స్పందనకు వయసుతో సంబంధం లేదు... ఆకాశంలోని అందమైన హరివిల్లును చూసి ఆనందించడానికి, నెలవంక అందం గురించి అలవోకగా చెప్పడానికి వయసుతో సంబంధం లేదు! కానీ వాటికి అక్షరరూపం ఇవ్వడానికి అనుభవంతో కూడిన వయసుండాలి... అయితే, భావాలను వ్యక్తీకరించడానికి వయసుతో పనిలేదు, భాషపై తీవ్రమైన కసరత్తు చేయనక్కర్లేదు... ఆలోచన ఉంటే చాలు భావాన్ని అక్షరాల్లో వ్యక్తీకరించవచ్చు... అని అంటుందామె. అందుకు తగ్గట్టుగా 16 యేళ్ల వయసుకే 16 కథలతో ‘డియర్ డైరీ’ పేరుతో ఒక సంకలనం తెచ్చింది. ఇంగ్లిష్‌లో రచనలు సాగించిన ఆ తెలుగమ్మాయి పేరు వైష్ణవి మాగంటి. హైదరాబాద్‌లోని ఒక స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న వైష్ణవి రచనా శైలిని మెచ్చి పెంగ్విన్ ర్యాండమ్‌హౌస్ అనే ప్రసిద్ధ పబ్లిషర్‌లు కథలను ప్రచురించారు. అమెజాన్‌డాట్‌కామ్ వంటి సైట్లో కూడా ఆ పుస్తకం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వైష్ణవితో ఇంటర్వ్యూ...
తొలిసారిగా రచయిత్రిగా పేరును అచ్చురూపంలో చూసుకొన్నప్పుడు ఏమనిపించింది?!
వైష్ణవి: నిజంగా కళ్ల నుంచి నీళ్లొచ్చేశాయి. ఫస్ట్ కాపీని చూడగానే భావోద్వేగాలకు లోనయ్యాను. చెల్లెలు జాహ్నవిని గట్టిగా హగ్ చేసుకొని ఆనందాన్ని పంచుకొన్నాను. అదంతా కొద్దిసేపే.. తర్వాత మామూలే. ఆనందమైనా, బాధ అయినా కొద్దిసేపే!
రచయిత్రి కావడానికి స్ఫూర్తి ఏమిటి?!
వైష్ణవి: నీకు నచ్చింది చెయ్యి... నీ డ్రీమ్స్‌ను ఫాలో అవ్వు... అంటూ అమ్మానాన్నలు జయశ్రీ, బలరాంలు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను రచనావ్యాసంగం వైపు నడిపించింది. చిన్నప్పటి నుంచి చాలా చిన్న సంఘటనకైనా భావోద్వేగ పూరితంగా స్పందించడం అలవాటు. చిన్న చిన్న అనుభవాలను కూడా ప్రత్యేకంగా చూడటమే నన్ను రచయిత్రిని చేసింది.
తొలి రచన ఎప్పుడు చేశారు?
వైష్ణవి: ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే రాయడం అలవాటు. నాకున్న ఇమాజినేషన్‌తో డిటెక్టివ్, మిస్టరీ కథలను రాసే దాన్ని... అయితే వాటికి పేర్లు మాత్రం పెట్టేదాన్ని కాదు.
రాసిన వాటిని ఎలా భద్రం చేసేవారు?
వైష్ణవి: ఇంతవరకూ కథలేవీ పబ్లిష్ కాలేదు. మామయ్య బహుమతిగా ఇచ్చిన పెన్‌తో రాయడం, ఇంట్లో వాళ్లకు చూపించడం... వాళ్లే నా కథలకు పాఠకులు. జాహ్నవి వాటిని టైప్ చేసి పెట్టేది.
ఇప్పటివరకూ ఎన్నికథలు రాశారు? అచ్చువేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
వైష్ణవి: చాలానే రాశాను. రాసిన వాటిలో బెస్ట్ 16ని తీసుకొని పుస్తకంగా తీసుకురావాలని అనుకొన్నాను. ఆ పదహారే ఎందుకంటే.. ఇప్పుడు నా వయసు 16. పుస్తకాన్ని చిరకాల జ్ఞాపకంగా మార్చుకోవడానికి అలా చేశాను. నా కథలను పబ్లిష్ చేయాలన్న ఆలోచన కూడా ఎన్నో రోజులుగా ఉన్నదే. అయితే అది చాలా కష్టంతో కూడుకొన్నది అనుకొన్నాను. కానీ ఇంత సులభంగా సాధ్యమవుతుందని అనుకోలేదు!
మరి అంత సులభంగా పబ్లిషర్స్ ఎలా దొరికారు?!
వైష్ణవి: ఆన్‌లైన్‌లో ఆ పబ్లిషర్ల గురించి తెలుసుకొని మెయిల్ ద్వారా సంప్రదించాను. వారి నుంచి ఫోన్ వచ్చింది. నా కథల గురించి వివరించాను. రాతప్రతులను పంపితే ఓకే చేశారు. పబ్లిష్ చేసి పుస్తకం నా చేతిలో పెట్టారు! కేవలం రెండు నెలల్లోనే మొత్తం పని పూర్తి అయ్యింది.
మీ పుస్తకం అమెజాన్‌డాట్‌కామ్‌లో కూడా అమ్మకానికి ఉంచారు కదా, ఏమనిపించింది?!
వైష్ణవి: పెద్ద పెద్ద రచయితల పుస్తకాలను అమ్మకానికి ఉంచే అమెజాన్‌లో నా బుక్ ఉందనేది చాలా గ్రేట్ ఫీలింగ్. ఈ వయసులో చాలా తక్కువ మందికే ఇది సాధ్యం అవుతుందని అందరూ పొగిడేస్తున్నారు. వింటున్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కానీ గర్వం మాత్రం లేదు...
‘డియర్‌డైరీ’ అనే పేరెందుకు పెట్టారు?
వైష్ణవి: నాకు ఇష్టంగా రాసుకొన్న డైరీ లాంటివి ఈ కథలన్నీ. అందుకే ఆ పేరు.
ఈ కథలన్నింటిలో మీకు బాగా ఇష్టమైనది?
వైష్ణవి: అమ్మ గురించి రాసిన ‘మై హ్యాపీ మీల్’. అలాగే అమ్మమ్మ, తాతయ్యల గురించి రాసిన ‘ద నోట్’ నాకు బాగా ఇష్టం.
కథలేనా? కవితలూ ఇంకా ఏమైనా రాస్తుంటారా?
వైష్ణవి: ‘హార్ట్‌ఫాంట్’ పేరుతో ఒక బ్లాగ్ ఉంది. అందులో కోట్స్, కవిత్వం, నా ఆలోచనల గురించి రాస్తుంటాను..
పుస్తకాలు బాగా చదువుతారా? ఇష్టమైన రచయిత ఎవరు?
వైష్ణవి: రచయితలు నికోలస్ స్పార్క్, జేకే రౌలింగ్, చేతన్ భగత్...లు బాగా ఇష్టం. మిస్టరీ, రొమాన్స్, ఫిక్షన్ బాగా ఇష్టంగా చదువుతాను.
రాయడానికి ప్రత్యేకమైన మూడ్ అవసరమా?!
వైష్ణవి: కచ్చితంగా... మంచి వాతావరణంలో మనసు స్వేచ్ఛగా స్పందిస్తుంది. అలాంటప్పుడు నాలోని భావాలు స్వచ్ఛంగా, సహజంగా జనిస్తాయి.
రచయిత్రిగా స్థిరపడే ఉద్దేశం ఉందా?!
వైష్ణవి: రాయాలనే ఉద్దేశం కన్నా ముందు రాసే శక్తి ఉందని భావిస్తున్నాను. పాఠకుడితో కనెక్ట్ అయ్యేలా భావాలు పలికించే శక్తి నాకు ఉందనే ఆత్మవిశ్వాసం ఉంది. పూర్తిస్థాయి రచయిత్రిగా స్థిరపడటానికి అదే నా ప్లస్ పాయింట్!
- జీవన్‌రెడ్డి.బి