ఎన్ని విధాలుగా కూడా గాడిద బయటికి వచ్చే మార్గం కనబడలేదు. ఇక దాన్ని తీయలేక, అలాగని వదిలేయలేక– అలాగే ప్రాణాలతో పూడ్చిపెట్టడానికి సిద్ధమయ్యాడు.
ఒక ఊళ్లో ఒకాయనకు గాడిదే సర్వస్వం. దాని మీద మోసుకొచ్చే సరుకులతోనే అతడి జీవితం గడిచిపోయేది. అట్లానే ఒక పనిమీద ఆయన గాడిదను తోలుకొని పొరుగూరు వెళ్లాడు. దానికోసం ఒక చిట్టడవిని దాటాలి. అలా వెళ్తుండగా, ఒక చోట ప్రమాదవశాత్తూ ఒక పెద్ద గుంతలో పడిపోయిందా గాడిద. దాన్ని బయటికి తీయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు యజమాని. చెట్టు కొమ్మలను విరిచేశాడు, దాని ఆసరాగా ఎక్కొస్తుందని. తాడు పేని లాగడానికి యత్నించాడు. ఎన్ని విధాలుగా కూడా గాడిద బయటికి వచ్చే మార్గం కనబడలేదు.
ఇక దాన్ని తీయలేక, అలాగని వదిలేయలేక– అలాగే ప్రాణాలతో పూడ్చిపెట్టడానికి సిద్ధమయ్యాడు. మట్టిని గుంతలో నింపడం మొదలుపెట్టాడు. మీద పడిన మట్టిని దులుపుకుంటూ గాడిద కొంచెం పైకి వచ్చింది. ఆయన మరింత మట్టిని పోస్తూనేవున్నాడు. గాడిద దాన్ని దులిపేసుకుంటూ మరికొంత పైకి వస్తూనేవుంది. ఎంత మట్టి పోస్తుంటే అంత పైకి రాసాగింది. సాయంత్రంకల్లా పూర్తిగా బయటకు వచ్చేసి ఆబగా గడ్డిని మేయసాగింది. దాన్నే చూసుకుంటూ కూర్చున్న యజమాని మనసులో అనుకున్నాడు: ‘నేను ఎంత పొరపాటుగా ఆలోచించాను! కష్టమొచ్చిందని దాన్ని నేను పాతేయబోయాను. కానీ అదే కష్టాన్ని దులిపేసుకుంటూ అది పైకి వచ్చేసింది. ఈ పాఠాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను’. నెమ్మదిగా వెళ్లి, గాడిదను ప్రేమగా నిమరసాగాడు.
Comments
Please login to add a commentAdd a comment