
సరైన ప్రణాళికతోనే సక్సెస్
అమ్మానాన్న పడుతున్న కష్టం అతనిలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్న సంకల్పం నింపింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కన్నవారిని ఏ లోటూ లేకుండా
అమ్మానాన్న పడుతున్న కష్టం అతనిలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్న సంకల్పం నింపింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కన్నవారిని ఏ లోటూ లేకుండా చూసుకోవాలని పదో తరగతిలోనే నిర్ణయించుకున్నారు. అదే ధ్యేయంతో నిరంతరం శ్రమిస్తూ తొలుత 2006లో టీచర్ ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగిపోకుండా తర్వాత2011లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, 2012లో డిప్యూటీ తహసీల్దార్ కొలువు సొంతం చేసుకున్నారు నల్లగొండ జిల్లాకు చెందిన మందడి నాగార్జున రెడ్డి. ప్రణాళికాబద్ధంగా, ఏకాగ్రతతో చదివితే ఎలాంటి పోటీ పరీక్షలోనైనా సులువుగా విజయం సాధించొచ్చని అంటారాయన.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారికోసం నాగార్జున రెడ్డి సలహాలు..
మాది నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని బోయగూడెం. అమ్మానాన్న వ్యవసాయ పనులు చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి వారు పడే కష్టాన్ని దగ్గర నుంచి చూశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని పదో తరగతిలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నా. టెన్త్ వరకు రాజవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివా. ఇంటర్ తర్వాత టీటీసీ పూర్తిచేశా. ఇంటర్, డిగ్రీ హాలియాలో చదివా. 2006లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. అందులో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)గా సెలెక్ట్ అయ్యా. ఆ ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు సిద్ధమయ్యాను. ఈ క్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అందులో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ సాధించా. 2011లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ఆరో జోన్‌లో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం నిడమనూర్‌లో ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నా.
ప్రామాణిక పుస్తకాలతో..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో మార్కెట్లో ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకొని, వీలైనన్ని ఎక్కువ సార్లు చదవాలి. ఒక సబ్జెక్టు కోసం వేర్వేరు పుస్తకాలు చదవడం వల్ల సమయం వృథా తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ఒకే పుస్తకాన్ని ఎంచుకొని వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. చాప్టర్ల వారీగా ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. అకాడమీ పుస్తకాలు లేదా మార్కెట్లో దొరికే ప్రామాణిక మెటీరియల్‌ను చదవడం మంచిది.
సొంతంగా చదవడమే మేలు
కోచింగ్ తీసుకుంటేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమనే భావన చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. ముందు దీన్నుంచి బయటపడాలి. కోచింగ్ ద్వారా ఏయే అంశాలు, ఎలా చదవాలో తెలుస్తుంది. ప్రస్తుతం పలు పోటీ పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు సొంతంగా, ప్రణాళికాబద్ధంగా చదవడం మంచిది. అలాగే వీలైనన్ని మాక్‌టెస్టులు రాయాలి. వీటిద్వారా తాము ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో గుర్తించి, వాటిపై మరింత దృష్టిసారించాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి.