‘చేతి’కే కంకి కొడవలి! | 'Hand' Kay sickle blade! | Sakshi
Sakshi News home page

‘చేతి’కే కంకి కొడవలి!

Published Tue, Mar 25 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

‘చేతి’కే కంకి కొడవలి!

‘చేతి’కే కంకి కొడవలి!

 గులాబీతో పొత్తుకు సీపీఐ దూరమైనట్లే!

హెదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపు ఖరారైంది. స్థానాల కేటాయింపుపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. వురోవైపు టీఆర్‌ఎస్‌తో సీపీఐ పొత్తుకు దాదాపుగా మార్గాలు మూసుకుపోయాయి. పొత్తు విషయంలో టీఆర్‌ఎస్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా. సోమవారం సీపీఐ నేతలు ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ నేతలతో పొత్తులపై చర్చలు జరిపారు.


తొలుత కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారైందని సమాచారం తెలుసుకున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ కె.కేశవరావు, సభ్యుడు వినోద్‌కుమార్‌ను సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. వారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, నేతలు అజీజ్‌పాషా, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డితో మంతనాలు జరిపారు. కానీ, ఈ చర్చల్లో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. సీపీఐ నేతల ప్రతిపాదనలపై కేసీఆర్‌తో మాట్లాడి చెబుతామని కేకే, వినోద్ వెల్లడించారు. దీంతో టీఆర్‌ఎస్ తీరుపై సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రతిపాదనలపై 24 గంటల్లో తేల్చాలని, లేనిపక్షంలో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ భేటీ అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నేతలు పొత్తుపై పాతపాటే పాడారు తప్ప ఏమీ తేల్చలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.


 పొన్నాలతో రహస్య భేటీ!: అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు సిద్ధమయ్యారు. కానీ అప్పటికే టీఆర్‌ఎస్ నేతలు సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రావడంతో.. వారు వెళ్లిపోయిన అనంతరం నారాయణ, పొన్నాల రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. సీపీఐ నేతలు రెండు ఎంపీ, 17 అసెంబ్లీ స్థానాలను కోరారు. ఒక ఎంపీ, 12 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు పొన్నాల అంగీకారం తెలిపారు. అయితే, ఎంపీ సీట్ల వ్యవహారాన్ని అధిష్టానం చూస్తోందని, సీపీఐ కోరుతున్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు ఉండటంతో మరోసారి చర్చించుకుందామని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయని, రెండు సీట్లు ఎక్కువ ఇచ్చేందుకు వెనుకాడొద్దని నారాయణ పేర్కొన్నట్లు తెలిసింది.
 

Advertisement
Advertisement