
అదొక మామిడి చెట్టు. ఆకు కనిపించకుండా కాయలు విరగ్గాశాయి. దాని యజమాని చెట్టు నుండి పండిన కొన్ని కాయలు కోసుకుపోయాడు. అందరి దృష్టీ వాటి మీద పడింది. తలా కొన్ని కాయలు కోసుకుపోతున్నారు. కొన్ని కాయలు పండి నేలమీద పడుతున్నాయి. వాటిలో ఒక కాయ మాత్రం బాగా పిరికిది. ఆ పిరికి కాయ ఆకుల గుబుర్ల మాటున దాక్కుని అలానే ఉండిపోయింది. తన సహచరులందరూ దూరం అవడంతో గాభరా పడసాగింది. అలాగని తనంతట తాను పండి నేలమీద పడడం కానీ, ఎవరి కంటా పడడం కానీ ఇష్టం లేదు. దాంతో చెట్టుకే అతుక్కుపోయింది. తన మీద తనకు ఉన్న ‘మోహం’ దానిని బయటపడనివ్వలేదు.
కానీ కాలం ఊరుకుంటుందా? కాయ కుళ్లి, అందులో పురుగులు పడ్డాయి. అలా చెట్టుకు ఉండగానే దానిని తినేయసాగాయి. అలా మరికొంత కాలం గడిచింది. చెట్టుకే ఎండి, మరింతగా అతుక్కుపోయింది ఆ పిరికి మామిడి. ఒకరోజు బాగా వేగంగా వీచిన గాలి, ఎండిన ఆకులతో సహా దీనిని కూడా తెంచి పక్కనే ఉన్న మురికి గుంటలో పడేసింది. అప్పుడు కానీ దానికి అర్థం కాలేదు తాను ఎందుకూ పనికి రాకుండా పోవడానికి తనలో దాగి ఉన్న మోహమే కారణమని.
– డి.వి.ఆర్.