దాదాపు అన్ని మొక్కలూ మొగ్గతొడిగేయి.
అందుమీదట ఏ మొక్క ముందు పూస్తుందనే ప్రశ్న వచ్చింది.
మొదటి వరుసలోదా, మూడో వరుసలోదా?
రెండు ఇళ్లకి మధ్యనున్న బంతిమొక్కల పక్కన రాతిమీద కూర్చొని, మొక్కలవైపూ మొక్కల్లోకీ చూస్తోంది కమలబాల.ఊరవతల తోట. ‘ది గార్డెను’ అది. తోటమధ్య పెద్దమేడ. అది మెయిన్ హవుసు. మేడకి కొంచెం పడమటగా చిన్న పెంకుటిల్లు. అది గెస్ట్ హవుసు.మేడగల పెద్దమనిషి కలకత్తాలో వ్యాపారంగల మనిషి. అతగాడు ప్రతియేటా వేసంగికి మాత్రం చల్లగాలికోసం స్వంతవూరుకి కుటుంబంతో సహా వచ్చి నెల్లాళ్లుండి వెళ్లే అలవాటుగల పెద్దమనిషి. ఆయన కలకత్తాలో ఉండేప్పుడు, ఇక్కడ మేడని అద్దెకి ఇవ్వవచ్చు. కాని దిగినవాళ్లని ప్రతియేటా వేసంగికి ఖాళీ చేయమనడం బావుండదు. అందుచేత మేడ ఇంటిని తాళాలు బిగించి ఉంచేరు. గెస్ట్ హవుసుని మాత్రం అద్దెకిచ్చేరు.
ఇల్లు చిన్నదైనప్పటికీ, ఊరికి దూరంగా ఉన్నప్పటికీ, అద్దె తక్కువ కాబట్టి అందులో ప్రవేశించేరు అవతారం గారు.కిందటేడు ఏప్రెల్లో, కమల మూడో ఫారం పరీక్ష రాసి పాసయిన రోజుల్లో ఆమెకు పన్నెండోయేడు దాటింది. వెంటనే ఈ యింట్లోకి వచ్చి పడింది.‘‘స్కూలు ఇక్కడికి చాలాదూరం, అవునా? ఒక్కర్తెవీ అంతదూరం నడిచి వెళ్లలేవు కద. థర్డుఫారం ఫస్టుగా పాసయేవు. ఏం చాల్దూ? సీతాలక్ష్మిని చూడు, ఎమ్మే పాసయిందా? పాసవుతేమాత్రం పెళ్లి చేసుకోక తప్పిందా?’’ అంటూ కొన్ని కారణాలు చెప్పి కమలని స్కూల్ మాన్పించివేసేరు అవతారం గారు.
అవి అసలు కారణాలు కావనీ, అసలు కారణం వేరే ఉందనీ ఆరోజే తెలిసింది కమలకి. తల్లిదగ్గర మారాం చేసి ఏడవగా, విసిగిపోయి కేకలు వేసింది శేషమ్మ గారు.‘‘మీ అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లూ పదిమందికీ ఎఫ్ఫేలూ ఎమ్మేలూ చెప్పంచడానికి మీ నాన్న లక్షాధికారనుకున్నావా? ఏడుపు కట్టిపెట్టు. ఎండెక్కింది. ఆ పచ్చికర్రలు ఎండలో పడేసి పెట్టు’’ అని విసవిస వెళ్లింది వంట దగ్గరికి.అందుమీదట కళ్లు తుడిచేసుకొంది కమలబాల. అప్పణ్నించీ ఎవరూ చూడకుండా కళ్లు తుడిచేసుకోవడం అలవాటు చేసుకొంది.కోపంగా ఉండడం చేత అవతారంగారి భార్య సంతానం సంఖ్య ఎక్కువ చేసుకుందేగాని నిజంగా లేరావిడకి పదిమంది పిల్లలు. కమల పుట్టిన పదేళ్లకి కడసారిది విమల కలిగింది. ఈమధ్యకాలంలో ఉద్భవించినవాళ్లు నలుగురు. వరసగా సీతారాముడు, రాధాకృష్ణుడు, పార్వతీప్రసాదుడు, గంగాధరుడు.
‘‘ఒరే సీతా, ఒరేయ్ రాధా! ఏవర్రా గంగా, పార్వతీ! ఎంతసేపయింది ఒడ్డించీసి. ఇంకా అక్కడే కూర్చున్నారూ? ఎక్కడ దాపరించేయో ఆ మొక్కలు. మీ అక్కకి మతిపోతే మీకూ మతులు పోతున్నాయర్రా! రండి’’ ఇదీ శేషమ్మగారు వేసే కేక.కొత్త ఇంటికి రాగానే అవతారంగారి భార్య పెరట్లో ధనియాలు చల్లింది, కాకరపాదు పెట్టింది. దొండబడ్డు నాటింది. ఓరోజున కమల అటూ ఇటూ తిరిగి పరుగెత్తుకొచ్చి,
‘‘అమ్మా, ఎరువుకుప్ప దగ్గిర కొత్తిమీరి మొక్కలు ఎన్నున్నాయనుకున్నావ్’’ అంది.
‘‘అవి బంతిమొక్కలే బభ్రాజమానవా?’’
‘‘బంతిపువ్వులు పూస్తాయా?’’
‘‘బంతి మొక్కలకి బంతి పువ్వులు పుయ్యకపోతే పొట్లకాయలు కాస్తాయనుకున్నావుటే. చదవ్వేస్తే ఉన్న మతి కూడా పోయిందిట’’ అంది శేషమ్మగారు.
ఆరోజు నుంచే కమలకి మతిమారడం జరిగింది. వెంటనే పువ్వులతోట వేసేద్దా మనుకోలేదు కమల. మసిబొగ్గుల్లో మాణిక్యం కనిపిస్తే దాన్ని వేరే తీసేసి దానికి తగిన ఏర్పాట్లు చేసినట్టుగా, ఎరువుకుప్ప నుంచి బంతి మొక్కల్ని వేరు చేయాలని కలిగిన ఆలోచన ‘‘పూలతోట’’కి దారితీసింది. తరువాత ఆ ఎరువునే మోసుకొచ్చి ఆ మొక్కలకే వేయడం జరిగిందనుకోండి. ఆ మొక్కల్ని కొన్ని తీసుకొచ్చి పెరట్లో పాతింది కమల.
పాతడానికి పిసరైనా సాయం చెయ్యని పెద తమ్ముడు సీతగాడు– ‘‘అక్కయ్యా, పెరట్లో వేస్తున్నావా? ముందువేపు వేస్తే షోగ్గా ఉండదుటే’’ అని ఇంటిముందు నాటమని సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటించింది కమల. ‘‘లైనుగా వేస్తే బావుంటుంది కదే’’ అన్నాడు రాధ. అలాగే చేసింది కమల. ‘‘దగ్గిరగా పాత్తే మన గదిలో సామాన్లాగా ఇరుగ్గా ఉంటుందే. దూరంగా పాద్దూ’’ అన్నాడు పార్వతి. ‘‘చాతనైతే సాయం చెయ్యి. లేకపోతే నోరుమూసు క్కూచో’’ అనేసినప్పటికీ మొక్కల్ని దూరంగానే నాటింది కమల. గంగగాడు సలహాలేవీ ఇవ్వకుండా, చిన్న చెంబులో నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చేడు. విమల సలహాలూ ఇవ్వలేదు, ఊరికే కూర్చోనూ లేదు. కొన్ని నాటబోయి, కొన్ని తొక్కేసి, కమలచేత చీవాట్లు తిని, సీతచేత ఓదార్చబడి, అమ్మ దగ్గరకి తీసుకుపోబడింది.
ఆఖరికి, ఆ సాయంకాలానికి అంతా కలిసి ఆరు వరసల్లో ముప్ఫై బంతిమొక్కలు నాటేరు. సాయంత్రం ముప్ఫయి కూడా సొమ్మసిల్లిపోయి తలలు వేళ్లాడేసేయి.
ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు లేడు. మేఘాలూ లేవు. చుక్కలున్నాయి కాని వాటివైపు చూడ్డంలేదు కమల. బుడ్డిదీపం పట్టుకొని, మొక్కల్ని బిక్కూ బిక్కూ చూసింది. మొక్కలు బతకవేమోననే బెంగచేత అవతారాన్నీ శేషమ్మనీ బతకనిచ్చింది కాదు కమల. ఆ రాత్రి తనకి ఎప్పుడు నిద్రపట్టిందో కమలకి తెలీదు. ఎక్కణ్నించో మేఘాలు వర్షించి వెళ్లిపోయాయన్న సంగతీ తెలీదు.
మర్నాడు ఇంటిముందుకు వెళ్లి చూసి, కెవ్వున కేకవేసి మడిదగ్గరకి పరిగెట్టింది. తల్లికి తెలుస్తుంది; తండ్రికీ తెలుస్తుంది; భగవంతుడికి తెలిసే ఉంటుంది; ప్రాణాన్నీ జీవితాన్నీ పెంచి పోషించేవారందరికీ తెలిసితీరాలి. ఆ ఉదయం తలలెత్తి నిల్చున్న చిన్న ఎత్తు బంతిమొక్కలు ఓ పదమూడేళ్ల ఆడపిల్లకి కలిగించిన సంతోష, సంభ్రమ, ఉద్వేగాలు ఎటువంటివో ఏమిటో.
ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది. అటు ఆ మొక్క దగ్గరికి పరిగెట్టింది. ఇదే కమల ఈ మొక్కా అయింది. ఇదే కమల ఆ మొక్కా అయింది. నిన్నటి రాత్రి నీటిమబ్బూ ఈ కమలే. ఆ కమలే ఈ ఉదయం సూర్యరశ్మిగా మెరుస్తోంది. ఆ ఉత్సాహమే కమలని మరోకమలగా చేసింది. మొక్కల్ని పెంచడమే పనయిపోయింది. కాని పెంచే అధికారం కమలొక్కర్తే గుత్తకి పుచ్చుకోలేదు. నీళ్లు పోస్తూండడమే గంగగాడి పని. బొరిగా తొళ్లికా తెచ్చే పని పార్వతిగాడిది. ఎరువు పొయ్యడం రాధగాడి పనుల్లో ఒకటి. రెండు పూట్లా తనిఖీ చేసే అధికారి సీతగాడు. ఆఫీసు నుంచి వచ్చేక మొక్కల దగ్గర వాలుకుర్చీ వేసుకొని న్యూస్‌పేపరు చదువుకొనేప్పుడు రాతిమీద కూర్చుని ఏదో కుడుతూ మధ్యమధ్య మొక్కల్నీ పిల్లల్నీ మెచ్చుకు గొప్పపడ్డం శేషమ్మగారి పని.
ఓ రోజు పొద్దున్నే, ‘‘అక్కయ్యా! మొగ్గ మొగ్గ!’’ కేకేసేడు పార్వతి. ఓ ఘడియసేపు వెర్రెత్తినట్టుగా తిరిగింది కమలబాల.దాదాపు అన్ని మొక్కలూ మొగ్గతొడిగేయి. అందుమీదట ఏ మొక్క ముందు పూస్తుందనే ప్రశ్న వచ్చింది. మొదటి వరుసలోదా, మూడో వరుసలోదా? అని తర్జన భర్జన జరుగుతూండగానే అన్నిటిలోకీ పొట్టి మొక్కకి ఒక పువ్వు కొంత విడింది. బంగారమే అంతగా పండింది.
అప్పట్లో కమలకే కాదు, పిల్లలందరికీ వెర్రులెత్తేయి. అవతారంగారు కూడా సంతోషం ప్రకటించకుండా ఉండలేకపోయారు. శేషమ్మగారు కూడా చిన్నదయింది. విమల గెంతులు వేసింది. పువ్వు బాగా విడాక ‘‘విమలా, పువ్వు ముట్టుకోకేం’’ అని కమల హెచ్చరించడంతో పువ్వులెవ్వరూ తెంపరాదనే రూలుకి పునాది ఏర్పడిందని చెప్పవచ్చు.
పూసిన ఒక్క పువ్వూ కోసేడమేనా? మరోటి కూడా బాగా విడాక కొయ్యొచ్చు అని ఆదిలో అనుకున్నారు. తరువాత ప్రతి మొక్కకి అధమం ఒక పువ్వయినా విడితేగాని తెంపరాదనుకున్నారు. చివరికి అన్నీ పూసేయి.
అప్పుడు విమలని పొట్టిమొక్కదో పువ్వు తెంపుకోనిచ్చింది కమల. తనే తెంపి ఇచ్చింది. తెంపిందే కాని తెగ విచారించింది.
‘‘అక్కయ్యా! మేక తినేస్తే మొక్కలేడుస్తాయని చెప్పేవు కదా ఆ వేళా. మరి నువ్వెందుకే పువ్వు తెంపేసేవూ?’’ అని అడిగేడు గంగగాడు. ‘‘మరింకెప్పుడూ తెంపొద్దురా’’ అంది కమల పెద్ద నిశ్చయానికి వచ్చేసి.
తను ఏర్పరుచుకున్న ఆ అందాన్ని చూస్తూ అక్కడ రాతిమీద కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు మరిచేది కమలబాల. దూరంలో ఉన్న స్కూలూ; మెరిసే కంచుగంటా; ప్రార్థన పాటా; తనకీ సావిత్రికీ తెలుగులో ఫస్టుమార్కుల పోటీ; ఇంగ్లీషు స్పెల్లింగ్సూ; లెక్కల స్టెప్సూ, అన్నిటి గురించీ మర్చిపోయేది.
అలా ఓ రోజున మొక్కల దగ్గర కూర్చున్నప్పుడు వచ్చేడు బక్క భగవాన్లు. ఇంటివారి వ్యవహారాలన్నీ చూసే ఉద్యోగం భగవాన్లుది. అద్దె పుచ్చుకున్నాక ‘‘ఇంటివాళ్లు క్రిస్‌మస్‌కి వస్తున్నారండోయ్’’ అని చెప్పేసి పోయేడు.
ఇంటివారంటే అంత ఇష్టం లేదు కమలకి. ఇంటాయన చిన్నింటివైపుకి రాడు. ఇంటావిడ మంచిమనిషిలాగే కనిపిస్తుంది. పెద్దకూతురు అత్తవారింట్లో పొట్టతో ఉంటుంది. రెండో కూతురు పదహారేళ్లదే అయినప్పటికీ పాతికేళ్ల మనిషిలా ఉంటుంది. మూడో అమ్మాయి నెమ్మదిగానే ఉంటుంది. పదేళ్లది. ‘‘రెండు జడలమ్మాయి’’ అంటారు.
నిన్న మధ్యాహ్నం కారు దిగేరు ఇంటివారు. ఉదయాన్నే లేచింది కమల. మధ్యాహ్నం ఇంటివారి నౌఖరు శేషమ్మగార్ని బిందె ఒకటి అడిగి పట్టుకెళ్లేడు. మరేం విశేషాల్లేవు.
మధ్యాహ్నం మూడు గంటలకి మాత్రం– చిన్న బిందెలో నీళ్లు పట్టుకొచ్చిన కమల, బిందెని విడిచేసి పరిగెట్టింది మొక్కల దగ్గరికి.
వరండాలోకి ఇంటావిడా, గుమ్మంలోకి శేషమ్మగారూ ఒక్కసారే వచ్చేరు.
ఇంటివారి ఆఖరమ్మాయి, బ్లూ గౌను తొడుక్కున్నది, గాలికొట్టిన బంతిలా ఉన్నది–
‘‘నే కోసుకుంటా. నా యిష్టం’’ అని గట్టిగా అరుస్తోంది. ‘‘వీల్లేదు’’ అని కమల కేకలేస్తోంది. ఇద్దరూ పెనుగులాడుతున్నారు. మూడు బంతిపువ్వులు నలిగి నేలని పడ్డాయి.
‘‘ఏం పిల్లా! ఏవిటా అల్లరీ?’’ అని ఇంటావిడ కమల్ని మాత్రం ఉద్దేశించి అడిగింది. ఇద్దరమ్మాయిలూ పెనుగులాట ఆపేసి, నిల్చుండిపోయారు. శేషమ్మగారొచ్చి కూతురి చెయ్యి పట్టుకు నిల్చుంది.
‘‘ఆ పువ్వులే అంత మహా భాగ్యంటమ్మా? కోసుకుంటుంది మా బేబీ, దాన్నేం అనకండి’’ అని శేషమ్మగారితో చెప్పి లోనికి వెళ్లిపోయింది ఇంటావిడ.
తల్లి ముఖంలోకి చూసింది కమల. బేబీని వారించడానికి శేషమ్మగారికి ధైర్యం లేదని ఆమె ముఖం చెప్తోంది. వెనక్కి తిరిగి చూడకుండా, ఇంటివైపుకి నడిచారు తల్లీకూతుళ్లు.
బంతిపువ్వులే మహాభాగ్యమా?
కళ్లు తుడుచుకుంది కమలబాల.
రావిశాస్త్రి
సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి (1922– 93) కథ ‘పువ్వులు’ సంక్షిప్త రూపం ఇది. 1955లో ఆంధ్రపత్రికలో అచ్చయింది. సౌజన్యం: కథానిలయం. అల్పజీవి, రాజు మహిషి, రత్తాలు రాంబాబు, ఆరు సారా కథలు, రుక్కులు రావిశాస్త్రి పుస్తకాల్లో కొన్ని.
పువ్వుల కన్నీళ్ళు
Published Mon, Jun 3 2019 12:03 AM | Last Updated on Mon, Jun 3 2019 12:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment