COMPETITIVE GUIDANCE - GS
సీహెచ్ మోహన్
సీనియర్ ఫ్యాకల్టీ,
ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్,
హైదరాబాద్.
ఫిజిక్స్
ద్రవాలు
బలాలను 2 రకాలుగా వర్గీకరించొచ్చు. అవి..
1.సంసంజన బలాలు: ఒకే రకమైన అణువుల మధ్య ఉన్న ఆకర్షణ బలాలను సంసంజన బలాలు అంటారు.
ఉదా: మనకు లభిస్తున్న ద్రవ పదార్థాల్లో పాదరసం అణువుల మధ్య సంసంజన బలాలు ఎక్కువగా ఉంటాయి. నీరు, ఆల్కహాల్, కిరోసిన్ తదితర ద్రవాల్లో సంసంజన బలాలు తక్కువగా ఉంటాయి.
2.అసంజన బలాలు:
వేర్వేరు అణువుల మధ్య ఉన్న ఆకర్షణ బలాలను అసంజన బలాలు అంటారు. అసంజన బలాల పరిమాణం.. మనం తీసుకొన్న పదార్థాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ద్రవ పదార్థం కింది ధర్మాలను ప్రదర్శిస్తుంది.
1. తలతన్యత
2. కేశనాళికీయత
3. స్నిగ్ధత
4. ద్రవపీడనం
1.
తలతన్యత: ద్రవంలోని ప్రతి ద్రవ అణువు తన చుట్టూ ఉన్న ఇతర ద్రవ అణువులను 10-8 మీటర్ల పరిధిలో సంసంజన బలాల వల్ల తనవైపు ఆకర్షిస్తుంది. కాబట్టి, ఈ పరిధిలోని ద్రావణాలు పరస్పరం ఒకదానికి మరొకటి దగ్గరగా వచ్చి తమని తాము చిన్న ద్రవ బిందువులుగా అమర్చుకుంటాయి. ఈ ధర్మాన్ని తలతన్యత అంటారు. తలతన్యత వల్ల ప్రతి ద్రవ పదార్థం చిన్న ద్రవ బిందువుల వలే ఉండటమే కాకుండా ద్రవ ఉపరితలం సాగదీసిన పొరవలె ప్రవర్తిస్తుంది.
తలతన్యత(T) = బిందువుల ద్రవ అణు వుల మధ్యగల సంసంజన బలాలు (f)/
ద్రవ బిందువు పొడవు (l)
T = f/l
ప్రమాణం: న్యూటన్ /మీటర్ - ఇది అంతర్జాతీయ ప్రమాణం(లేదా) డైన్/సెం.మీ.
ఉదాహరణలు: వర్షపు చినుకులు, పాదరసపు బిందువులు, సబ్బు బుడగలు.. తలతన్యత వల్ల గోళాకారంలో ఉంటాయి.
తల వెంట్రుకలకు నూనెను అద్దినప్పుడు ఆ ద్రవ అణువుల మధ్యగల ఆకర్షణ బలాల వల్ల వెంట్రుకలు ఒకదానికి మరొకటి దగ్గరగా వస్తాయి.
రంగులు వేయడానికి ఉపయోగించే కుంచెను పెయింట్‌లో ముంచి బయటకు తీసినపుడు పెయింట్ అణువుల మధ్యగల ఆకర్షణ బలాల వల్ల కుంచె కేశాలు పరస్పరం దగ్గరగా వస్తాయి.
నిలువ ఉన్న నీటి ఉపరితలం సాగదీసిన పొరవలె ప్రవర్తించడం వల్ల దానిపై దోమలు, ఇతర క్రిమికీటకాలు స్వేచ్ఛగా సంచరిస్తాయి.
ఒక గుండుపిన్నును క్షితిజ సమాంతరంగా నీటి ఉపరితలంపై ఉంచినప్పుడు అది కొంతసేపటి వరకు అలాగే ఉండి తర్వాత క్రమంగా మునిగిపోతుంది. పిన్ను అలాగే ఉండటానికి కారణం తలతన్యత.
ఒక కాగితపు పడవను కర్పూరపు బిళ్లకు కట్టి వాటిని నీటిపైన అమర్చి... కర్పూరపు బిళ్లను మండించినపుడు నీటి ఉపరితలం తలతన్యత తగ్గిపోతుంది. కాబట్టి, ఆ కాగితపు పడవ క్రమరహితంగా తిరుగుతుంది.
రెండు గాజు పలకలను ఒకదానిని మరొకటి తాకుతున్నట్లుగా అమర్చి తక్కువ బలాన్ని ఉపయోగించి వాటిని సులభంగా వేరుచేయొచ్చు. కానీ, ఈ రెండు పలకల మధ్యలో కొన్ని ద్రవ బిందువులను వేస్తే.. విడదీయడానికి ఎక్కువ బలాన్ని ప్రయోగించాలి. దీనికి కారణం తలతన్యత
తలతన్యత మార్పునకు కారణాలు
ద్రవ పదార్థాల్లో మాలిన్య పదార్థాలను కలిపితే తలతన్యత తగ్గుతుంది.
ఉదాహరణ: నిశ్చలంగా ఉన్న నీటిపై కిరోసిన్‌ను వెదజల్లినప్పుడు ఆ నీటి తలతన్యత తగ్గడం వల్ల దాని ఉపరితలం సాగదీసిన పొర స్వభావాన్ని కోల్పోతుంది. అందువల్ల ఆ ఉపరితలంపై ఉన్న దోమలు, ఇతర క్రిమికీటకాలు నీటి లోపలికి మునిగి నశిస్తాయి.
నీటిలో డిటర్జెంట్ పౌడర్‌ను కలిపినప్పుడు ఆ నీటి తలతన్యత తగ్గుతుంది.
ద్రవ పదార్థాలను వేడి చేసినప్పుడు సంసంజన బలాలు తగ్గడం వల్ల వాటి తలతన్యత కూడా తగ్గుతుంది.
ద్రవ పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద తలతన్యత శూన్యం అవుతుంది. ఎందుకంటే సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థాలు వాయువులుగా మారతాయి. వాయువులకు తలతన్యత ఉండదు.
స్పర్శకోణం: ఒక ద్రవ పదార్థం ఘనపదార్థంతో ద్రవం లోపల చేసే కోణాన్ని స్పర్శకోణం అంటారు.
స్పర్శకోణం విలువలు ఆయా ఘన, ద్రవ పదార్థాల స్వభావంపై ఆధారపడి ఉంటాయి.
స్పర్శకోణం మార్పునకు కారణాలు
ద్రవ పదార్థంలో మాలిన్య కణాలను కలిపితే వాటి స్పర్శకోణం పెరుగుతుంది.
ఉదాహరణ: నీటిలో డిటర్జెంట్ పౌడర్‌ను కలిపినప్పుడు దాని స్పర్శకోణం పెరగడం వల్ల బట్టలపై ఉన్న మురికిని సులభంగా తొలగించవచ్చు.
ద్రవాలను వేడి చేసినప్పుడు వాటి స్పర్శకోణం పెరుగుతుంది. అందువల్ల వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న మురికి సులభంగా తొలగిపోతుంది.
2.కేశ నాళికీయత:
వెంట్రుక వాసి మందంగల రంధ్రాన్ని కలిగి ఉన్న ఒక గాజు గొట్టాన్ని కేశనాళికా గొట్టం అం టారు. ఈ గొట్టాన్ని ద్రవంలో ఉంచినప్పుడు... ఆ ద్రవం కేశనాళికా గొట్టంలోని అసలు మట్టంకంటే ఎక్కువ లేదా తక్కువ మట్టంలోకి చేరుతుంది. దీన్నే కేశనాళికీయత అంటారు.
మనకు లభిస్తున్న ద్రవ పదార్థాల్లో పాదరసం తప్ప నీరు, కిరోసిన్, ఆల్కహాల్ వంటివి అసలు మట్టం కంటే ఎక్కువ మట్టంలోకి ఎగబాకుతాయి. కానీ, పాదరసంలో సంసంజన బలాలు ఎక్కువగా ఉండటం వల్ల అది కేశనాళికా గొట్టంలో అసలు మట్టం కంటే తక్కువ మట్టంలోకి చేరుతుంది.
ఉదాహరణ:
కిరోసిన్ స్టౌలో గల వత్తులు, లాంతరులోని వత్తులు, కొవ్వొత్తి... పనిచేయడంలో కేశనాళికీయత అనే ధర్మం ఇమిడి ఉంది.
పెన్ను పాళి ఈ సూత్రం ఆధారంగానే పనిచేస్తుంది.
ఇటుక, స్పాంజ్, చాక్‌పీస్, బ్లాటింగ్ పేపర్, థర్మోకోల్, కాటన్ మొదలైనవి కేశనాళీకీయత వల్ల ద్రవ పదార్థాలను పీల్చు కుంటాయి.
నల్లరేగడి మట్టి లోపల ఉన్న సూక్ష్మ రంధ్రాలు కేశనాళికా గొట్టం వలే ప్రవర్తించడం వల్ల పరిసరాల్లో ఉన్న నీటిని పీల్చు కుంటాయి. కాబట్టి, ఈ నల్లరేగడి మట్టి ఎప్పుడూ తేమగా ఉంటుంది.
నేలను చదునుగా దున్నడం వల్ల అందులోని కేశనాళికా గొట్టాలు నశించిపోయి నీటి ఆవిరి వ్యర్థం కాకుండా అరికట్టవచ్చు.
మన శరీరంలో రక్త సరఫరా జరగడంలో ఈ ధర్మం ఉపయోగపడుతుంది.
ఇసుక ఎడారుల్లో ఒయాసిస్‌లు ఏర్పడడానికి కారణం కేశనాళికీయతే.
మొక్కలు, చెట్ల వేళ్లు పీల్చుకొన్న నీరంతా తనంతట తానుగా పైకి ఎగబాకడానికి కారణం కేశనాళికీయతే.
మాదిరి ప్రశ్నలు
1.పీడనాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం?
1) న్యూటన్/మీ2
2) పాస్కల్
3) బార్
4) పైవన్నీ
2.ఏ ద్రవంలో సంసంజన బలాలు గరిష్టం..?
1) నీరు
2) పాదరసం
3) ఆల్కహాల్
4) కిరోసిన్
3.సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ద్రవం తలతన్యత..?
1) అనంతం
2) శూన్యం
3) కనిష్టం
4)ఎంతైనా ఉండొచ్చు
4.వర్షపు చినుకులు, పాదరస బిందువులు గోళాకారంగా ఉండడానికి కారణం?
1) కేశనాళికీయత
2) స్నిగ్ధత
3) తలతన్యత
4) ద్రవపీడనం
5. ఏ పదార్థంలో స్నిగ్ధతా బలాలు గరిష్టం?
1) తేనె
2) గ్రీజు
3) రక్తం
4) నీరు
6.ఒక కేశనాళిక గొట్టాన్ని భూమిపై నుంచి చంద్రుడిపైకి తీసుకెళ్తే దానిలోని ద్రవ మట్టం?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) మారదు
4) అనంతం
7.స్నిగ్థతా బలం అనేది ప్రవాహిణి ఏ భౌతిక రాశిపై ఆధారపడి ఉంటుంది?
1) ప్రవాహిణి స్వభావం
2) ఉష్ణోగ్రత
3) ప్రవాహిణి
4)ఉపరితల వైశాల్యం
8.ప్లవన సూత్రాలను ఎవరు ప్రతిపాదించారు?
1) న్యూటన్
2) పాస్కల్
3) ఆర్కిమెడిస్
4) బెంజిమిన్ ఫ్రాంక్లిన్
9.శివాలిక్ పర్వతాలపై నీటి మరుగు స్థానం?
1) 1000
2) 1000 కంటే ఎక్కువ
3) 1000 కంటే తక్కువ
4) 00
10.మంచుపై స్కేటింగ్ ఎలా సాధ్యం..?
1) పునర్ ఘనీభవనం
2) పునర్ భాష్పీభవనం
3) పునర్ ద్రవీభవనం
4) పైవన్నీ