంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ కాలంలో వర్షపాత విస్తరణలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తారుు. సహ్యాద్రి పర్వతాలకు పవన పరాన్ముఖ దిశలో ఉన్న దక్కన్ పీఠభూమి అంతర్భాగాల్లో వర్షపాతం 50-70 సెం.మీ. ఉంటుంది. ఇది వర్షచ్ఛాయూ ప్రాంతం కావడంతో పాక్షిక శుష్క మండలంగా ఏర్పడింది.
 
రుతుపవనాల తిరోగమనం
సెప్టెంబర్ 15 కల్లా భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. తిరోగమన రుతుపవనాలు శీతల శుష్కఖండ వాయురాశులతో కూడి ఉంటారుు. ఇవి బంగాళాఖాతం మీదకు రాగానే సముద్ర నీటిఆవిరిని పీల్చుకొని ఆర్ధ్రంగా తయూరవుతారుు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఈశాన్య వ్యాపార పవనాలు బలంగా వీస్తుంటాయి. వీటి ప్రభావం వల్ల తిరోగమన రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల రూపంలో తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాన్ని తాకుతాయి. ఈ ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

ఈ కాలంలో దేశమంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతాయి. హిమాలయ ప్రాంతంలో మంచు విస్తారంగా కురుస్తుంది. పశ్చిమ పవనాల ప్రభావం వల్ల మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం ప్రాంతాల నుంచి వచ్చే బలహీనకవోష్ణ సమశీతోష్ణ మండల చక్రవాతాలు, వాయవ్య భారత్‌లో ప్రవేశిస్తాయి. వీటి వల్ల పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయి. వీటిని పశ్చిమ అలజడులుగా పిలుస్తారు. ఇదే కాలంలో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే స్థానిక అల్పపీడన ద్రోణులు మరింత తీవ్రమై వాయుగుండాలు తుఫాన్లుగా రూపాంతరం చెంది దేశ తూర్పు తీరాన్ని తాకుతాయి.
 
ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి
భారతదేశం వైవిధ్య శీతోష్ణస్థితిని కలిగి ఉంది. స్థూలంగా భారతదేశ శీతోష్ణస్థితిని ‘ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి’గా అభివర్ణిస్తారు. ఇక్కడ సంవత్సరాన్ని ఆరు రుతువులుగా విభజించడం సంప్రదాయం. అంటే.. ప్రతి రెండు నెలలకొకసారి శీతోష్ణస్థితిలో గుణాత్మక మార్పులు సంభవిస్తాయి. అరుుతే శాస్త్రీయంగా భారతదేశ శీతోష్ణస్థితి సంవత్సరాన్ని నాలుగు రుతువులుగా విభజిస్తారు. అవి :

రుతుపవన పూర్వకాలం: మార్చి 15 - జూన్ 15
నైరుతి రుతుపవన కాలం: జూన్ 15 - సెప్టెంబర్ 15
ఈశాన్య రుతుపవన కాలం: సెప్టెంబర్ 15 - డిసెంబర్ 15
రుతుపవన అనంతర కాలం: డిసెంబర్ 15 - మార్చి 15
 
రుతుపవనాలు: భారతదేశ వాతావరణాన్ని రుతుపవనాలు  సంవత్సరం పొడవునా ప్రభావితం చేస్తాయి. దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిమ్న ట్రోపో ఆవరణంలో ఏర్పడే విశిష్టమైన పవన వ్యవస్థను రుతుపవన వ్యవస్థగా అభివర్ణిస్తారు. ఇది దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాల శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్త్తుంది. శీతాకాలంలో భారత ఉపఖండంపై విస్తరించి ఉన్న శీతల, శుష్క ఖండ వాయురాశిని జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో కవోష్ణ, ఆర్థ్ర సముద్ర వాయురాశి స్థానభ్రంశం చెందిస్తుంది.  
 
రుతుపవనాలు-ముఖ్య లక్షణాలు
* రుతువులను అనుసరించి పవన దిశలో సుమారు 180 డిగ్రీల మార్పు.  వేసవి, శీతాకాలాల్లో పరస్పర విరుద్ధ లక్షణాలున్న వాయురాశులు
* దేశంలోకి అకస్మాత్తుగా ప్రవేశించడం
* క్రమపద్ధతిలో దేశమంతటా విస్తరించడం
* క్రమపద్ధతిలో తిరోగమించడం. అనిశ్చితత్వం
 - గురజాల శ్రీనివాసరావు, జాగ్రఫీ సబ్జెక్టు నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement