
హవాలా మార్గంలో ఎన్నికల నగదు?
శంషాబాద్ వద్ద రూ.8.18 కోట్లు స్వాధీనం
{sావెల్స్ బస్సుల్లో బెంగళూరు నుంచి తీసుకొస్తూ పట్టుబడ్డ ఇద్దరు నిందితులు
ఎన్నికల కోసమే అని అనుమానిస్తున్న పోలీసులు
బులియన్ మార్కెట్ కోసం అంటున్న నిందితులు
సైబరాబాద్, సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి హవాలా రూపంలో హైదరాబాద్‌కు నగదు తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా బెంగళూరు నుంచి ప్రైవేటు బస్సుల్లో నగదు తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఉదయం శంషాబాద్ మండలం పాల్మాకుల వద్ద పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.8.18 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. ఎన్నికల అధికారి ముస్తాక్ అహ్మద్, ఆదాయ పన్ను అధికారి నవీన్‌లతో కలసి వివరాలను వెల్లడించారు. ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం... బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో పెద్దమొత్తంలో నగదు తరలిస్తున్నారంటూ శుక్రవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. శంషాబాద్ పాల్మాకుల ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. 6.30 గంటల సమయంలో హెచ్‌కేబీ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను (ఏపీ 29 వీ-5789, కేఏ 01 ఏబీ-2732) సోదా చేయగా, ప్రశాంత్ జితేందర్ సూరాయా(32), దర్శన్(22) అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వెంటనే వారివద్దనున్న బ్యాగ్‌లు తెరచి చూడగా, రూ.వెయ్యి, రూ.500 డినామినేషన్‌లో ఉన్న నోట్లకట్టలు కనపడ్డాయి. వారిద్దరినీ తనిఖీ చేయగా, ఓ డైరీ దొరికింది. ఏ బ్యాగ్‌లో ఎంత మొత్తం ఉందో అందులో రాసి ఉంది. దాని ఆధారంగా ఆ బ్యాగుల్లో రూ.8.18 కోట్లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం వారిని విచారించి కాచిగూడలో వారు నివసిస్తున్న ప్రశాంత్ నెస్ట్ అపార్ట్‌మెంట్‌లో మరోసారి సోదాలు చేశారు. అక్కడ మరో రూ.14.50 లక్షలు, నోట్ల కట్టలను లెక్కించే యంత్రాలు దొరికాయి. బషీర్‌బాగ్‌లోని ఎంబీఎస్ జ్యూవెలర్స్ యజమాని అనురాగ్ గుప్తా కోసం హవాలా రూపంలో బెంగళూరు నుంచి ఈ నగదు తీసుకొచ్చినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు. బెంగళూరులోని హోటల్ ఫార్చూన్‌లో విజయ్ అనే వ్యక్తిని గురువారం సాయంత్రం కలిశామని, గుప్తా ఇచ్చిన కోడ్‌ను అతడికి చెప్పడంతో తమకు రూ.8.18 కోట్లు ఇచ్చాడని వివరించారు. కొద్ది రోజుల కిందటే గుప్తాకు హవాలా మార్గంలో రూ.4 కోట్లు తీసుకొచ్చి ఇచ్చినట్టు చెప్పారు. హవాలా రూపంలో నగదును సరఫరా చేసేందుకు లక్షకు రూ.300 కమిషన్‌గా తీసుకుంటామని వెల్లడించారు. వారి సెల్‌ఫోన్లను పరిశీలించిన పోలీసులు.. అనురాగ్ గుప్తా కోసమే ఈ నగదు తీసుకొస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. అయితే గుప్తా పోలీసులకు చిక్కకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్టు సీవీ ఆనంద్ ప్రకటించారు. నిందితుల వద్ద దొరికిన నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో 171ఈ, 171బి, 102 రెడ్ విత్ 41 సీఆర్‌పీసీ, ఆర్పీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బంగారం బులియన్ మార్కెట్ కోసమే...
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ నగదును హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ కోణంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసు అధికారులు తెలిపారు. బంగారం లావాదేవీలు జరిపే బులియన్ మార్కెట్ కోసమే ఈ నగదు తీసుకొచ్చినట్టు నిందితులు విలేకరులతో పేర్కొన్నారు. ఈ నగదు ఎన్నికల కోసమనే విషయం తమకు తెలియదని చెప్పారు.
గుప్తా దొరికితే అసలు నిజం బయటపడుతుంది..
అనురాగ్ గుప్తా దొరికితే ఈ నగదు రవాణాలో మరికొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో నగదు ఇచ్చిన విజయ్ వెనుక ఎవరు ఉన్నారో, ఈ డబ్బుకు ప్రత్యామ్నాయంగా బెంగళూరులో ఏమి ఇచ్చారో తదితర వివరాలు బయటపడతాయని అంటున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఈ నగదును ప్రభుత్వ ట్రెజరీకి అప్పగించడంతోపాటు అనురాగ్ గుప్తా, విజయ్‌ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఆనంద్ వెల్లడించారు.