మే12న మున్సిపల్ ఓట్ల లెక్కింపు మరుసటి రోజే ప్రాదేశికం
సాక్షి,మహబూబ్‌నగర్: గత కొద్ది రోజులుగా ఎప్పుడేప్పుడానని...ఉత్కంఠతతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మున్సిపల్, పరిషత్ ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తెర దించుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 12న మున్సిపల్, మరుసటి రోజైన 13న పరిషత్ ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించి, అదేరోజు ఫలితాలు వెల్లడించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా స్థానిక ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగిపడే ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఊరట కలిగినట్లయింది.
సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాతనే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని కొందరు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపును నిలిపి వేసిన విషయం తెల్సిందే. సాధారణ ఎన్నికలు తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 30న జరుగుతుండటంతో..సీమాంధ్రలో మే 7న జరుగనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాధారణ ఎన్నికల పక్రియ మే11 వరకు ముగుస్తుండటం వల్లనే...మే12,13 తేదీల్లో మున్సిపల్, పరిషత్ ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
20 రోజులుగా ఎదురు చూపులతో...
జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలు,మూడు నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరుగగా....75.05 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, అయిజ, కల్వకుర్తి, నాగరుకర్నూల్, షాద్‌నగర్‌లలోని 206 వార్డులకు ఎన్నికలు జరుగగా, 1182 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి పోటీ చేశారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు.ఈ అభ్యర్థులు తమ అదృష్టాలను పరీక్షించుకొవటానికి గత 20 రోజులకు పైగా తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
అదే విధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను జిల్లాలో రెండు విడతలుగా నిర్వహించారు. తొలి విడతగా ఈనెల 6న నాగరుకర్నూల్ పార్లమెంటు నియోజక వర్గంలోని 35 మండలాల పరిధిలో ఉన్న 35 జెడ్పీటీసీ, 512ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ...79.13శాతం పోలింగ్ నమోదు అయింది. ఈఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు 141 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ స్థానాలకు 1593 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో విడతగా ఈ నెల 11 న మహబూబ్‌నగర్ పార్లమెంటులోని 29 మండలాల పరిధిలోని 29 జెడ్పీటీసీ స్థానాలు, 468 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నకలు జరుగగా.. 77.16 శాతం పోలింగ్ నమోదు అయింది.
153 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 1779 ఎంపీటీసీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. పోటిలో ఉన్న ఈ అభ్యర్థులంతా ఓట్ల లెక్కింపు కోసం గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఖరారు చేయకుండా వాయిదా వేస్తున్న ఎన్నికల సంఘం ఎట్టకేలకు సోమవారం స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థుల ఉత్కంఠకు తెర తొలిగినట్లయింది.