సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు దక్షిణ నియోజక వర్గమంతా ‘ఆధార్’ చుట్టూనే పరిభ్రమిస్తోంది. మొన్నటి దాకా ఆధార్ చైర్మన్‌గా వ్యవహరించిన నందన్ నిలేకని ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థిగా వరుసగా ఐదు సార్లు గెలుపొందిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ పొందడానికి ఆధార్‌ను నిర్బంధం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో అనంత కుమార్ ఆ ప్రాజెక్టుపై విమర్శలను తీవ్రతరం చేశారు. మంగళవారం సాయంత్రం నగరంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆధార్‌ను రద్దు చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగమైందని ఆరోపించారు.
ఈసీ, పీసీలకు ఫిర్యాదు
మరో వైపు నందన్ నిలేకని అనంత్ కుమార్‌పై ఎన్నికల కమిషన్, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆధార్‌ను వ్యతిరేకిస్తున్న అనంత కుమార్ కొన్ని నెలల కిందటి వరకు దానిని ప్రమోట్ చేశారని ఆరోపించారు. ఆధార్ కింద పేర్ల నమోదుకు కేంద్రాలను ఏర్పాటు చేశామంటూ నియోజక వర్గం వ్యాప్తంగా ఆయన పేరిట బ్యానర్లను కట్టించారని తెలిపారు. నేర పరిశోధన సందర్భంగా వ్యక్తుల సమాచారాన్ని ఆయా ఏజెన్సీలకు అందివ్వలేమంటూ యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా) చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు సోమవారం సమర్థించిందని గుర్తు చేశారు. పౌరుల గోప్యతను కాపాడడానికి యూఐడీఏఐ కోర్టులకెళ్లిందని గుర్తు చేశారు. వాస్తవం ఇలా ఉంటే అనంత కుమార్ వదంతులను వ్యాపింపజేయడంలో నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. ఐదు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అనంత కుమార్ ఇప్పటి వరకు నియోజక వర్గానికి చేసిందంటూ ఏమీ లేదని, ఇప్పుడు కూడా పూర్తిగా నరేంద్ర మోడీ ఆకర్షణపై ఆధారపడి ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
నిలేకని x అనంత్
Published Wed, Mar 26 2014 5:03 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement