సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే ఘట్టం బుధవారం ముగియనుంది. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరించుకోవడానికి శనివారం వరకు గడువు ఉంటుంది. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి జేడీఎస్ అభ్యర్థిగా చిక్కబళ్లాపురంలో నామినేషన్ వేయనున్నారు.
బీజేపీ అభ్యర్థులుగా బీ. శ్రీరాములు (బళ్లారి), శోభా కరంద్లాజె (ఉడిపి-చిక్కమగళూరు), భగవంత్ ఖుబా (బీదర్), శివన్న గౌడ నాయక్ (రాయచూరు), జీఎం. సిద్ధేశ్వర్ (దావణగెరె), బీఎన్. బచ్చేగౌడ (చిక్కబళ్లాపురం), మునిరాజు గౌడ (బెంగళూరు గ్రామీణ), ఏఆర్. కృ్ణమూర్తి (చామరాజ నగర)లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా జేడీఎస్ అధినేత హెచ్‌డీ. దేవెగౌడ మంగళవారం హాసనలో నామినేషన్ వేశారు. బెంగళూరు ఉత్తర నియోజక వర్గానికి ఆ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ అజీం నామినేషన్‌ను సమర్పించారు. మండ్యలో బీజేపీ అభ్యర్థిగా రాష్ర్ట ఒక్కలిగుల సంఘం ఉపాధ్యక్షుడు బీ. శివలింగయ్య నామినేషన్ దాఖలు చేశారు.
ఆటో డ్రైవర్ నామినేషన్
బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గానికి కన్నడ చళువళి వాటాళ్ పక్ష అభ్యర్థిగా ఆటో డ్రైవర్ మంజునాథ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశాడు. అంతకు ముందు వాటాళ్ నాగరాజ్ ఆటో డ్రైవర్ లాగా ఖాకీ చొక్కా ధరించి మంజునాథ్ ఆటోలో బీబీఎంపీ కార్యాలయానికి వచ్చారు.
నేడే ఆఖరు
Published Wed, Mar 26 2014 5:00 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
Advertisement