41 అంగల్లో ‘ఫినిష్’ | 41 Steps 'Finish' | Sakshi
Sakshi News home page

41 అంగల్లో ‘ఫినిష్’

Published Fri, Jan 31 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

41 Steps 'Finish'

భూమి మీద ప్రాణికోటి పుట్టినట్లుగా చెబుతున్న గత 2 లక్షల సంవత్సరాల కాలంలో అందరికంటే వేగవంతమైన మనిషిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. పరుగు ప్రయాణంలో అతని ఒక్కో అడుగుకు ఎంతో విలువ ఉంది. కనీసం ఇతరుల ఊహకు కూడా అందని అనేక రికార్డులు అలవోకగా సొంతం చేసుకున్న ఆ అథ్లెట్ ఉసేన్ బోల్ట్. ప్రపంచ క్రీడా రంగానికి పరిచయం అవసరం లేని పేరు.
 
 వాస్తవానికి బోల్ట్ గెలుపు ప్రస్థానానికి కారణం ఇదీ అంటూ ఏ పరిశోధనా నిరూపించ లేకపోయింది. అయితే అతని పరుగు సందర్భంగా కొన్ని ప్రత్యేకతలు కనిపించాయి. ఆ ఆసక్తికర అంశాలు, లక్షణాలు అతడిని ఇతరులతో పోలిస్తే ముందు నిలబెట్టాయి. దీనికి సంబంధించి మెక్సికోలోని నేషనల్ అటానమస్ యూనివర్సిటీ బోల్ట్ పరుగుపై ప్రయోగాలు చేసింది. 100 మీ. పరుగులో 9.58 సెకన్లు, 200 మీ. పరుగులో 19.19 సెకన్లతో రికార్డులు ప్రస్తుతం బోల్ట్ పేరిట ఉన్నాయి. అతని ప్రపంచ రికార్డు పరుగును ఉదాహరణగా తీసుకుంటూ అతి క్షుణ్ణ పరీక్ష జరిపారు. ఆ విశేషాలేమిటో చూద్దామా....
 - మొహమ్మద్ అబ్దుల్ హాది (సాక్షి స్పోర్ట్స్)
 
100మీ., 200 మీ. పరుగులో అతను ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రన్నర్...ఈ రెండు విభాగాల్లోనూ అన్ని రికార్డులు అతని పేరిటే ఉన్నాయి.  ఆరు ఒలింపిక్ స్వర్ణాలు...ఎనిమిది ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాలు...ఈ జాబితా చాలా పెద్దది. ఇవన్నీ బోల్ట్‌కు మాత్రమే సాధ్యమయ్యాయి. మరి ఈ జమైకన్‌లో గొప్పతనం ఏమిటి? అసలు బోల్ట్ పరుగు మిగతా అథ్లెట్లకంటే ఏ రకంగా భిన్నం? నైపుణ్యం, దేహదారుఢ్యం, ప్రాక్టీస్...ఇవన్నీ సాధారణంగా చాలా మంది అంతర్జాతీయ అథ్లెట్లలో కనిపించే లక్షణాలే. ఇక సమతలంగా ఉండే మోకాళ్లు అనేవి చాలా మంది జమైకా క్రీడాకారుల్లో కనిపించాయి.
 
 ఉసేన్ బోల్ట్ ఎత్తు 6 అడుగుల 5 అంగుళాలు...ఒక స్ప్రింటర్‌కు సంబంధించి ఇది సాధారణంకంటే ఎక్కువ. అందుకే తన ప్రత్యర్థులకన్నా తక్కువ అడుగుల్లో అతను లక్ష్యం చేరగలడు. బోల్ట్ బరువు 207 పౌండ్లు. భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం...అథ్లెట్లు ఎంత బలంగా నేలపై పాదాలను తోస్తారో అంతే వేగంగా ముందుకు కదలగలరు. అందరూ తమ బరువు కంటే రెండున్నర లేదా మూడు రెట్ల బలంతో నేలపై ఒత్తిడి పెంచి ముందుకు దూసుకుపోతారు. కానీ బోల్ట్ 1000 పౌండ్ల ఫోర్స్‌తో ఆ పని చేస్తాడు. అతని శరీర బరువుకు ఇది దాదాపు ఐదు రెట్లు. మామూలుగానైతే ఇంత ఎత్తు, ఇంత బరువు ఉన్నవారికి అది చాలా కష్టం.
     
 బోల్ట్ ప్రపంచ రికార్డు పరుగు 9.58 సెకన్లకు సంబంధించి ఇందులో ప్రతీ 0.1 సెకన్‌లో ఎలా పరిగెత్తాడో దానిని పరిశీలించారు. దీని ప్రకారం 7వ సెకన్లో అతను అమిత వేగంతో అంటే దాదాపు గంటకు 27 మైళ్ల వేగంతో పరిగెత్తినట్లు తేలింది. మొత్తంగా 3.5 హార్స్ పవర్ వేగంతో బోల్ట్ పరిగెత్తాడు.
     
 పరుగు మధ్యలో పాదం నేలను తాకుతున్న సమయంలో సాధారణ అథ్లెట్లు తమ కాలును 0.12 సెకన్లు నేలపై ఉంచితే వారికంటే 33 శాతం మెరుగ్గా బోల్ట్ కాలు 0.08 సెకన్లు మాత్రమే ఉంటుంది.
     
 వరల్డ్ రికార్డు  (9.58 సె.) సమయంలో నమోదైన కొన్ని గణాంకాలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఈ సమయంలో బోల్ట్ పరిగెత్తిన అత్యధిక వేగం...గంటకు 27.45 మైళ్లు. ఇందులో 5.29 సెకన్ల పాటు  నేలను తాకకుండా అతని కాళ్లు గాల్లోనే ఉన్నాయి.
     
 100 మీ. పరుగులో బోల్ట్ వేసిన అడుగులు కూడా కీలకమే. ఇందులో అతను 41 అడుగుల్లో రేస్ పూర్తి చేశాడు. అదే మిగతా అథ్లెట్లు 45 అడుగుల వరకు తీసుకుంటారు. ఇక్కడే గెలుపు, ఓటమి మధ్య తేడా వస్తుంది.  ఒలింపిక్స్ ఫైనల్లో పోటీ పూర్తి చేసేందుకు  గాట్లిన్ 42.5...బ్లేక్ 46 అడుగులు తీసుకున్నారు. ఈ రేస్‌లో బోల్ట్ వేసిన అన్నింటికంటే పెద్ద అంగ 2.85 మీ. (9.35 అడుగులు) ఉండటం విశేషం.
     
 ఇక బోల్ట్ తీసుకునే ఆహారం కూడా ఒక రహస్యమే. అతను తన ఆహారంగా ఏయే ప్రత్యేక పదార్థాలను తీసుకుంటాడో ఎప్పుడూ వివరాలు వెల్లడించలేదు. అయితే తాను తీసుకునే సూపర్ ఫుడ్ ఎలా ఉంటుందో మాత్రం బోల్ట్ చెప్పాడు. 177 కేలరీల శక్తినిచ్చే ఒక కప్ ఆహారం గురించి అతను వివరించాడు. ఇందులో 34 శాతం విటమిన్ సి, 40 శాతం విటమిన్ బి6, 26 పొటాషియం (ఎలక్ట్రోలైట్)  ఉంటాయి.
 
 బోల్ట్ చేసే కసరత్తులు ఇలా...


 జిమ్‌లో గంటల కొద్దీ గడపడం...భిన్నమైన ఎక్సర్‌సైజ్‌లు ప్రయత్నిస్తూ కండలు పెంచుకునే ప్రయత్నం చేయడం ఈతరం యువకుల్లో చాలా మందికి రొటీన్. మరి ప్రపంచంలో ఫాస్టెస్ట్ రన్నర్ అంటే ఎలా ఉంటాడు. అతని ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుంది. ఇదే విషయం ఉసేన్ బోల్ట్‌ను అడిగితే ఇందులో రహస్యాలు ఏమీ లేవంటూ గట్టిగా నవ్వేస్తాడు. తాను ప్రపంచంలోని ఎక్కడా లేని ఎక్సర్‌సైజ్‌లు చేయనని, అందరిలాగే...అందరికీ అందుబాటులో ఉండే ఫిట్‌నెస్ పద్ధతులే అవలంభిస్తానని అతను చెప్పాడు. అయినా ఇందు కోసం ఉండాల్సిందల్లా కాస్త క్రమశిక్షణ, కూసింత పట్టుదల అనేది బోల్ట్ సిద్ధాంతం. అందుకే తాను ఎంచుకునే ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌ల గురించి  కొన్ని కిటుకులు చెప్పాడు. బలం, వేగం, నైపుణ్యం కీలకమంటూ బోల్ట్ తన పంచ రత్నావళి చెప్పాడు. అవేంటో చూద్దాం...
 
 బన్నీ హాప్స్  

 (5 సెట్‌లు, ఒక్కోటి 20 సార్లు చొప్పున)
     
 బాక్స్ జంప్స్
 (4 సెట్‌లు, ఒక్కోటి 8 సార్లు చొప్పున)
     
 బౌండింగ్

 (3 సెట్‌లు, ఒక్కోటి 10 సార్లు చొప్పున)
 నడుము కింది పటిష్టత కోసం... ముఖ్యంగా మోకాళ్లలో బలం, సుదీర్ఘ సమయం పాటు పరిగెత్తేందుకు మరో రెండు రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయమని  బోల్ట్ చెబుతున్నాడు. ఎనిమిది వారాల పాటు హిప్ ఫ్లెక్సియాన్ రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్ చేస్తే సాధారణంకంటే 9 శాతం ఎక్కువ వేగంతో పరిగెత్తగలరని, ఇకపై ఆఫీసుకు వెళ్లే వారు ఎవరైనా కొద్ది తేడాతో బస్సును మిస్ కాలేరని బోల్ట్ సరదాగా అంటాడు.
 
 కేబుల్ నీ డ్రైవ్స్ (3 సెట్‌లు, ఒక్కోటి 10 సార్లు చొప్పున)
     
 హ్యాంగింగ్ లెగ్ రెజైస్ (3 సెట్‌లు, ఒక్కోటి 10 సార్లు చొప్పున)
 మరి మీలో ఎంత మంది బోల్ట్‌ను ఫాలో అవుతారో చూద్దామా...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement