జీశాట్-7 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం | Successful launch of GSAT-7 | Sakshi
Sakshi News home page

జీశాట్-7 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

Published Thu, Sep 5 2013 3:44 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Successful launch of GSAT-7

 ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు
 
 
 అంతర్జాతీయం


 మలాలాకు పిల్లల శాంతి బహుమతి
 పాకిస్థాన్‌కు చెందిన బాలికల విద్యా ప్రచారకర్త మలాలా.. డచ్ అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి ఎంపికైంది. ఈ అవార్డును నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో సెప్టెంబర్ 6న బహూకరిస్తారు. బాలికల విద్య కోసం పోరాడుతూ ఆమె తాలిబన్ల దాడికి గురై బతికి బయటపడింది. ఈ అవార్డును డచ్‌కు చెందిన ‘కిడ్స్ రైట్స్ ఫౌండేషన్’ 2005లో ప్రారంభించింది. ఈ అవార్డు కింద 1,33,000 డాలర్లు బహూకరిస్తారు. ఈ మొత్తాన్ని బహుమతి పొందినవారు కృషిచేస్తున్న రంగానికి వెచ్చిస్తారు.
 
 
 భూటాన్‌కు రూ. 5,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన భారత్
 భూటాన్‌కు రూ.5000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు భారత్ ఆగస్టు 31న ప్రకటించింది. భారత పర్యటనలో ఉన్న భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉమ్మడి భద్రతా ప్రయోజనాల పట్ల రెండు దేశాలు తమ విశ్వాసం, నమ్మకాలను పునరుద్ఘాటించాయి.
 
 
 అతి భారమైన మూలకం గుర్తింపు
 అతి భారమైన కొత్త మూలకం కనుగొన్నట్లు జర్మనీ శాస్త్రవేత్తలు ఆగస్టు 28న ప్రకటించారు. 115 పరమాణువు సంఖ్యతో పీరియాడిక్ టేబుల్‌లో దీన్ని త్వరలో చేరుస్తారు. జర్మనీలోని జీఎస్‌ఐ పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం కొత్త మూలకం ఉనికిని ధ్రువీకరించింది. దీనికి పేరు పెట్టాల్సి ఉంది.
 
 
 ఐరిష్ కవి సీమస్ హీనీ మృతి
 ప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ అవార్డు గ్రహీత సీమస్ హీనీ (74) డబ్లిన్‌లో ఆగస్టు 30న మరణించారు. 1995లో సాహిత్యంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఆయన రాసిన ‘డెత్ ఆఫ్ ఏ నేచురలిస్టు’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీల్లో కొంతకాలం అధ్యాపకుడిగా కూడా పనిచేశారు.


 
 బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ డేవిస్ ఫ్రోస్ట్ మృతి
 ఒకనాటి ప్రముఖ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్, జర్నలిస్ట్ డేవిడ్ ఫ్రోస్ట్ (74) లండన్‌లో ఆగస్టు 31న మరణించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో ఆయన జరిపిన ఇంటర్వ్యూ సిరీస్‌తో ఫ్రోస్ట్ బాగా ప్రాచుర్యం పొందారు. ఆయన ఆరుగురు బ్రిటిష్ ప్రధానమంత్రులను (1964-2007), ఏడుగురు అమెరికా అధ్యక్షులను (1969-2008) ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.


 
 స్నోడెన్‌కు జర్మనీ విజిల్ బ్లోయర్ ప్రైజ్
 అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (నాసా) కాంట్రాక్టర్‌గా పనిచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు జర్మనీకి చెందిన విజిల్ బ్లోయర్ ప్రైజ్ లభించింది. స్నోడెన్ అమెరికా గ్లోబల్ ఎలక్ట్రానిక్ నిఘా కార్యక్రమాలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. 3900 డాలర్ల ఈ అవార్డును బెర్లిన్‌లో ఆగస్టు 30న స్నోడెన్‌కు బహూకరించారు.
 
 
 జాతీయం
 రాజ్యసభలో కొలీజియం వ్యవస్థ రద్దు బిల్లు
 న్యాయమూర్తుల నియామకాలు చేపట్టే కొలీజియం వ్యవస్థ రద్దుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభలో ఆగస్టు 29న ప్రవేశపెట్టారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం వ్యవస్థ ద్వారా ప్రస్తుతం చేపడుతున్నారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీలను చేపట్టడానికి జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ (జేఏసీ) ఏర్పాటుకు కొత్త బిల్లు వీలు కల్పిస్తుంది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు.
 
 కొత్త బిల్లు వల్ల న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక వర్గం మాట కూడా చెల్లుబాటవుతుంది. బిల్లు ప్రకారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్యానెల్ ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు, న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రముఖ వ్యక్తులను నియమించే కమిటీలో రాజ్యసభ లేదా లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి కూడా సభ్యులుగా ఉంటారు.


 
 లోక్‌సభలో భూ సేకరణ బిల్లుకు ఆమోదం
 భూసేకరణ బిల్లు-2012కు లోక్‌సభ ఆగస్టు 29న ఆమోదం తెలిపింది. 1894 చట్టం స్థానంలో కొత్త బిల్లును తెచ్చారు.
 ప్రధానాంశాలు:
 ప్రజా ప్రయోజనార్థంలో పేర్కొన్న విధంగా భూసేకరణ జరగాలి.
 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభల ఆమోదం లేనిదే భూ సేకరణ జరపరాదు.
 నష్ట పరిహారం మార్కెట్ ధర కంటే గ్రామీణ ప్రాంతాల్లో నాలుగింతలు, పట్టణాల్లో రెండింతలు చెల్లించాలి.
 భూమి సేకరించి ఐదేళ్లు అయినా నష్టపరిహారం చెల్లించకుంటే కొత్త చట్టం వర్తిస్తుంది. -భూసేకరణ పూర్తికాకుంటే కొత్త ప్రక్రియ ప్రకారం జరగాలి.
 ప్రభుత్వ - ప్రైవేటు ప్రాజెక్టులకైతే భూసేకరణ చేయాలంటే 70 శాతం భూ యజమానుల ఆమోదం అవసరం. ప్రైవేటు ప్రాజెక్టులకైతే 80 శాతం భూ యజమానుల ఆమోదం అవసరం.
 పూర్తి మొత్తం చెల్లించనంత వరకు భూ యజమానులను తొలగించేందుకు వీలు లేదు.


 
 భారత జనాభా 2012 మార్చి నాటికి 123 కోట్లు
 భారతదేశ జనాభా మార్చి 1, 2012 నాటికి 123 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా ఆగస్టు 29న రాజ్యసభకు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మార్చి 1, 2011 నాటికి ఉన్న జనాభా 121 కోట్లు. 2011-12లో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి సంఖ్య 27 కోట్లుగా పేర్కొన్నారు. 2004-05లో 37.2 శాతంగా ఉన్న పేదరికం 2011-12 నాటికి 21.9 శాతానికి తగ్గినట్లు మంత్రి తెలిపారు.


 
 ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ
 ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ(56) సెప్టెంబర్ 2న ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటి వరకు జస్టిస్ రమణ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కోర్టుకే ఆయన కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు.


 
 అరవై నిమిషాలకో అతివ ఆహుతి
 వరకట్న సంబంధిత కారణాలతో దేశంలో ప్రతి గంటకూ ఓ మహిళ బలి అవుతున్నట్టు తాజాగా వెల్లడైంది. 2007, 2011 మధ్య కాలంలో ఈ తరహా మరణాలు క్రమంగా పెరిగినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎస్‌సీఆర్‌బీ) గణాంకాలు పేర్కొన్నాయి. 2012లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 8,233 మంది మహిళలు వరకట్న కోరల్లో చిక్కుకుని మృతిచెందినట్టు అవి వెల్లడించాయి.
 
 అంటే ప్రతి అరవై నిమిషాలకూ ఓ మహిళ మరణించినట్టు లెక్క. 2011లో ఈ తరహా మరణాలు 8,618 చోటుచేసుకోగా, నేరనిర్ధారణ రేటు 35.8 శాతం మాత్రమే నమోదైంది. 2012లో ఇది 32 శాతానికి తగ్గడం గమనార్హం. వరకట్న సంబంధిత చావులు 2007, 2011 మధ్య కాలంలో క్రమంగా పెరిగాయి. 2007లో 8,093 మరణాలు చోటుచేసుకోగా, 2008లో 8,172, 2009లో 8,383 మరణాలు సంభవించాయి. 2010లో అవి 8,391గా నమోదయ్యాయి.
 
 నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి
 నిరోధక విధాన దూతగా రాకేశ్ సూద్
 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానంపై తన ప్రత్యేక దూతగా మాజీ రాయబారి రాకేశ్ సూద్‌ను సెప్టెంబర్ 1న నియమించారు. సూద్ గతంలో నేపాల్, అప్ఘానిస్థాన్, ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పనిచేశారు. జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ చర్చల్లో భారత రాయబారిగా వ్యవహరించారు. భద్రత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం, నిరాయుధీకరణ వంటి అంశాలకు సంబంధించి ఆయన దేశ విధానానికి తోడ్పడతారు.
 
 జీశాట్-7 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
 భారత నౌకాదళం కోసం చేపట్టిన జీశాట్-7 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ సైనిక ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్-5 రాకెట్ ద్వారా ఆగస్టు 30న ప్రయోగించారు. దీనికి రుక్మిణిగా పేరు పెట్టారు. ఈ అత్యాధునిక మల్టీబ్యాండ్ జీశాట్-7ను స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో తయారుచేసింది. దీని తయారీకి  రూ. 187 కోట్లు, ప్రయోగానికి  రూ. 480 కోట్లు ఖర్చు చేశారు. దీని బరువు 2625 కిలోలు.
 
 ఈ ఉపగ్రహం దేశ సముద్ర భద్రతకు, నిఘా వ్యవస్థకు గణనీయంగా ఉపయోగపడుతుంది. భారత యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలకు నెట్‌వర్కింగ్ సౌకర్యం కల్పిస్తుంది. ఈ ఉపగ్రహంలో ఉన్న ‘ఎస్’ బాండ్ నౌకలకు కమ్యూనికేషన్ సదుపాయం అందిస్తుంది. ‘కెయు’ బాండ్.. ఆడియో, వీడియోల హైడెన్సిటీ డేటాను అందిస్తుంది. అంతేకాకుండా హిందూ మహా సముద్రంలో 70 శాతం ప్రాంత సమాచారం పొందేందుకు తోడ్పడుతుంది. 2014-15లో ఇస్రో నౌకాదళ రెండో ఉపగ్రహం జీశాట్-7ఏని ప్రయోగించనుంది. యూరోపియన్ లాంచ్ కంపెనీ ‘ఏరియాన్ స్పేస్’ 1981 నుంచి ఇస్రోకు చెందిన 17 ఉపగ్రహాలను ప్రయోగించింది.
 
 
 క్రీడలు
 టి-20ల్లో అరోన్ ఫించ్ రికార్డు
 టీ-20 మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన క్రీడాకారుడిగా ఆస్ట్రేలియాకు చెందిన అరోన్ ఫించ్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో 63 బంతుల్లో 156 పరుగులు చేసి ఫించ్ ఈ ఘనత సాధించాడు. టీ-20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మాత్రం రిచర్డ్ లెవీ (45 బంతుల్లో) పేరిట ఉంది.
 
 ఆసియా కప్ హాకీ విజేత దక్షిణ కొరియా
 ఆసియా కప్ హాకీలో దక్షిణ కొరియాతో సెప్టెంబర్ 1న జరిగిన ఫైనల్లో భారత్ ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. దీంతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌కు ముందే భారత్‌కు సాంకేతికంగా ప్రపంచ కప్ బెర్త్ ఖాయమైంది. కాగా ఆసియా కప్‌లో శ్రీజేష్ (బెస్ట్ గోల్ కీపర్), రఘునాథ్ (బెస్ట్ అవుట్‌స్టాండింగ్ ప్లేయర్)లకు అవార్డులు లభించాయి. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్.. మలేసియాపై గెలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
 
 
 సెపక్‌తక్రాలో భారత్‌కు కాంస్యం
 సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ప్రపంచ సూపర్ సిరీస్ సెపక్‌తక్రా టోర్నమెంట్‌లో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగిన పురుషుల సెమీఫైనల్లో భారత జట్టు.. మలేసియా చేతిలో ఓడిపోయింది. మహిళల విభాగంలో భారత బృందం ఏడో స్థానంలో నిలిచింది.
 
 ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ విజేత
 హైదరాబాద్ హాట్‌షాట్స్
 ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తొలి విజేతగా పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్ నిలిచింది. ఆగస్టు 31న ముంబైలో జరిగిన ఫైనల్‌లో హాట్‌షాట్స్ 3-1తేడాతో అవధ్ వారియర్స్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది.
 
 పురుషుల సింగిల్స్‌ను శ్రీకాంత్ (అవధ్ వారియర్స్) గెలుచుకున్నాడు. ఫైనల్‌లో టనోంగ్‌సక్ (హైదరాబాద్)ను ఓడించాడు. రెండో పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ (హైదరాబాద్), గురు సాయిదత్ (అవధ్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధూ (అవధ్ వారియర్స్)పై సైనా నెహ్వాల్ (హైదరాబాద్) గెలిచింది. పురుషుల డబుల్స్‌లో హాట్‌షాట్స్ జోడి విషెమ్‌గో - లిమ్‌కిమ్ వా, వారియర్స్‌కు చెందిన మార్కస్ కిడో - మథియాస్ బోలను ఓడించారు. టైటిల్ గెలిచిన హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు * 3 కోట్ల 25 ల క్షల ప్రైజ్‌మనీ దక్కింది. అవధ్ వారియర్స్‌కు ఒక కోటి 75 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
 ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్: సైనా నెహ్వాల్
 స్మాషర్ ఆఫ్ ద టోర్నమెంట్: వ్లాదిమిర్ ఇవనోవ్
 
 డైమండ్ లీగ్‌లో బోల్ట్‌కు స్వర్ణం
 జ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఆగస్టు 30న జరిగిన ఈ పోటీలో నికెల్ (జమైకా), జస్టిన్ గాట్లిన్ (అమెరికా) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
 
 ఖేల్త్న్ర అవార్డు అందుకున్న సోధి
 ఆయా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి వన్నె తెచ్చిన ఆటగాళ్లను కేంద్ర ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 31న జరిగిన కార్యక్రమంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేశారు. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్రను షూటర్ రంజన్ సింగ్ సోధి దక్కించుకున్నాడు. సోధికి ఈ అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు, పతకం, మెమొంటో అందజేశారు. వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అర్జున అవార్డుల తో సత్కరించారు. అర్జున దక్కించుకున్న వారికి రూ.5 లక్షల చొప్పున నగదు, మెమొంటో, విగ్రహం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement