30 రోజుల్లో 1400 మైళ్లు పరుగెత్తింది!
రోజుకు దాదాపు 50 మైళ్లు... అలా 32 రోజులు. మొత్తంగా 1,460 మైళ్ల దూరం! అది కూడా సఫారీల మధ్యన.. అటవీ జంతువులకు ఆవాసమైన దక్షిణాఫ్రికాలోని కొండలు, గుట్టలతో ఉన్న అడవుల మధ్య. పైగా ఈ సాహసం చేసిందేమీ పడచు పిల్ల కాదు, 52 యేళ్ల నడివయస్కురాలు!
అంతటి సాహసం చేసింది... మిమి అండర్సన్. ఈ పరుగును ఆమె తన ప్రతిభను చాటుకోవడానికి కాదు... ఒక సంక్షేమ కార్యానికి నిధులు సమకూర్చడం కోసం పూర్తి చేసింది. తమ దేశమైన దక్షిణాఫ్రికాలో వివక్షకు గురి అవుతున్న మహిళల, బాలికల సంరక్షణార్థం నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన మిమి విజయవంతంగా 22 వేల పౌండ్ల నిధిని సేకరించగలిగింది. మిమీది అనేక రేసుల్లో పాల్గొని, ఛాంపియన్‌గా నిలిచిన నేపథ్యం. దాంతో ఆమె తన ప్రతిభా సామర్థ్యాలను మహిళా సంక్షేమం కోసం వెచ్చించాలనుకుంది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా భారీ మారథాన్‌కు శ్రీకారం చుట్టింది.
మారథాన్‌ను మొదలు పెట్టడానికి ముందు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది మిమీ. అందులో తన ప్రయాణం గురించి వివరిస్తూ విరాళాలను కోరింది. పీటర్‌మారిట్జ్‌బర్గ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కేప్‌టౌన్ సమీపంలోని పార్ల్‌లో తన మారథాన్‌కు ముగింపును ఇచ్చింది మిమి. ఈ ప్రయాణంలో మిమి పడ్డ కష్టాలు అలాంటిలాంటివి కాదు... చెట్లు, చేమలు, కొండలతో నిండి ఉన్న ఈ అటవీప్రాంతంలో పరిగెత్తడం మామూలు మాటలు కాదు.. అందులోనూ ఒకటి కాదు రెండు కాదు... రోజుకు సుమారు 50 మైళ్ల దూరం పరుగెత్తింది మిమి. సముద్రమట్టానికి కొన్ని వందల, వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో పరుగు పెట్టడం అంత సులభం కాదని.. అయితే ఒక మంచి పని కోసం కష్టపడుతున్నాననే భావన కొండంత స్థైర్యాన్ని ఇచ్చిందని సంతోషంగా చెప్పింది. దటీజ్ మిమి.