గెలుపు కోసం సరికొత్త నాటకం | a new play for the win | Sakshi
Sakshi News home page

గెలుపు కోసం సరికొత్త నాటకం

Published Fri, Mar 28 2014 12:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

a new play for the win

నిడమర్రు, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ నాయకులు కొత్త నాటకానికి తెరదీశారు. ఎంపీపీ అభ్యర్థి మన గ్రామానికే, మన సామాజిక వర్గానికే అంటూ ఊదరగొడుతూ అన్ని గ్రామాల్లో, ఆయా వర్గాలలో ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో, అభిమానులను గ ందరగోళంలోకి నెట్టివేస్తోంది. అంతేకాక ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుందోనని ఇప్పటికే ఆ పదవిని ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
 
ఎంపీపీ అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీ అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమై ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందనే అనుమానంతో అభ్యర్థిని ప్రకటించడానికి జంకుతున్నారని మండలంలో ప్రచారం జరుగుతోంది. నిడమర్రు ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయించారు. ఈ మండలం నుంచి ఎంపీపీ అభ్యర్థిగా వైసీపీ మాత్రం నామినేషన్ రోజే పత్తేపురం ఎంపీటీసీ అభ్యర్థి దివంగత మాజీ మంత్రి, గాంధేయవాది చింతలపాటి మూర్తిరాజు వారసుడు చింతలపాటి పృధ్వీరాజును తమ ఎంపీపీ అభ్యర్ధిగా ప్రకటించి ప్రచారంలో ముందుంది.
 
దీంతో పత్తేపురం గ్రామానికే ఎంపీపీ పదవి కట్టబెడతామంటూ గత రెండు రోజులుగా టీడీపీ కొత్త ప్రచారం మొదలెట్టినట్లు తెలిసింది. అదే ఎంపీటీసీ స్థానంకోసం పోటీపడుతున్న టీడీపీ అభ్యర్ధి పొత్తూరి వెంకటపతిరాజుకే ఎంపీపీ పదవి ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుండగా, మరో మేజర్ గ్రామం అయిన అడవికొలను-1లో టీడీపీ తరుపున నామినేషన్ వేసిన నిమ్మల మాణిక్యాలరావుకే ఎంపీపీ పదవి ఇస్తున్నట్లు ఆగ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు.
 
తీరా విషయం తెలుసుకున్న పత్తేపురం, అడవికొలను గ్రామాల ఓటర్లు, టీడీపీ కార్యర్తలు గందరగోళానికి గురవుతున్నారు. మండలంలోని 14 టీసీలకు ఇప్పటికే 3 టీసీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 11 టీసీలకు టీడీపీ, వైసీపీల మధ్య ద్విముఖ పోటీ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement