టెడ్డీబేర్.. చిన్నారులకు అత్యంత ఇష్టమైన ఆటబొమ్మ. నిద్రలో కూడా టెడ్డీబేర్‌ను కౌగిలించుకొని పడుకోవడం చాలా మంది చిన్నారులు చేసే పని. అయితే వయసు పెరిగేకొద్దీ టెడ్డీబేర్ మీద ప్రేమాభిమానులు తగ్గిపోతాయి.. బేర్‌ను కేర్ చేయని రోజులు వచ్చేస్తాయి.. అనే భావనలున్నాయి. కానీ అది నిజం కాదు. ఆడుకొనే వయసు దాటిపోయినా.. టెడ్డీలపై ప్రేమాభిమానాలు ఏ మాత్రం తగ్గవు.. వాటి పేరుమీద సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లలో అకౌంట్ క్రియేట్ చేసేంత స్థాయికి చేరతాయి అని అంటున్నారు యూకేకు చెందిన పరిశీలకులు.
ఒక పరిశీలన ప్రకారం యూకే పరిధిలో దాదాపు 25 లక్షల టెడ్డీబేర్‌లకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నట్టు తేలింది! టెడ్డీబేర్‌లకు ఫేస్‌బుక్ అకౌంట్ ఏంటి? అని ఆరాతీస్తే.. చాలామంది యువతీ యువకులు చిన్ననాటి నుంచి తమతో పాటు ఉన్న టెడ్డీల పేరిట ఫేస్‌బుక్ ఖాతాలు నడుపుతున్నారట! వాటిపై ఆ విధంగా తమ అభిమానాన్ని చాటుకొంటున్నారట. బ్రిటన్ జనాభా, అక్కడి ఫేస్‌బుక్ యూజర్లతో పోల్చినప్పుడు 25 లక్షల టెడ్డీలకు ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్లు ఉండటం అంటే చాలా గొప్ప విషయం.
ఆ బొమ్మలకు తాము ముద్దుగా పెట్టుకొన్న పేర్లతోనే సోషల్‌నెట్‌వర్కింగ్‌సైట్లలో అకౌంట్లు తెరిచి.. వాటి ఫోటోలను పెట్టి.. వాటిపై ప్రేమను ప్రకటించుకొంటూ తమ ముచ్చట తీర్చుకొంటున్నారట బ్రిటిషర్లు. ఇక టెడ్డీల అకౌంట్ల ఫ్రెండ్స్‌లిస్ట్‌కేమీ కొదవ లేదు. ఎలాగూ 25 లక్షల టెడ్డీలు సోషల్ నెట్‌వర్కింగ్ సామ్రాజ్యంలో స్థానం సంపాదించాయి కాబట్టి.. వాటి ఓనర్లు ఒకదానితో మరోదాన్ని జత చేస్తున్నారు. ఇలా టెడ్డీబేర్‌ల పేరిట ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచే వారిలో అబ్బాయిలే ఎక్కువమంది ఉన్నారని ఈ పరిశీలనలో తేలింది.
టెడ్డీబేర్‌లు ట్వీట్లు ఇస్తున్నాయ్!
Published Thu, Nov 7 2013 11:15 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM
Advertisement
Advertisement