ఓటర్‌ నివాదం? | sakshi bhavitha special | Sakshi
Sakshi News home page

ఓటర్‌ నివాదం?

Published Tue, Aug 8 2017 5:07 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

ఓటర్‌ నివాదం?

ఓటర్‌ నివాదం?

ఎన్నికల ప్రక్రియ

ఓటర్ల జాబితా తయారీ
ఎన్నికల ప్రధాన అధికారి పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులు చేస్తారు. ఇది ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ.

ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌
పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు గవర్నర్‌ పేరుతో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘమే వారి పేర్లతో జారీ చేస్తుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి కొన్ని వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ వెలువరిస్తుంది. ఆ వెనువెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకొస్తుంది.

నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారికి సమర్పించాలి. దానికి సంబంధించి ధ్రువీకరణ ప్రమాణం కూడా చేయాలి. సాధారణంగా నామినేషన్ల పరిశీలన పూర్తయిన రెండు రోజుల్లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

ఎన్నికల ప్రచారం
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ సిద్ధాంతాలు, విధానాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన రోజు నుంచి రెండు వారాల వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి.

బ్యాలెట్‌ పత్రాలు, గుర్తులు
నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఇంగ్లిష్‌ ఆల్ఫాబెట్‌ ఆర్డర్‌లో ఎన్నికల అధికారి రూపొందిస్తారు. బ్యాలెట్‌ పత్రం/ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)పై అభ్యర్థికి కేటాయించిన గుర్తుతోపాటు పేరును ఆంగ్లం, సంబంధిత ప్రాంతీయ భాష లేదా హిందీలో ముద్రిస్తారు.

ఎన్నికల విధానం
రహస్య ఓటింగ్‌ పద్ధతిని పాటిస్తారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో 1,500 మంది ఓటర్లకు మించకుండా చూస్తారు. ఎన్నికల రోజున పోలింగ్‌ స్టేషన్‌ను కనీసం 8 గంటలకు తక్కువ కాకుండా తెరచి ఉంచాలి.

ఓట్ల లెక్కింపు
ఓటింగ్‌ పూర్తయ్యాక ఒకటి లేదా రెండు రోజుల తర్వాత రిటర్నింగ్‌ అధికారి, పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించి రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

ఎన్నికలు – వివాదాలు – పరిష్కారం
ప్రకరణ 323 (బి) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇప్పటివరకు అలాంటి ట్రైబ్యునల్‌ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఇలాంటి వివాదాలను సంబంధిత రాష్ట్ర హైకోర్టులోనే పరిష్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థి లేదా ఓటర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలి.

ప్రత్యేక వివరణ
ఎన్నికలు జరిగే సమయంలో అంటే ఫలితాలను ప్రకటించక ముందు ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన, ఇతర ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి తీర్పు వెలువరిస్తుంది. ఈ దశలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. ఫలితాలు వెలువడిన తర్వాత సంబంధిత వివాదాలను హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి.  

ఓటర్‌ నినాదం
‘ఓటర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను’.

ఓటర్‌ దినోత్సవం
ఏటా జనవరి 25న ఓటర్‌ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2011 నుంచి దీన్ని ప్రారంభించారు. 7వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2017, జనవరి 25న జరుపుకున్నాం.

ఓటర్ల ప్రతిజ్ఞ
‘ప్రజాస్వామ్యంలో విశ్వసనీయతకు కట్టుబడి ఉన్న భారత పౌరులైన మేము మా దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలిపి ఉంచుతామని, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా, మతం, వర్గం, కులం, సంఘం భాష తదితర ప్రలోభాలను పరిగణనలోకి తీసుకోకుండా, వాటికి గురికాకుండా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము’.

ప్రజా ప్రాతినిధ్య చట్టాలు
పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలో గరిష్ట సభ్యుల సంఖ్య, సీట్ల కేటాయింపులకు సంబంధించి కొన్ని నియమాలను భారత రాజ్యాంగ ప్రకరణలు 81, 170లో పేర్కొన్నారు. అయితే వాటికి సంబంధించి సమగ్ర వివరాలను పొందుపరచలేదు. సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్లు మొదలైన విషయాలను పార్లమెంటు  ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి పార్లమెంటు రెండు చట్టాలను రూపొందించింది. అవి..

1. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950
2.  ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951
ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950


ఈ చట్టం ప్రధానంగా పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల్లో సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. అలాగే ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటరుగా నమోదు చేసుకోవడానికి సంబంధించిన అర్హతల గురించి తెలుపుతుంది. ఈ చట్టంలో 32 సెక్షన్లు, 5 భాగాలు, 4 షెడ్యూళ్లు ఉన్నాయి. ఈ చట్టాన్ని పార్లమెంటు  చాలాసార్లు సవరించింది. 2008లో ఈ చట్టానికి సమగ్ర సవరణలు చేశారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951
పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యుల అనర్హతల గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. కింది సందర్భాల్లో వారు సభ్యత్వం కోల్పోతారు, లేదా పోటీకి అనర్హులవుతారు.

రెండేళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడినవారు శిక్షా కాలంలో, శిక్ష ముగిసిన తర్వాత ఆరేళ్ల వరకు పోటీకి అనర్హులు.

వరకట్న నిషేధ చట్టం, ఆహార కల్తీ మొదలైన నేరాల్లో ఆరేళ్ల కంటే తక్కువ కాకుండా శిక్ష పడినవారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

అవినీతి నిరోధక చట్టం, ప్రజా శాంతి చట్టం, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లలో పేర్కొన్న కొన్ని నేరాలకు పాల్పడి, నేరం రుజువైతే కూడా అనర్హులవుతారు.

అవినీతి నేరం కింద తొలగింపునకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.

మతం, కులం, జాతి, భాష ప్రాతిపదికన ఓట్లు అడిగినప్పుడు, వాటి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టినప్పుడు అనర్హులుగా ప్రకటిస్తారు.

ఎన్నికల నిర్వహణ – ప్రవర్తన నియమావళి
ఎన్నికలను సజావుగా, అవినీతి రహితంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శక సూత్రాలను రాజకీయ పార్టీలు, పౌరులకు జారీ చేస్తుంది.

1971లో 5వ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి వీటిని ప్రకటించారు. వీటికి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదు.

ఎన్నికలను సక్రమంగా నిర్వహించడమే ఈ ప్రవర్తన నియమావళి ముఖ్య ఉద్దేశం.

డబ్బు, మద్యం తదితర బలహీనతల ఆధారంగా ఓటర్లను ప్రభావితం చేయకూడదు.

కులం, మతం, ఇతర సెంటిమెంట్ల ఆధారంగా ఓట్లు అడగకూడదు.

అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలను ప్రకటించకూడదు.

నిరాధార ఆరోపణలు, గౌరవాన్ని కించపరిచే విమర్శలు చేయకూడదు.

ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు, సిబ్బందిని వినియోగించకూడదు.

ఎన్నికల్లో పోటీకి అర్హతలు
లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

లోక్‌సభకు పోటీ చేసే వ్యక్తి ఇండిపెండెంట్‌ అభ్యర్థి అయితే సంబంధిత నియోజకవర్గంలోని పది మంది ఓటర్ల మద్దతు తెలపాలి.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థికి ఒక ఓటరు మద్దతు సరిపోతుంది.

పై షరతులు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కూడా వర్తిస్తాయి.

లోక్‌సభ, రాజ్యసభకు పోటీ చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు నామినేషన్‌ సమయంలో రూ.25,000 ధరావతు(డిపాజిట్‌) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 ధరావతు చెల్లించాలి.

రాష్ట్ర శాసనసభ, శాసన మండలికి పోటీచేసే అభ్యర్థి ఆ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలికి పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10,000 ధరావతు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 ధరావతు చెల్లించాలి.

లోక్‌సభ లేదా రాష్ట్ర విధాన సభకు సంబంధించి ఒక అభ్యర్థి రెండు స్థానాలకు మించి పోటీ చేయడానికి అవకాశం లేదు.

ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోపు ఎన్నికలకు సంబంధించిన వ్యయాల వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేయాలి.
డిపాజిట్‌ దక్కించుకోవడం (లేదా) కోల్పోవడం
దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేసిన అభ్యర్థికి పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్‌ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్‌ కోల్పోయినట్లు.

వ్యయ పరిమితులు
2014 ఎన్నికల్లో ఎలక్షన్‌ కమిషన్‌ జారీచేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి పరిమితులు విధించింది.

పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గంలో రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు.

చిన్న రాష్ట్రాల్లో (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, సిక్కిం) లోక్‌సభ నియోజకవర్గంలో, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.54 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు.

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాలైతే రూ.28 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు.

చిన్న రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో (ఢిల్లీ మినహా) అభ్యర్థులు రూ.20 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement