ఫిక్సింగ్ బాట
Published Tue, Apr 1 2014 5:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఒకటే లక్ష్యం.. వైఎస్‌ఆర్‌సీపీ దూకుడును అడ్డుకోవాలి. ఓట్లు దండుకోవాలి. అందుకోసం నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు. పార్టీల హద్దులు చెరిపేస్తున్నారు. కుమ్మక్కు రాజకీయాలను జిల్లాల ఎల్లలు దాటించేస్తున్నారు. నైతిక విలువలకు నీళ్లొదిలేస్తున్నారు. పొరుగు జిల్లాలతో లింకున్న ఎంపీ నియోజకవర్గాలు ఈ ఫిక్సింగ్ రాజకీయాలకు అవకాశం కల్పిస్తుండగా.. పార్టీలు నష్టపోయినా ఫర్వాలేదు.. తమ వ్యక్తిగత రాజకీయ అవసరాలు తీరితే చాలన్న రీతిలో కాంగ్రెస్, టీడీపీల నేతలు సార్వత్రిక ఎన్నికల్లో ‘ఒకటి అటు.. ఒకటి ఇటు’ అన్న సిద్ధాంతం అమలుకు లోపాయికారీ ఒప్పందాలకు తెగబడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజకీయ గురువుకు తన ఓట్లను త్యాగం చేసి గురుదక్షిణగా సమర్పించాలని ఒక ఎమ్మెల్యే తెగ తాపత్రయ పడుతుంటే.. తమకు ఎమ్మెల్యే ఓట్లు లభిస్తే చాలు.. ఎంపీ ఓట్లు వేరే పార్టీకి పడినా పర్లేదన్న స్వార్థ రాజకీయం మరో ఇద్దరు సీనియర్ నేతలది. ఫలితంగా కాంగ్రెస్, టీడీపీల మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి. ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు అడ్డుకట్ట వేయలేమని గ్రహించిన ఈ పార్టీల నేతలు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. అందుకే ఎంపీ ఓటు మాకు.. ఎమ్మెల్యే ఓటు మీకు అంటూ పరస్పర అవగాహనకు వస్తున్నారు. పొరుగున ఉన్న విజయనరగం జిల్లా నేతలు ఈ కుత్సిత రాజకీయానికి సూత్రధారులుగా.. జిల్లా నేతలు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు.
గురుదక్షిణ కోసం శిష్యుడి తపన
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు ఈసారి తాను గెలవడం అసాధ్యమన్న నిర్ధారణకు వచ్చేశారు. దాంతో కనీసం తన రాజకీయ గురువు, కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్‌కైనా కొంత మేలు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ఏకంగా టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పావులు కదుపుతున్నారు. కిశోర్‌చంద్ర దేవ్ పోటీ చేయనున్న అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి అయిన కిశోర్‌కు టీడీపీ ఓట్లు పడేలా చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఎంపీ ఓటు కిశోర్‌కు వేయిస్తే.. అందుకు ప్రతిగా కాం గ్రెస్‌కు మిగిలిన కొద్దిపాటి ఓట్లను పాలకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి వేయిస్తానని ఆయన
ప్రతిపాదిస్తున్నారు. ఒక రకంగా తాను రాజకీయంగా ఓడిపోతూ గురువును గెలిపించాలని ఆయన తాపత్రయపడుతున్నారు. ఉద్యోగిగా ఉన్న సుగ్రీవులుకు 2009లో కాంగ్రెస్ టిక్కెట్టు ఇప్పించడంతో కిశోర్ కీలకపాత్ర పోషించారు. అందుకే సుగ్రీవులు ఈ విధంగా గురుదక్షిణ సమర్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే టీడీపీలో కీలక నేతలతో ప్రాథమిక సంప్రదింపులు పూర్తిచేసినట్లు సమచారం. ఇటీవల టీడీపీలో చేరిన సుగ్రీవులు అనుచరులు ఇందుకు సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
అదే బాటలో ఎచ్చెర్ల, రాజాం రాజకీయాలు
మరోవైపు విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాల్లోనూ కుమ్కక్కు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ దిశగా కాంగ్రెస్ కీలక నేత బొత్స సత్యనారాయణ చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన ఇప్పటికే రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతిభా భారతి, కళా వెంకట్రావులతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎంపీ ఓటు తనకు వేయిస్తే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓట్లు టీడీపీకి వేయిస్తానని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందు కు కళా, ప్రతిభా భారతిలు కూడా సానుకూలంగా స్పందిం చినట్లు తెలుస్తోంది. ఎచ్చెర్లలో కళా, రాజాంలో ప్రతిభాభారతి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కొంతవరకైనా పోటీ ఇవ్వాలంటే కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకోకతప్పదని వారు భావిస్తున్నారు. ఉభయతారకంగా ఉండటంలో బొత్స ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
మొదటికే మోసం వస్తుందేమో!
కాగా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలపై టీడీపీ శ్రేణులు తీవ్రం గా మండిపడుతున్నాయి. పార్టీ నేతలు తమ స్వార్థం కోసం చేస్తున ఈ యత్నాల వల్ల మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నాయి. పార్టీకి మిగిలి ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోతుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అదే పరిస్థితి వస్తే ఎన్నికలకు ముందే తమ దారి తాము చేసుకుంటామని తేల్చిచెబుతున్నారు. నేతలు తమ రాజకీయ స్వార్థం చూసుకుంటుంటే... మేమేందుకు గెలిచే పార్టీవైపు వెళ్లకూడదని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు వికటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే దిశగా రాజకీయ పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. మన్ముందు రాజకీయ సమీకరణలు మరింత ఆసక్తికంగా, అనూహ్యంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Advertisement
Advertisement