ముంచింది నిర్లక్ష్యమే..!
- ఓటమిపై జిల్లా కాంగ్రెస్ నేతల పోస్ట్‌మార్టం
- స్వయంకృతాపరాధం..
- కారు స్పీడే కారణం
- టీపీసీసీకి డీసీసీ నివేదిక
సాక్షి, మహబూబ్‌నగర్: అధికార పక్షం కాంగ్రెస్ జిల్లాలో ఆశిం చిన స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, విభేదాలే కొంపముంచాయనే అభిప్రాయానికి వచ్చారు. అందువల్లే జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు రెండోస్థానం లభించిందని.. కొన్నిచోట్ల స్వల్పఓట్ల మెజార్టీతోనే ఓడిపోయామని నివేదికలో జిల్లా కమిటీ పేర్కొంది. మరికొన్ని నియోజకవర్గాల్లోనైతే చివరివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం వంటి విషయాలు కూడా నష్టాన్ని కలుగజేశాయని వివరించింది.
2009 ఎన్నికల్లో ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత ఎన్నికల్లో కంటే ఒక సెంబ్లీ స్థానాన్ని అదనంగా సాధించుకున్నప్పటికీ.. చేరుకోవాల్సిన లక్ష్యాన్ని అధిగమించలేకపోయామని నివేదికలో పేర్కొంది. కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లో మూడోస్థానం, మహబూబ్‌నగర్‌లో నాలుగోస్థానానికి పార్టీ పడిపోవడానికి అనేక కారణాలను విశ్లేషించింది.
నియోజకవర్గాల వారీగా..
మహబూబ్‌నగర్‌లో చివరివరకు అభ్యర్థి ఎంపికలో అధిష్టానవర్గం అవలంభించిన ఊగిసలాట ధోరణి, కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన ఒక నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం వంటి విషయాల నేపథ్యంలోనే నాలుగో స్థానంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లినట్లు తేల్చింది.
- నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పార్టీకి చెందిన కొందరు నాయకులు పలు ప్రలోభాలకు తలొగ్గి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కొంత నష్టం కలిగించిందని పేర్కొంది. కల్వకుర్తి నియోజకర్గంలో ఓ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించకపోవడం తీవ్రఇబ్బందికి గురిచేసినట్లు ప్రస్తావించారు.
- షాద్‌నగర్, జడ్చర్ల, కొల్లాపూర్, దేవరకద్ర, అచ్చంపేట నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గాలి బాగా వీయడం కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. నారాయణపేటలో కొత్త వారికి టికెట్ ఇవ్వడం వల్ల మొదటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారు సహాయ నిరాకరణ చేయడంతో ఇక్కడ ఓడిపోయినట్లు వివరించారు.
- కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని టీఆర్‌ఎస్ బరిలో నిలపడం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని నాయకులు పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు పార్టీ నుంచి వలస వెళ్లినప్పుడు కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులను ఆ నియోజకవర్గంలో కాపాడుకోవడంలో విఫలమవడం వంటి అంశాలు తీవ్రనష్టానికి గురిచేసినట్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో చతికిలపడిన టీడీపీ గెలుపొందిందని ఆ నివేదికలో పీసీసీ ఆవేదన వ్యక్తం చేసింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ తరువాత కారణాల నేపథ్యంలోనే తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొంది. ఈ గుణపాఠాల వెల్లువలో జిల్లాలో కాంగ్రెస్‌ను సంస్థాగతపరంగా భవిష్యత్‌లో మరింత పటిష్టం చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగుతామని ఆ నివేదికలో డీసీసీ వివరించింది.