దేవుడు నాకు అన్నీ ఆలస్యంగానే ఇస్తాడు... | Actress Amani interview | Sakshi
Sakshi News home page

దేవుడు నాకు అన్నీ ఆలస్యంగానే ఇస్తాడు...

Published Sat, Apr 19 2014 10:12 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Actress Amani  interview

తెలుగింటి మధ్యతరగతి ఇల్లాలంటే ఎలా ఉంటుంది?
 కొంచెం కారంగా... ఇంకొంచెం గారంగా... మరికొంచెం మమకారంగా... కాస్తంత వెటకారంగా...
 అసలు ఇదంతా ఎందుకు?
 అచ్చం ఆమనిలా ఉంటుందంటే సరిపోతుందిగా.
 నిజమే... ఆమె చేసిన పాత్రలన్నీ అలాంటివే.
 శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం, శుభసంకల్పం, ఆ నలుగురు...
 కన్నడ అమ్మాయి అయిన ఆమని ఇలాంటి సినిమాలతో తెలుగింటి పిల్ల అయిపోయింది.
 పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై అప్పుడప్పుడూ తళుక్కుమంటోన్న ఆమని గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.
 ఈ ఇంటర్వ్యూ చదివితే కొంతలో కొంతైనా ఆ లోటు తీరుతుంది.

 
 మీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అనిపిస్తోంది?
 తృప్తికరంగా ఉంది. ఇప్పుడిప్పుడే మంచి పాత్రలకు అవకాశం వస్తోంది.
 
 ‘ఆ నలుగురు’ తర్వాత ‘దేవస్థానం’కి దాదాపు ఎనిమిదేళ్లు విరామం తీసుకున్నారు. మళ్లీ రెండేళ్లకు ‘చందమామ కథలు’ చేశారు. ఎందుకీ గ్యాప్?
 ‘ఆ నలుగురు’ తర్వాత నాకు మంచి పాత్రలు రాలేదు. వచ్చినవి కూడా నా వయసుకు మించిన పాత్రలు కావడంతో నేనే ఆసక్తి కనబరచలేదు. నాలుగు పదుల వయసులో ఉన్నా మరీ ముసలి వయసు పాత్రలు చేయడం సరిగ్గా అనిపించలేదు. అందుకే తిరస్కరించా. ఒకవేళ నేను వృద్ధ పాత్ర చేసినా, సినిమాలో దానికో అర్థం ఉండాలి. అలాంటివైతే తప్పకుండా చేస్తా.
 
 రానున్న మీ ‘చందమామ కథలు’లో మీకు నచ్చిన అంశాలేంటి?
 నా కెరీర్‌లో ఇప్పటివరకు నేనిలాంటి సినిమా చేయలేదు. ఒక సినిమాలో ఎనిమిది కథలు అనగానే, భలే అనిపించింది. అన్ని కథలూ బాగుంటాయి. పెద్ద నరేష్ గారిది, నాదీ ఒక కథ. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలుస్తుందనీ, ప్రతి ఒక్కరికీ ఒక తోడు కావాలనీ మా కథ చెబుతుంది. తెలుగులో నా తొలి హీరో నరేష్. ‘జంబలకిడి పంబ’ తర్వాత ఇద్దరం కొన్ని సినిమాలు చేశాం. మళ్లీ ఇన్నేళ్లకు మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది.
 
 ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. కథానాయికగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు.  అది తొందరపాటని ఎప్పుడైనా అనిపించిందా?
 లేదు. అప్పటికే చాలా సినిమాలు చేసేశాను. ఇక, జీవితంలో స్థిరపడితే బాగుంటుందనే ఆలోచన బలంగా ఉండటంతో పెళ్లి చేసుకున్నాను. ‘ఇన్నేళ్లూ తీరిక లేకుండా సినిమాలు చేశావ్ కదా.. ఇక విశ్రాంతి తీసుకో’ అని మావారు అనడంతో, సినిమాలు చేయలేదు.
 
 మీది ప్రేమ వివాహం... పైగా మతాంతర వివాహం కాబట్టి, అత్తగారింట్లో సర్దుకుపోవడానికి ఏమైనా ఇబ్బంది అనిపించిందా?
 నాకు కుల, మతాల పట్టింపు లేదు. కానీ, అత్తగారింటి వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పట్టింది. ఏ ఆడపిల్ల విషయంలో అయినా ఇది సహజమే కదా. అయితే, మా ఇల్లు సర్వమత సమ్మేళనం అనొచ్చు. అన్ని దేవుళ్లూ ఒకటే అని మా భావన. దేవాలయాలతో పాటు దర్గాలకూ, చర్చిలకూ వెళతాను. మావారు కూడా నాలానే! గతంలో ఆయన సినిమాలు నిర్మించేవారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
 
 మళ్లీ సినిమాల్లో నటించాలని అనిపించడానికి కారణం?
 కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి తీరిక లేనంతగా పని చేసిన తర్వాత ఒక్కసారిగా ఖాళీగా ఉంటే, కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత బోర్ కొట్టడం, బాధ కలగడం రెండూ జరుగుతాయి. అలాంటి పరిస్థితిలోనే నేను మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్నాను. సినీ ప్రపంచంలోని జోష్‌కి దూరం కావాలని దాదాపు ఎవరూ అనుకోరు. మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నానని మావారితో అనగానే ‘ఓకే’ అన్నారు.
 
 మీ వైవాహిక జీవితంలో ఏవో ఆటుపోట్లు ఎదురయ్యాయని వార్త వచ్చిందే!
 నా వైవాహిక జీవితం బాగుంది. నాకూ, మావారికీ మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవు. హైదరాబాద్‌కు మారిపోవచ్చు కదా అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. మావారు స్థిరపడింది చెన్నై అని తెలిసిందే. మా అత్తగారింటిని వదులుకుని నేను హైదరాబాద్‌కు రాలేను. కానీ, నా కారణంగా షూటింగ్‌లకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. అందుకే, హైదరాబాద్‌కు మారకపోయినా ఫరవాలేదు. ఒకవేళ నా వైవాహిక జీవితం గనక సరిగ్గా లేకపోతే, నేను హైదరాబాద్‌కు షిప్ట్ అయిపోయి ఉండేదాన్ని కదా!
 
 సినిమాలపరంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న మీరు ఆ మధ్య వివాదాల్లో నిలిచారు. మీరు తనను హింసించారంటూ మీ మరదలు పేర్కొన్నారు కదా?
 డబ్బులు ఆశించి ఆడిన డ్రామా అది. నా సోదరుడు, అతని భార్య విడిపోవాలనుకున్నారు. కానీ, నన్ను కూడా వివాదంలోకి లాగితే డబ్బులు తీసుకోవచ్చు కదా! వాళ్లు అనుకున్నది సాధించారు. అది సాధించే క్రమంలో లేనిపోని దుష్ర్పచారంతో నన్ను చెడ్డదాన్ని చేశారు. నేనేంటో, నా స్వభావం ఎలాంటిదో సినిమా పరిశ్రమలో ఉన్న అందరికీ తెలుసు. షూటింగ్ లొకేషన్‌లో ఎంత క్రమశిక్షణగా ఉంటానో, అందరినీ ఎలా గౌరవిస్తానో కూడా తెలుసు. నేను వరకట్నం కోసం వేధించానని నిందించారు. కథానాయికగా ఓ ఏడెనిమిదేళ్లు విరామం లేకుండా సినిమాలు చేసి, చాలా డబ్బు సంపాదించుకున్నాను. ఇక, నాకు వేరేవాళ్ల డబ్బు ఎందుకు?
 
 ఒక్కసారిగా ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నప్పుడు ఎలా అనిపించింది?
 చాలా బాధపడ్డా. ఆ అమ్మాయి నాతో బాగానే మాట్లాడేది. నిజానికి తాను నన్ను నిందించలేదనీ, అదంతా మీడియా వాళ్ల సృష్టే అనీ ఆ తరువాత ఓ సందర్భంలో పేర్కొంది. కానీ, పనిగట్టుకుని అలా చేయాల్సిన అవసరం మీడియాకు ఎందుకుంటుంది? నన్ను బజారుకీడ్చడానికి ప్రయత్నం చేయలేదంటూ ఆమె నన్ను నమ్మించే ప్రయత్నం చేసింది. నేనేమీ అనలేదు. అంతా  ఆ పైవాడు చూసుకుంటాడని వదిలేశాను. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా మా మధ్య గొడవలేం లేవు. తను, నా సోదరుడు నాతో బాగానే ఉంటున్నారు. వాళ్ల పిల్లలను నా సొంత పిల్లల్లా చూసుకుంటాను.
 
 మరి.. మీ పిల్లల గురించి..?
 ఇంకా లేరు. ఆ దేవుడు నాకన్నీ ఆలస్యంగానే ఇస్తాడు. ఇది కూడా అంతే అనుకుంటున్నాను. కానీ, ఆలస్యంగా ఇచ్చినవన్నీ నాకు ఆనందాన్నే ఇచ్చాయి. కాబట్టి, ఈ ఆనందాన్ని కూడా చవి చూస్తాననే నమ్మకం ఉంది.
 
 అన్నీ ఆలస్యంగా అంటే.. సినిమాల్లో అవకాశాలకి చాలా కష్టాలు పడ్డారా?
 కొంతమంది నాయికల్లా సులువుగా హీరోయిన్‌ను అయిపోలేదు. చాలా కష్టాలు పడ్డా. అవకాశాలు తెచ్చుకోవడానికి సమయం పట్టింది. అందుకే నాకు ఆ విలువ తెలుసు. సినిమా మీద ప్రేమే కాదు భక్తి కూడా ఉంది నాకు.
 
 హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా?
 మా నాన్నగారు చలనచిత్రాల పంపిణీదారుడిగా చేసేవారు. కానీ, నేను పెరిగి పెద్దయ్యేసరికే విరమించుకున్నారు. దాంతో సినిమా రంగంలో ఉన్నవాళ్లతో టచ్‌లో లేరు. నాకేమో చిన్నప్పటి నుంచీ హీరోయిన్ కావాలని ఉండేది. కానీ, హీరోయిన్‌గా అంటే నాన్న ఒప్పుకోలేదు. అమ్మ ప్రోత్సహించడంతో చెన్నైలో ఉన్న మా బంధువు ఇంటికెళ్లాను. ఆయన కూడా సినిమా రంగానికి చెందినవారే. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేవి. చివరికి ‘పుదియ కాట్రు’ అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేసినా, తెలుగులో వచ్చినంత గుర్తింపు రాలేదు. ఇక్కడ ‘మిస్టర్ పెళ్లాం’, ‘జంబలకిడి పంబ’, ‘శుభలగ్నం’... ఇలా మంచి మంచి సినిమాల్లో అవకాశం వచ్చింది.
 
 మాతృభాష కన్నడంలో కన్నా తెలుగులో పేరు రావడం పట్ల మీ ఫీలింగ్?
 ఇక్కడ గొప్ప గొప్ప పాత్రలు చేశాను. ఇప్పటికీ నన్ను చాలామంది ‘శుభలగ్నం ఆమని’ అంటున్నారు. నన్ను తమ కుటుంబ సభ్యురాలిలా ప్రేక్షక జనం భావిస్తున్నారు. ఏ నటికైనా ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది.
 
 ఇంతకీ మీ అసలు పేరు? వెండితెరపై మిమ్మల్ని ‘ఆమని’ని చేసిందెవరు?
 నా అసలు పేరు మంజుల. దర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణ గారే నా పేరును ‘ఆమని’ అని మార్చారు. ‘నీ పేరు మార్చేశాం’ అని ఒకరోజు ఆయన చెబితేనే తెలిసింది... ‘ఆమని’ అని పెట్టారని.
 
సినిమా రంగంలో మీకు అత్యంత సన్నిహిత మిత్రులెవరు?
సౌందర్య, నేను ప్రాణ స్నేహితురాళ్లలా ఉండేవాళ్లం. ఇద్దరం బెంగళూరు వాళ్లమే. మా మధ్య స్నేహం పెరగడానికి అదో కారణం కావచ్చు. ఎందుకంటే, ఎప్పుడైనా షూటింగ్స్‌లో విరామం దొరికి, బెంగళూరులో ఉన్నామనుకోండి... తప్పకుండా కలిసేవాళ్లం. సౌందర్య వాళ్ల అమ్మ నన్ను కూడా ఓ కూతురు అనుకుంటారు. నేను, సౌందర్య వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేంత ఆప్తమిత్రులం. ఆమె మరణం నిజం కాకపోయి ఉంటే బాగుండు అని ఇప్పటికీ అనిపిస్తుంటుంది.
 
ఆ మధ్య ఓ టీవీ షో చేశారు. మళ్లీ అలాంటి ఆలోచన ఉందా?
అది సరదాగా చేశాను. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి, టీవీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ఇప్పుడూ అంతే. కాకపోతే మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను.
 
 - డి.జి. భవాని
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement