
లోక్‌పాల్ లోకాయుక్త
అత్యధిక అధికారం.. అత్యధిక అవినీతికి దారితీస్తుందనే లార్‌డ ఆక్టన్ వ్యాఖ్య.. సమకాలీన భారత సమాజంలో పేరుకుపోయిన అవినీతికి అద్దం పడుతోంది.
అత్యధిక అధికారం.. అత్యధిక అవినీతికి దారితీస్తుందనే లార్‌డ ఆక్టన్ వ్యాఖ్య.. సమకాలీన భారత సమాజంలో పేరుకుపోయిన అవినీతికి అద్దం పడుతోంది. మన దేశంలో ఉన్నత స్థాయిలో జరిగే అవినీతిని అంతం చేసే ఉద్దేశంతో ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం- 1952, సెంట్రల్ విజిలెన్‌స కమిషన్ -1964, అవినీతి నిరోధక చట్టం-1988 వంటి చట్టాలను తీసుకొచ్చారు. అయితే రాజకీయ జోక్యం కారణంగా ఆ చట్టాలేవీ అవినీతిని కట్టడి చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన అత్యంత శక్తిమంతమైన వ్యవస్థలే లోక్‌పాల్, లోకాయుక్తలు.
ఉన్నత స్థాయిలో జరిగే అవినీతిని అరికట్టేందుకు కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, రాష్ర్ట స్థాయిలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1959 నుంచే ఉంది. స్కాండినేవియా దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్‌క, నార్వేల్లో ‘అంబుడ్‌సమన్’ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోంది. స్వీడన్‌లో అంబుడ్‌సమన్ వ్యవస్థ 1809 నుంచి అవినీతి నిరోధానికి పనిచేస్తోంది. ‘అంబుడ్‌సమన్’ అంటే సమస్యలను నివారించే వ్యక్తి అని అర్థం. దీని స్ఫూర్తిగానే భారతదేశంలో 2014, జనవరి 1 నుంచి లోక్‌పాల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
లోక్‌పాల్ నేపథ్యం
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి సి.డి.దేశ్‌ముఖ్ 1959లో తొలిసారి ఈ తరహా వ్యవస్థ కోసం డిమాండ్ చేశారు. ఎల్.ఎం.సింఘ్వి మొదటిసారి లోక్‌పాల్ అనే పదాన్ని పార్లమెంటులో వాడారు. 1968లో పరిపాలనా సంస్కరణల కమిషన్(తొలిసారి) తన మధ్యంతర నివేదికలో లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
ఇందిరాగాంధీ ప్రభుత్వం 1968లో తొలిసారి లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో వీగిపోయింది. తర్వాత కాలంలో లోక్‌పాల్ బిల్లును పదిసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 2013, డిసెంబర్ 18న లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు-2011ను పార్లమెంటు ఆమోదించింది. అనంతరం రాష్ర్టపతి ఆమోదంతో 2014, జనవరి 1 నుంచి లోక్‌పాల్ చట్టం అమల్లోకి వచ్చింది.
చట్టంలో ముఖ్యాంశాలు
నిర్మాణం: లోక్‌పాల్‌లో ఒక చైర్‌పర్సన్, గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు.
అర్హతలు: చైర్‌పర్సన్‌గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రస్తుత/మాజీ ప్రధాన న్యాయమూర్తయి ఉండాలి లేదా భారతరాష్ర్టపతి దృష్టిలో ప్రముఖ న్యాయకోవిదుడై ఉండాలి.
లోక్‌పాల్ సభ్యుల్లో సగం మంది న్యాయ వ్యవస్థకు సంబంధించిన వారై ఉండాలి. వీరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి అర్హతలుండాలి.
సభ్యుల్లో సగం మంది షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. వీరిలో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరి.
పదవీ కాలం: లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు/70 ఏళ్ల వరకు. పదవీ కాలానికి సంబంధించి రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
చైర్‌పర్సన్, సభ్యుల కనీస వయసు 45 సంవత్సరాలు.
ఒకసారి లోక్‌పాల్ సభ్యులుగా కొనసాగినవారు పునర్నియామకానికి అనర్హులు.
జీతభత్యాలు: లోక్‌పాల్ చైర్‌పర్సన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా జీతం లభిస్తుంది.
దర్యాప్తు: లోక్‌పాల్‌కు సొంత దర్యాప్తు - విచారణ విభాగాలు ఉంటాయి.
నియామకం: లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యులను భారత రాష్ర్టపతి నియమిస్తారు. వీరి ఎంపికలో ఐదుగురు సభ్యుల కమిటీ రాష్ర్టపతికి సలహా ఇస్తుంది. కమిటీలోని సభ్యులు..
1. ప్రధానమంత్రి
2. లోక్‌సభ స్పీకర్, 3. లోక్‌సభలో ప్రతిపక్ష నేత
4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
5. ప్రముఖ న్యాయ కోవిదుడు
తొలగింపు: లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యులకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై కనీసం 100 మంది పార్లమెంటు సభ్యులు రాష్ర్టపతికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా సభ్యులపై రాష్ర్టపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి అవినీతి నిరూపితమైతే వారిని తొలగిస్తారు.
అధికార పరిధి
అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలను విచారిస్తుంది.
ప్రధానమంత్రితోపాటు కేంద్ర మంత్రులంతా దీని పరిధిలోకి వస్తారు.
ప్రధానమంత్రిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారించాలంటే లోక్‌పాల్‌లో మెజారిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి.
దేశ భద్రత, అణుశక్తి, అంతరిక్షం, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాల్లో ప్రధానికి మినహాయింపు ఉంటుంది.
లోక్‌పాల్‌కు న్యాయవ్యవస్థపై విచారణాధికారం లేదు.
దర్యాప్తును 60 రోజుల్లో, విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలి.
వివిధ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చు.
దోషులకు గరిష్టంగా పదేళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. లోక్‌పాల్‌కు అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఉంది.
లోక్‌పాల్ ద్వారా నిర్దేశితమైన కేసులకు సంబంధించి సీబీఐతో సహా అన్ని దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం ఉంటుంది.
కొన్ని కేసుల్లో లోక్‌పాల్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
ప్రభుత్వ నిధులు పొందుతున్న సంఘాలు, విదేశాల నుంచి రూ.10 లక్షలకు మించి నిధులు అందుకునే సంస్థలన్నీ లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి.
లోక్‌పాల్ చట్టం కింద నమోదైన కేసుల విషయంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయమని ఆదేశించొచ్చు. ప్రత్యేక కోర్టులు.. ఈ కేసులను సంవత్సరం లోపు విచారించి తీర్పు చెప్పాల్సి ఉంటుంది. తగిన కారణం చూపి ఈ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించొచ్చు. ఈ విధంగా గరిష్టంగా రెండేళ్ల వరకు కొనసాగించొచ్చు.
లోకాయుక్త
రాష్ర్ట స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై వచ్చే అవినీతి ఆరోపణలను లోకాయుక్త విచారిస్తుంది. మొదటి పరిపాలనసంస్కరణల కమిషన్1968లో తన మధ్యంతర నివేదికలో రాష్ర్ట స్థాయిలో లోకాయుక్తను ఏర్పాటు
చేయాలని సూచించింది.
లోక్‌పాల్, లోకాయుక్త చట్టం-2013 ప్రకారం.. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపు అన్ని రాష్ట్రాలు లోకాయుక్తను ఏర్పాటు చేయాలి. ఈ చట్టం కంటే ముందే 1970లో ఒడిశా లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ, ఆ చట్టం ఒడిశాలో 1983 నుంచి మాత్రమే అమల్లోకి వచ్చింది. దాంతో లోకాయుక్తను అమలు చేసిన తొలి రాష్ర్టంగా మహారాష్ర్ట (1971) గుర్తింపు పొందింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983, నవంబర్ 1న ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లోకాయుక్తను ఏర్పాటు చేశారు.
నిర్మాణం: రాష్ర్టంలో లోకాయుక్త, ఉప లోకాయుక్తలు ఉంటారు.
నియామకం: లోకాయుక్త, ఉప లోకాయుక్తలను రాష్ర్ట గవర్నర్ నియమిస్తారు.
వీరి నియామకంలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి నేతృత్వంలోని హైపవర్ కమిటీ సలహా ఇస్తుంది.
ఈ కమిటీలో రాష్ర్ట ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు తదితరులుంటారు.
అర్హతలు: లోకాయుక్తగా నియమితులయ్యేవారు హైకోర్టు ప్రస్తుత లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తయి ఉండాలి.
ఉప లోకాయుక్తకు జిల్లా న్యాయమూర్తి అర్హతలుండాలి.
పదవీ కాలం: వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు/65 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. వీరు పునర్నియామకానికి అనర్హులు.
తొలగింపు: లోకాయుక్త, ఉప లోకాయుక్తలపై వచ్చే అవినీతి ఆరోపణలపై రాష్ర్టపతి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి, దాని ఆధారంగా వారిని తొలగిస్తారు.
అధికార పరిధి: ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని విచారిస్తుంది.
కొన్ని కేసుల్లో తనంత తానుగా జోక్యం చేసుకొని (సుమోటో) విచారణ చేస్తుంది.
ఆరేళ్ల లోపు కేసులను మాత్రమే విచారిస్తుంది.
ఫిర్యాదు చేసే బాధితుడు ఫిర్యాదుతోపాటు రూ.150 డీడీని జతచేయాలి.
లోకాయుక్త విచారణ సందర్భంగా రాష్ర్ట దర్యాప్తు సంఘాల సహకారం తీసుకుంటుంది.
లోకాయుక్త సిఫార్సులు కేవలం సలహా పూర్వకమే.